ఒరిజినల్ వైసీపీ ఇంకా బయటకు రాలేదా ?
వైఎస్సార్ అన్న మూడు అక్షరాలకు అంకితం అయిన హార్డ్ కోర్ పార్టీ జనం. మరి వారంతా ఇపుడు ఏమయ్యారు, ఏమి చేస్తున్నారు అన్నదే పార్టీలో చర్చగా ఉంది.
By: Satya P | 8 Sept 2025 11:00 PM ISTవైసీపీలో ఏమి జరుగుతోంది, ఆ పార్టీలో భయంకరమైన సైలెంట్ కి అర్ధం ఏమిటి, పార్టీ మాది అని చొక్కాలు చింపుకున్న వారు, ప్రత్యర్థుల మీద దూకుడు చేసి ఎలుగెత్తి వైసీపీ గురించి నినదించిన వారు ఇపుడు ఎక్కడ అన్న చర్చ సాగుతోంది. వారంతా వైసీపీకి పెట్టుబడి, ఒక విధంగా చెప్పాలంటే మూల ధనం. అసలైన రాజకీయ ధానం. ఆ పార్టీ పుట్టడంతోనే కట్టుబడిపోయిన అభిమాన జనం. వైఎస్సార్ అన్న మూడు అక్షరాలకు అంకితం అయిన హార్డ్ కోర్ పార్టీ జనం. మరి వారంతా ఇపుడు ఏమయ్యారు, ఏమి చేస్తున్నారు అన్నదే పార్టీలో చర్చగా ఉంది.
మౌనముద్ర తో ఇలా :
వైసీపీని గెలిస్తే తామే గెలిచినట్లు జగన్ సీఎం అయితే తామే అయిపోయినట్లుగా ఎంతో సంబరం చేసుకున్న వారు ఒరిజినల్ వైసీపీ వారుగా ఉంటూ వచ్చారు. వీరు జగన్ కాంగ్రెస్ ని బయటకు వచ్చి వేసిన తొలి అడుగులో నుంచి పార్టీకి కొమ్ము కాస్తూ వస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటేయమని జనం వద్దకు వెళ్ళి విపరీతంగా ప్రచారం చేసిన వారు. ఏకంగా పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. తమ ఆస్తులను తమ జీవితాలను పూర్తిగా పార్టీకి పెట్టేసి ఏకంగా ప్రాణం పెట్టిన వీరంతా 2019 నుంచి 2024 మధ్యలో సాగిన వైసీపీ ఏలుబడిని చూసి ఖంగు తిన్నారు. జగన్ అధికారంలోకి రావడంతోనే తమను విస్మరించడం పాలన అంతా తనదైన ఏకపక్ష ధోరణితో సాగించడంతో వీరు నాటి నుంచే పక్కకు తప్పుకున్నారు.
కడు దూరంగానే ఉంటూ :
ఇక వీరు 2024 ఎన్నికల్లో వైసీపీ కోసం గట్టిగా ఎక్కడా పనిచేయలేదని అంటారు. కనీసం తమ పార్టీకి ఓటేసి గెలిపించమని కూడా జనాల వద్దకు వెళ్ళి ప్రచారం చేయలేదని చెబుతారు. ఎందుకంటే తాము అన్నీ భరించి వైసీపీని గెలిపిస్తే అయిదేళ్ళలో తమను ఏమి పట్టించుకున్నరు జగన్ అన్న ఆగ్రహమే వారిని ఇలా చేసింది అని అంటున్నారు. ఇక వారిలో చాలా మంది వైసీపీకి ఓటేయలేదని కూడా చెబుతారు. అదే సమయంలో ఇతర పార్టీలకూ అనుకూలంగా పనిచేయలేదని అంటారు. ఎందుకంటే వారు వైఎస్సార్ ని ఎంతో ప్రేమిస్తారు, ఆ తండ్రి బిడ్డగా జగన్ కి కూడా అమితంగా గౌరవించి అభిమానిస్తారు. అందువల్ల వారు వైసీపీ అధినాయకత్వం పోకడల మీద అలిగారు తప్పించి వైసీపీతో వేరు పడి కాదని అంటారు.
ఏ పార్టీలోనూ చేరకుండా :
ఇక వారంతా వైసీపీకి దూరం పెట్టారు కానీ ఏ ఇతర పార్టీలలోనూ చేరలేదు అని గుర్తు చేస్తున్నారు. అవకాశ వాదులు మధ్యలో పార్టీ అధికారంలో ఉన్నపుడు వచ్చి చేరి పదవులు అనుభవించిన వారు పార్టీని వీడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ వీరు మాత్రం అలాగే ఉన్నారు అంటే వైసీపీకి కరడు కట్టిన అభిమాన నాయకులనే చెప్పాలి. అయితే వీరు అంతా గత పదిహేను నెలలుగా పార్టీ ఇచ్చే ఏ పిలుపునకూ స్పందించడం లేదు, అంతే కాదు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు, దానికి కారణం ముందే చెప్పుకున్నట్లుగా అధినాయకత్వం పోకడలు మారాలన్నదే వారి ఆలోచనగా ఉంది అందుకే యూరియా కొరత అని పార్టీ పిలుపు ఇచ్చినా లేకపోతే మరో అంశం మీద నిరసనలకు సిద్ధపడినా వీరు మాత్రం ఎక్కడా అగుపించడం లేదు అని గుర్తు చేస్తున్నారు.
అసలైన పోరాటం అపుడే :
అయితే మధ్యలో వచ్చిన వారు కొందరు మాత్రమే హడావుడి చేస్తున్నారు వైసీపీ అసలు బలం అయితే ఇది కాదనే అంటున్నారు. వైసీపీలో ఒరిజినల్ లీడర్స్ అలాగే మొదటి నుంచి ఉన్న గట్టి నాయకులు కనుక బయటకు వస్తే అసలైన పోరాటం అపుడే స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. కానీ వీరికి మాత్రం కొన్ని సందేహాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ కోసం కానీ పార్టీ కోసం కానీ తాము బయటకు వచ్చి ఆందోళనలు చేసినా కూటమి ప్రభుత్వం కేసులు పెడితే రేపటి రోజున జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి తమను ఆదుకుంటారా తమ మీద పెట్టిన కేసులను తొలగిస్తారా అన్న దాంట్లో సైతం వారికి ఎలాంటి నమ్మకం అయితే కుదరడం లేదు అని అంటున్నారు. అందువల్ల వైసీపీ అధినాయకత్వం వైఖరిలో పూర్తిగా మార్పు రావాలని వీరంతా కోరుకుంటున్నారు. అలా జరిగిన నాడు జనంలోకి వీరు మళ్ళీ వైఎస్సార్ అభిమానం దండుగా కదులుతారు అని అంటున్నారు. ఇక చూస్తే వీరికి వైసీపీ అంటే ఇష్టమని 2029లో ఆ పార్టీకే సపోర్టు చేస్తారు అని అంటున్నారు. కానీ దాని కంటే ముందు వైసీపీలో జరగాల్సిన మార్పులు అన్నీ జరగాలని బలంగా కోరుకుంటున్నారు.
