Begin typing your search above and press return to search.

వైసీపీ బీఆర్ఎస్...సేమ్ టూ సేమ్ !

ఏపీలో వైసీపీ కానీ తెలంగాణాలో బీఆర్ఎస్ కానీ సేమ్ టూ సేమ్ గా వ్యవహరిస్తున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాయి.

By:  Satya P   |   21 Jun 2026 11:00 AM IST
వైసీపీ బీఆర్ఎస్...సేమ్ టూ సేమ్ !
X

ఏపీలో వైసీపీ కానీ తెలంగాణాలో బీఆర్ఎస్ కానీ సేమ్ టూ సేమ్ గా వ్యవహరిస్తున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాయి. ఈ పార్టీలు అధికారంలో ఉన్నపుడు స్నేహ సంబంధాలను బాగా నెరిపేవి అని అప్పట్లో ప్రచారం సాగింది. కేసీఆర్ జగన్ ఇద్దరూ మంచి దోస్తులు గా రెండు తెలుగు రాష్ట్రాలలో వ్యవహరించారు అని కూడా అంతా చెప్పుకున్నారు. ఇక ఒకేసారి రెండు పార్టీలు విపక్షంలోకి వచ్చాయి. అయితే ఈ రెండు పార్టీల అధినాయకులు చేస్తున్న ప్రకటనలు కానీ వారు ఆలోచనలు కానీ వారి వైఖరి కానీ ఒకేలా ఉండడమే చర్చనీయాంశంగా ఉంది.

అసెంబ్లీకి దూరంగా :

కేసీఆర్ 2023లో ఓటమి పాలు అయిన దగ్గర నుంచి అసెంబ్లీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అక్కడ సగం పాలన పూర్తి అయింది కానీ కేసీఆర్ అసెంబ్లీకి అయితే వెళ్ళింది లేదని అంటున్నారు. ఆయన మళ్లీ సీఎం గానే అసెంబ్లీ ముఖం చూడాలని అనుకుంటున్నారు అని చెబుతారు. ఇక ఏపెలో చూసినా జగన్ ధోరణి కూడా అలాగే ఉంది. ఆయన కూడా అసెంబ్లీకి దూరం పాటిస్తున్నారు. ఏపీలో కూటమి పాలన రెండేళ్ళు పూర్తి అయింది. కానీ జగన్ అసెంబ్లీకి వెళ్ళింది లేదు, మిగిలిన కాలంలో వెళ్తారు అన్న గ్యారంటీ కూడా లేదని అంటున్నారు.

విరుచుకుపడడంలోనూ :

ఇష్యూ ఏది అయినా విరుచుకుని పడడంతో అటు వైసీపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఒకే తీరున ఉంటాయని కూడా అంటున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గట్టిగానే పోరాటం చేయడంతో ఈ రెండు పార్టీలు ముందున్నాయి. అదే విధంగా ఈ పార్టీల కీలక నేతలు పాదయాత్రకు కూడా ఆలోచిస్తున్నారు. జగన్ కేటీఆర్ దాదాపుగా ఒకే సమయంలో పాదయాత్రకు శ్రీకారం చుడతారు అని కూడా అంటున్నారు. ఈ విధంగా జనాలకు చేరువ కావాలన్నది వారి ఆలోచన అని కూడా చెబుతున్నారు.

మేమొస్తామంటూనే అలా :

ఇక చూస్తే అన్యాయం జరిగింది అని ఎవరైనా బాధితులు మొర పెట్టుకుంటే వారికి తక్షణ ఉపశమనం కలిగిస్తేనే సంతోషిస్తారు. కానీ ఈ పార్టీల నాయకులు మాత్రం మేము అధికారంలోకి వస్తున్నాం అంతవరకూ ఓపిక పట్టు అని చెబుతున్నారు. ఏపీలో జగన్ అయితే ఈ విషయంలో మరో మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు వచ్చేది వైసీపీనే అపుడు కచ్చితంగా న్యాయం చేసి తీరుతామని భరోసా ఇస్తున్నారు. ఇపుడు అదే మాట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అనడమే విశేషం. తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు. తెలంగాణాలో రైతులు ఎవరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని కూడా కోరారు. రెండేళ్ల పాటు ధైర్యంగా ఉండాలని సూచించారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి రైతులకు పూర్తి న్యాయం చేస్తామని అంటున్నారు.

ప్రతిపక్షం అంటే :

ప్రతిపక్షాలు గతంలో తీసుకున్న వైఖరి వేరే విధంగా ఉండేదని చెబుతారు. ప్రభుత్వాన్ని వారు తమ ఉద్యమాల ద్వారా గడగడలాడించే వారు సమస్యలకు ప్రభుత్వం నుంచి పరిష్కారాలు రాబట్టేవారు. ఇపుడు ఆ పరిస్థితి పోయిందా అన్న చర్చ వస్తోంది. ప్రతిపక్షం అయితే తాము ఎంతగా మొత్తుకున్నా ప్రభుత్వం వినదు కాబట్టే తాము వస్తేనే న్యాయం చేస్తామని చెబుతున్నామని అంటోంది. ఇక అధికార పక్షాలు అయితే తాము ఏదైనా మేలు చేస్తే అది విపక్షం ఖాతాలోకి పోతుందేమో అని చేయడం మానుకుంటున్నాయి. ఈ విచిత్రమైన రాజకీయంలో ఎవరి ఓడినా సరే పోరాటాలు సంగతి పక్కన పెడితే మళ్లీ తాము అధికారంలోకి వస్తేనే చేస్తామని చెప్పడం పరిపాటిగా మారుతుందా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి.