Begin typing your search above and press return to search.

ఆ వ్యతిరేకతే బీజేపీ వైసీపీలను దగ్గర చేస్తోందా ?

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతీ రాజకీయ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. అయితే ఆ ఫిలాసఫీ కాలగమనంలో ఎంతమేరకు నిలబడుతుంది అన్నదే చర్చగా ఉన్న విషయం

By:  Satya P   |   22 Aug 2025 9:31 AM IST
ఆ వ్యతిరేకతే బీజేపీ వైసీపీలను దగ్గర చేస్తోందా ?
X

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతీ రాజకీయ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. అయితే ఆ ఫిలాసఫీ కాలగమనంలో ఎంతమేరకు నిలబడుతుంది అన్నదే చర్చగా ఉన్న విషయం. ఎందుకంటే రాజకీయాలు అన్నవి నిరంతరం సాగే నదీ ప్రవాహం లాంటివి. అందువల్ల ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ వాతావరణానికి అనువుగా చేసుకుని తమ పార్టీ పడవని నడిపించుకోవడం ప్రతీ పార్టీ అధినాయకత్వానికి ఒక సవాల్ లాంటిదే. ఇందులో ఎవరూ నూరు శాతం సక్సెస్ లను చూడలేదు అన్నది కూడా వాస్తవం.

ఇద్దరికీ ఒకరే ప్రత్యర్ధి :

ఏపీలో వైసీపీ ఏర్పాటు వెనకాల కాంగ్రెస్ మీద కోపం ఉంది. తనను పక్కన పెట్టారని ఇబ్బందులకు గురి చేశారు అని జగన్ భావించి 2011లో వైసీపీని స్థాపించారు. ఆ విధంగా ఆయన కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక 2014 నుంచి రాజకీయం కూడా దేశంలో మారిపోయింది. కాంగ్రెస్ కి గడ్డు రోజులు వచ్చాయి. బీజేపీ గద్దెనెక్కింది. దాంతో పాటు జగన్ రాజకీయం కూడా ఒక సమయంలో అత్యున్నత దశలో సాగింది. అలా బీజేపీతో తెలియకుండానే ఒక బంధం ఏర్పడింది అని అంటారు. బీజేపీకి కూడా కాంగ్రెస్ తో పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ భావజాలమే కాంగ్రెస్ కి భిన్నం.

అయితే అదే తేడా :

ఇక్కడ మరో విషయం గమనించాల్సి ఉంది. వైసీపీని స్థాపించిన జగన్ కి కాంగ్రెస్ సిద్ధాంతాల మీద వ్యతిరేకత లేదు. కేవలం గాంధీ కుటుంబం మీద వ్యతిరేకత ఉంది. వైసీపీలో చూస్తే కాంగ్రెస్ భావజాలం ఉంది. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వర్గాలు అన్ని అంతకు పూర్వం కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన వారు కావడం విశేషం. వారు బీజేపీ భావజాలానికి పూర్తి భిన్నంగా ఉండేవారు అని కూడా చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి గాంధీ వారసత్వమే శరణ్యం కావడంతో వ్యక్తుల మీద వ్యతిరేకత కాస్తా పార్టీ మీద కూడా వైసీపీకి మారింది అని చెప్పాలి. బీజేపీ విషయానికి వస్తే కాంగ్రెస్ భావజాలాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. అందుకే ఆ పార్టీది సిద్ధాంత పోరాటంగా చూడాలని అంటున్నారు.

టీడీపీ కంటే ఎక్కువేనా :

ఇక కాంగ్రెస్ వ్యతిరేకత విషయంలో వైసీపీ టీడీపీ కంటే ఒక మెట్టు పైనే ఉందని అనేక సందర్భాలు నిరూపించాయి. ఎన్టీఆర్ అయితే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే టీడీపీని స్థాపించారు. కానీ చంద్రబాబు జమానాలో చూస్తే కనుక అది కాస్తా మారింది. దేశంలో రెండు పార్టీల వ్యవస్థ ఉన్నపుడు తమకు ఒక పార్టీతో పొరపొచ్చాలు వచ్చినపుడు రెండవ పక్షం చేరి రాజకీయం నెగ్గించుకోవాలన్నది ప్రస్తుత టీడీపీ అధినాయకత్వం ఆలోచనలుగా ఉంటోంది. అందుకే 2018లో బీజేపీతో వేరుపడినపుడు ఎలాంటి సంకోచం లేకుండా కాంగ్రెస్ తో టీడీపీ తెలంగాణా ఎన్నికల్లో కలసి పోటీ చేసింది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతోనూ చెట్టాపట్టాలు వేసింది.

బీజేపీ నమ్ముతోందా :

ఏపీలో చూస్తే తమకు సిద్ధాంత పరంగా వైసీపీతో ఏ మాత్రం సాపత్యం సారూప్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ని వైసీపీ గుడ్డిగా వ్యతిరేకించడం అన్న పాయింట్ ఆధారంగానే బీజేపీకి కూడా ఎక్కడో ఒక చోట నచ్చుతోంది. అందుకే ఏపీలో వైసీపీ విషయంలో ఎవరు ఏమనుకున్నా కేంద్ర నాయకులకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉందని అంటారు. దేశంలో చాలా పార్టీలు ఈ రోజు ఎన్డీయేతో ఇండియా కూటమితోనూ ఉన్నాయి. అయితే ఆయా పార్టీలు రాజకీయాలకు అనుగుణంగా రేపటి రోజున అటు నుంచి ఇటు అలాగే ఇటు నుంచి అటూ మారవచ్చు.

కానీ వైసీపీ ఎప్పటికీ కాంగ్రెస్ వైపు పోదు అన్నది బీజేపీకి కడు నమ్మకమని అంటారు. అది పదే పదే రుజువు చేసేలా వైసీపీ కూడా వ్యవహరిస్తోంది. దాంతో ఒక విధంగా ఈ ఇద్దరి బంధం వెనక కాంగ్రెస్ వ్యతిరేకత అన్న బలమైన ఒక ఎలిమెంట్ ఉంది అన్నది మిగిలిన వారు గ్రహిస్తే మాత్రం ఇది వీడిపోయే బంధం కాదని కూడా ఆ వెంటనే అంగీకరిస్తారు అన్నది ఒక కఠిన మైన విశ్లేషణగా చూడాల్సి ఉంటుంది.