Begin typing your search above and press return to search.

బొత్సకు బిగ్ షాక్.. టీడీపీలోకి చిన్న శ్రీను?! వైసీపీకి రాజీనామా

స్థానిక ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేత, మండలిలో విపక్షనేత బొత్స సత్యానారాయణను రాజకీయంగా దెబ్బతీసేలా అధికార టీడీపీ పావులు కదుపుతోంది.

By:  Tupaki Political Desk   |   8 Sept 2026 7:15 PM IST
బొత్సకు బిగ్ షాక్.. టీడీపీలోకి చిన్న శ్రీను?! వైసీపీకి రాజీనామా
X

స్థానిక ఎన్నికల ముందు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేత, మండలిలో విపక్షనేత బొత్స సత్యానారాయణను రాజకీయంగా దెబ్బతీసేలా అధికార టీడీపీ పావులు కదుపుతోంది. ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతగా ఉన్న బొత్స మేనల్లుడు విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొద్దిరోజులుగా బొత్స పార్టీ మారుతారంటూ విస్తృత ప్రచారం జరిగింది. కానీ, మీడియా దృష్టిని అటు మళ్లించి జడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావే పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కొద్దిరోజుల క్రితమే బొత్స అనుచరులు ఆరోపించారు. ఇప్పుడు వారు చెప్పినట్లుగానే జరుగుతుందని అన్నట్లుగా వైసీపీకి మజ్జి శ్రీనివాసరావు రాజీనామా ప్రకటన చేశారని అంటున్నారు.

విజయనగరం జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలో కీలక నాయకుడిగా మజ్జి శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. సొంత మామ బొత్స వద్ద రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్న ఆయన ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టున్న నాయకుడిగా ఎదిగారు. 2021లో జడ్పీ చైర్మనుగా బాధ్యతలు స్వీకరించే వరకు బొత్సకు నీడ నేతగానే పనిచేశారు. అయితే 2021లో అనూహ్యంగా ఆయన జడ్పీ చైర్మనుగా ఎన్నిక అయిన తర్వాత రాజకీయంగా పట్టు పెంచుకున్నారు. సొంతంగా ఎదగాలని ఆశించారని అంటున్నారు. బొత్స తరువాత ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మజ్జి శ్రీను అలియాస్ చిన్నశ్రీను భావించారని చెబుతున్నారు. కానీ, బొత్స మాత్రం తన స్థానంలో మేనల్లుడికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవలేదని అంటున్నారు. ఈ కారణంగానే కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువయ్యాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను చేసిన ప్రకటన హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం జడ్పీ చైర్మనుగా ఉన్న ఆయన పదవీ కాలం ఈ నెల 24తో పూర్తవుతుందని అంటున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలకు ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆయన రాజీనామా ప్రకటన విస్తృత చర్చకు దారితీసింది. తరువాత ఏ పార్టీలో చేరేది ఆయన చెప్పకపోయినా కొద్దిరోజులుగా జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతుండటాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేసే ముందు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణతో మాట్లాడారని కూడా అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు.

విజయనగరం జడ్పీ చైర్మనుతోపాటు భీమిలి నియోజకవర్గ వైసీపీ కన్వీనరుగానూ చిన్న శ్రీను పనిచేస్తున్నారు. ఎప్పటికైనా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాలని చిన్నశ్రీను చాలా కలలు కన్నారు. కానీ, ఆయనను అనూహ్యంగా జిల్లా రాజకీయాల నుంచి తప్పించేలా భీమిలి పంపడమే తీవ్ర అసంతృప్తికి దారితీసిందని అంటున్నారు. అప్పటి నుంచి సొంత మామ బొత్సతో ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారని చెబుతున్నారు. ఇన్నాళ్లు అదును కోసం ఎదురుచూసిన ఆయన ఇటీవల బొత్స చేసిన ప్రకటనతో పార్టీ నుంచి బయటపడే మార్గం దొరికిందని డిసైడ్ అయ్యారని అంటున్నారు. గత నెలలో బొత్స కుమార్తె అనూష పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా ఆమెను జడ్పీ చైర్మనుగా ప్రకటించారు. ఈ విషయంలో చిన్న శ్రీనును కనీసం సంప్రదించలేదని అంటున్నారు. దీంతో ఈ నెల 5న తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన చిన్న శ్రీను ఆ రోజే కీలక రాజకీయ ప్రకటన చేశారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆ వేడుకలకు బొత్స కుటుంబ సభ్యులు కూడా హాజరు కావడంతో ఆయన వెనక్కి తగ్గారని అంటున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలకు ఎప్పుడైనా షెడ్యూల్ విడులయ్యే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకూడదనే భావనకు వచ్చి ఈ రోజు రాజీనామా ప్రకటన చేశారని అంటున్నారు. ఇక ఒకటి రెండు రోజుల్లో టీడీపీలో చేరనున్నారనే ప్రకటన కూడా వెలువడుతుందని అంటున్నారు.