వైసీపీకి స్కోప్ హోప్ స్పేస్ అక్కడే !
ఏపీలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రొటీన్ గా ఉంటూనే ట్విస్టులుగా సాగుతాయి.
By: Satya P | 31 July 2025 8:15 AM ISTఏపీలో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రొటీన్ గా ఉంటూనే ట్విస్టులుగా సాగుతాయి. ఒక విధంగా చూస్తే ఏపీ పాలిటిక్స్ అయితే ఏ మాత్రం మారలేదు. ఉదాహరణకు తీసుకుంటే 1995 నుంచి రెండు పార్టీలు రెండు కుటుంబాల మధ్యనే రాజకీయం అలా సాగుతోంది. భీకర రాజకీయ పోరు కూడా అలాగే కొనసాగుతోంది. 1995లో చంద్రబాబు ఉమ్మడి ఏపీలో తొలిసారి సీఎం అయ్యారు. వైఎస్సార్ 1998 నుంచి పీసీసీ చీఫ్ గా బాబుకు ఎదురు నిలిచారు.
దశాబ్దాలుగా అదే తీరు :
ఇక 1999లో సీఎం పదవి వైఎస్సార్ దే అన్నంతగా హైప్ వచ్చింది. అయితే బీజేపీతో టీడీపీ పొత్తుతో హస్తం పార్టీ అత్యధిక స్థానాలు మాత్రమే సాధించింది. అలా వైఎస్సార్ కల మరో అయిదేళ్ళకు వాయిదా పడింది. 2004లో మాత్రం వైఎస్సార్ గట్టిగానే కొట్టారు. కాంగ్రెస్ ని కేంద్రంలో అధికారంలోకి తీసుకుని రావడానికి ఉమ్మడి ఏపీ నుంచే కావాల్సిన ఇంధనం ఆయన సమకూర్చారు. 2009లో సైతం రెండోసారి కాంగ్రెస్ బొటాబొటీ సీట్లతో అయినా ఏపీలో గెలిచింది అంటే దానికి కారణం వైఎస్సార్ చరిష్మానే. ఇక వైఎస్సార్ మరణం తరువాత అనూహ్య పరిణామాలే సంభనించాయి.
వైఎస్సార్ లేడు..కాంగ్రెస్ లేదు కానీ :
ఉమ్మడి ఏపీలో రెండోసారి పగ్గాలు చేపట్టిన కేవలం మూడు నెలల వ్యవధిలోనే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. అలా ఒక క్రౌండ్ పుల్లర్, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతను కాంగ్రెస్ ఏపీలో కోల్పోయింది. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ రూపు రేఖలే లేకుండా పోయాయి. అయితే చిత్రాతిచిత్రంగా కాంగ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ అయింది. వైఎస్సార్ తనయుడే టీడీపీకి గట్టి పోటీదారుగా బలమైన ప్రత్యర్ధిగా మారారు.
మలి విడతలో ప్రభంజనం :
ఇక చూస్తే విభజన ఏపీలో తొలి విడతలో వైసీపీ పరాజయం పాలు అయినా మలి విడతలో అంటే 2019లో ప్రభంజనమే వీచి 151 సీట్లతో అద్భుతమైన విజయం సాధించింది. అయిదేళ్ళ పాటు జగన్ సీఎం గా తాను అనుకున్న తీరులో పాలించారు. ఇక 2024లో కూటమి కట్టిన టీడీపీ వైసీపీని ఓడించింది. ఇపుడు చూస్తే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. వైసీపీకి వచ్చినవి కేవలం 11 సీట్లు మాత్రమే. కానీ రాజకీయాన్ని అలా చూడకూడదు 40 శాతం ఓటు షేర్ కలిగిన వైసీపీని బలంగానే ఉందని చూడాలి.
సిసలైన ఆల్టర్నేషన్ గా :
ఇంకా విశాలంగా చెప్పుకోవాలంటే అధికార కూటమి వదిలేసిన స్పేస్ ని భర్తీ చేస్తే స్ట్రాంగ్ ఆల్టర్నేషన్ గా కూడా చూడాలి. ఏపీలో కూటమికి 55 శాతం పైగా ఓటు షేర్ దక్కవచ్చు వైసీపీకి 40 శాతం ఓటు షేర్ రావచ్చు. కానీ పాలిటిక్స్ అంటే నిరంతరం సాగే నదీ ప్రవాహం లాంటిది. ఎక్కడా ఏదీ నిశ్చలం కాదు. అందువల్ల త్రాసు అటు నుంచి ఇటు వైపు మారవచ్చు. న్యూట్రల్స్ రెండు పార్టీలకు చెందని ఓటర్లే ఎపుడూ కీలకంగా ఉంటారు. అయితే ఈ అయిదు పది శాతం ఓటు షేర్ ని తమ వైపు మళ్ళించుకోవాలీ అంటే బలమైన రాజకీయ పెట్టుబడిగా 40 శాతం ఓటు షేర్ వైసీపీకి ఉంది. అదే ఏపీలో వైసీపీకి ఆశలు పెంచుతున్న అంశం.
జగన్ కాదు రీజన్ అదే :
ఏపీలో జగన్ చుట్టూ విమర్శలు ఆయన అరెస్టులు ఆయన మీద కేసులు ఇలా చర్చ సాగుతోంది. కానీ జగన్ ని జైలులో పెట్టినా నేతల మీద కేసులు బనాయించినా వైసీపీని ఇబ్బంది పెట్టినా ఆ పార్టీకి వచ్చే నష్టం అయితే పెద్దగా లేదు ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ పటిష్టంగా ఉంది. ఓటు షేర్ కూడా కూటమికి పూర్తి భిన్నంగా ఉంది. ఆ ఓటింగ్ భావజాలం కూడా వేరుగా ఉంది. ఇక కూటమి ఒక వైపు వైసీపీ మరో వైపుగా ఉన్న ఏపీ పొలిటికల్ సినారియాలో వైసీపీకి ఎపుడూ చాన్స్ ఉంటూనే ఉంటుంది.
ఇదే పొలిటికల్ మ్యాథమెటిక్స్. వైసీపీకి కూడా అదే నిబ్బరంగా ఉంటోంది. అందుకే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ చెప్పగలుస్తోంది. సో టీడీపీ కూటమి వైసీపీతోనే రాజకీయ పోరాటం చేయాల్సిందే. అది ఎంతదాకా అంటే వైసీపీ ఓటు బ్యాంక్ ని అదే భావజాలం కలిగిన మరో పార్టీ కాప్చర్ చేసేంతవరకూ అని చెప్పాలి. అది సమీప భవిష్యత్తులో జరిగే సూచనలు లేవు కాబట్టి వైసీపీ కూటమికి గట్టి పోటీదారుగానే ఉంటోంది.
