Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి హాజరు...వైసీపీ స్టాండ్ అదేనట !

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి మొదలవుతున్నాయి. దీని మీద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

By:  Satya P   |   11 Aug 2026 9:16 AM IST
అసెంబ్లీకి హాజరు...వైసీపీ స్టాండ్ అదేనట !
X

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి మొదలవుతున్నాయి. దీని మీద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 17వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ భవనంలోని అసెంబ్లీ హాలులో శాసన సభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అదే రోజున ఉదయం పది గంటలకు రాష్ట్ర శాసన మండలి సమావేశాలు కౌన్సిల్ హాలులో ప్రారంభం అవుతాయని గవర్నర్ నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . నాలుగు రోజుల పాటు అసెంబ్లీ అలాగే కౌన్సిల్ కూడా జరుగుతుంది. అయితే అందరి చూపూ వైసీపీ మీదనే ఉంది. వైసీపీ ఈసారి అయినా అసెంబ్లీకి వస్తుందా అన్నదే అంతా చర్చిస్తున్నారు. కానీ వైసీపీ తన స్టాండ్ ని మార్చుకోలేదని చెబుతున్నారు. వైసీపీ అసెంబ్లీకి ఈ వర్షాకాల సమావేశాలకూ హాజరు కావడం అన్నది జరిగేది కాదని అంటున్నారు. దానికి కారణం ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదా మీద గట్టిగా పట్టుబట్టి ఉండడమే అని అంటున్నారు.

హైకోర్టులో కేసు :

ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఒకే ఒక ప్రతిపక్షం ఉంది కాబట్టి వైసీపీకే ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ కోర్టుకు వెళ్ళింది. దాంతో ఈ అంశం హైకోర్టులో విచారణ దశలోనే ఉంది అని గుర్తు చేస్తున్నారు. మరో వైపు రూల్స్ ప్రకారం చూస్తే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని అధికార పక్షం అంటోంది. మొత్తం సీట్లలో 10 శాతం అయినా తెచ్చుకున్న పార్టీకే విపక్ష హోదా ఇస్తారు అని స్పష్టం చేస్తున్నారు. దాంతో వైసీపీ చెబుతున్నట్లుగా ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టరు అని అంటున్నారు. దాంతోనే పీట ముడి పడుతోంది. 164 సీట్లతో పూర్తి అధికారంతో అసెంబ్లీ నిండా పరచుకున్న కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ డిమాండ్ ని ఏ మాత్రం పట్టించుకునే అవకాశమే లేదని అంటున్నారు.

దూరంగానే ఉంటూనే :

ఈ నేపథ్యంలో ఎప్పటి మాదిరిగానే వైసీపీ అసెంబ్లీకి దూరంగానే ఉంటూ మండలిలో తన బలాన్ని గొంతుకను గట్టిగా చాటుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మండలిలో వైసీపీకి 30 ప్లస్ సభ్యులు ఉన్నారు. దాంతో మండలిలోనే కూటమిని ఎదుర్కోవాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మండలిలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైసీపీకి ఉంది. ఆ హోదాలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో పాటు ధాటీగా మాట్లాడే ఎమ్మెల్సీలు అనేక మంది ఉన్నారు. దాంతో ప్రజా సమస్యల మీద వారి ద్వారానే వైసీపీ గొంతు వినిపించాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

కూటమి వర్సెస్ వైసీపీగా :

మెగా డీఎస్సీ మీద ఇప్పటికే బయట ఆందోళనలు చేస్తోంది. ఇపుడు ఇదే అంశం మీద మండలిలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎప్పటి మాదిరిగానే వైసీపీ అసెంబ్లీకి దూరం అంటోంది అని భోగట్టా. దాంతో కౌన్సిల్ లో జరిగే సమావేశాలు చర్చలతో రాజకీయం కూటమి వర్సెస్ వైసీపీగా హీటెక్కే చాన్స్ ఉంది అని అంటున్నారు. చూడాలి మరి నాలుగు రోజుల పాటు జరిగే వర్షాకాల సమావేశాలలో కూటమిని మండలిలో వైసీపీ ఏ విధంగా కట్టడి చేయనుందో. దానికి ధీటైన ప్లాన్ తో కూటమి ఏ విధంగా వైసీపీని కార్నర్ చేయనుందో.