అమరావతి ఇష్యూని మళ్ళీ కెలికిన జగన్
ఈ నేపథ్యంలో జగన్ రైతుల పక్షం వైపు నుంచే ప్రశ్నలను సంధించారు అని అంటున్నారు.
By: Satya P | 8 Jan 2026 6:22 PM ISTఅమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఆలోచనలు మారుతున్నాయా అన్న కొత్త చర్చ అయితే సాగుతోంది. అయితే అన్ని అంశాలు పరిశీలించిన మీదటనే వ్యూహాత్మకంగానే జగన్ అమరావతి రాజధాని అంశాన్ని ఎత్తుకున్నారు అని అంటున్నారు. వైసీపీ 2024 లో భారీ ఓటమిని మూటకట్టుకుంది. దాని వెనక అనేక కారణాలు ఉన్నాయి. అందులో రాజధాని అమరావతి విషయం కూడా ఉందని అంటున్నారు. అయితే ఓటమి తరువాత కొన్నాళ్ళ పాటు జగన్ కానీ వైసీపీ నేతలు కానీ అమరావతి విషయంలో పెద్దగా రియాక్ట్ అయింది లేదు. కానీ జగన్ ఇన్నాళ్ళ తరువాత ఈ అంశం మీద మాట్లాడడానికి చాలానే ఉంది అని అంటున్నారు. స్ట్రాటజిక్ గానే ఆయన ఈ ఇష్యూని ఎత్తారని భావిస్తున్నారు.
రైతులలో ఆవేదన :
నిజానికి చూస్తే అమరావతి రాజధాని కోసం ఇప్పటికి 11 ఏళ్ల క్రితం రైతులు భూములు ఇచ్చారు. అవి 33 వేల ఎకరాలుగా ఉంది. ఇక ఆనాటి నుంచి నేటి వరకూ చూస్తే ఆయా భూములలో అభివృద్ధి అయితే లేదు, పైగా కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పినా అవి ఆచరణలో అనుకున్నంతగా సాగడం లేదన్నది ఒక విమర్శ అయితే తమకు అనుకూలమైన చోట మంచి డిమాండ్ ఉన్న చోట ప్లాట్స్ ఇవ్వడం లేదన్నది వారి నుంచి వస్తున్న మరో విమర్శగా చెబుతున్నారు. ఇక అమరావతికి తొలి దశలో భూములు ఇచ్చిన రైతుల ఆవేదన అలా ఉండగానే రెండవ దశలో భూముల సమీకరణకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రైతుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. తాము ఇచ్చిన భూములకు రేపటి రోజున ప్రభుత్వం మారితే గ్యారంటీ ఏంటని కూడా వారు ప్రశ్నించారు. అంతే కాదు మూడేళ్ళలోగా అభివృద్ధి చేస్తామని రాతపూర్వక హామీ కావాలని అన్నారు. ఇంకా రాజధాని మీద చట్టబద్ధత కూడా కావాలని కోరారు.
భారీ ప్రాజెక్ట్ గా :
అమరావతి రాజధాని అన్నది ఒక భారీ ప్రాజెక్ట్ గానే ఉంది అన్నది అంతా అంటున్న మాట. కేంద్రం మధ్యవర్తిగా ఉండి ఇప్పించే వేల కోట్ల రూపాయల అప్పులను తీర్చే బాధ్యత కూడా ఏపీ మొత్తం అయిదున్నర కోట్ల ప్రజలదే అవుతుందని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే భారీ స్కేల్ మీద అమరావతి రాజధాని నిర్మాణం పెంచుకుంటూ పోతున్నారని అందులో భాగంగా మరో ఇరవై వేల ఎకరాల భూముల సేకరణ అని అంటున్నారు. దాంతో రైతుల విషయం ఒకలా ఉంటే సగటు పౌరులలో కూడా కొత్త సందేహాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు. ఏదో విధంగా ఉన్న చోట అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలన్నది మెజారిటీ ప్రజల కోరికగా ఉంది. అలా పెంచుకుంటూ పోతే ఎప్పటికీ పూర్తి కాదు అన్న వాదన కూడా ఉంది.
రైతుల వైపు నుంచే :
ఈ నేపథ్యంలో జగన్ రైతుల పక్షం వైపు నుంచే ప్రశ్నలను సంధించారు అని అంటున్నారు. అమరావతి రైతులు భూములు ఇచ్చారని మొదటి దశలో వారికే ఇంకా న్యాయం జరగలేదని రెండో దశ ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రతీ ఎకరాకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటే గతంలో ఇపుడు తీసుకుంటున్న భూములు కలుపుకుని రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని జగన్ అంటున్నారు. దాంతో ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా నదీ గర్భంలో రాజధాని నిర్మాణం అని మరో మౌలిక ప్రశ్నను ఆయన లేవనెత్తారు, అలాంటివి సుప్రీంకోర్టు కూడా అనుమతించరాదు అని అని ఆయన న్యాయపరమైన చర్చని కూడా ముందుకు తీసుకుని వచ్చారు. ఇవి ఇపుడు అమరావతి రైతులలో కూడా చర్చకు ఆయన పెట్టారు అనుకోవాలి.
గుంటూరు విజయవాడ అంటూ :
ఇక జగన్ మార్క్ వ్యూహం ఏమిటి అన్నది ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది అని చెబుతున్నారు. విజయవాడ గుంటూరు ల మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే జంట నగరాలుగా అవి అభివృద్ధి చెందుతాయని ఆయన భావనగా ఉంది అని చెబుతున్నారు. ఇక ఈ విషయంలో గుంటూరు విజయవాడ ప్రజల మధ్యన ఒక రకమైన అసంతృప్తి ఉందని కూడా అంటున్నారు. అమరావతి అంటూ సదూరంగా రాజధాని కోసం కాకుండా విజయవాడ గుంటూర్ లను రెడీ మేడ్ నగరాలుగా అభివృద్ధి చేయవచ్చు కదా అన్నది మేధావుల నుంచి వస్తున్న మాటగా ఉంది అని అంటున్నారు. జగన్ ఆ ఆలోచనల మేరకే ఈ విధంగా మాట్లాడారు అని అంటున్నారు. అంటే ఆయన ఈసారి తన వ్యూహం మార్చారు అనుకోవాలి. అమరావతి ప్రాంతాన్ని మినహాయించి గుంటూరు విజయవాడ రాజధాని అంటున్నారు. అదే సమయంలో అమరావతి రైతుల సమస్యలను కూడా ప్రస్తావించడం ద్వారా వారి పక్షం అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ చాలా రోజుల తరువాత అమరావతి ఇష్యూని అయితే బాగా కెలికారు ఇది ఏ వైపునకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఎలా దారి తీసినా వైసీపీకి లాభమే అన్నట్లుగానే జగన్ ప్రెస్ మీట్ లో ఆయన వ్యాఖ్యలు సాగాయన్న విశ్లేషణలు ఉన్నాయిపుడు.
