వైసీపీకి మరీ ఇంత కన్ఫ్యూజన్ నా ?
ఇదే ప్రశ్నను మీడియా వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు సంధించింది.
By: Satya P | 28 Jun 2026 7:20 PM ISTఅయిదేళ్ళ పాటు ఏపీని ఏలిన పార్టీ. 2024లో దారుణంగా ఓడినా 40 శాతం ఓట్ షేర్ ఉన్న పార్టీ. 2014 నుంచి వరుసగా మూడు సార్లు అసెంబ్లీ మరో మూడు సార్లు పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొని బలమైన రాజకీయ పార్టీగా వైసీపీ కొనసాగుతోంది. అలాగే రెండు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటుకుంది. ఏపీలో ఓటర్లు నాలుగు కోట్లు. జనాభా అయిదు కోట్లు. మరి ఇందులో నలభై శాతం ఓటు షేర్ అంటే కోటీ అరవై లక్షల మందికి పైగా 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారు. అంటే మొత్తం ఏపీ జనాభాలో మూడవ వంతు అన్న మాట. ప్రతీ ముగ్గురిలో ఒకరి వైసీపీ వైపు ఉన్నారు అన్న మాట. మరి ఇంతలా వైసీపీ ఏపీ రాజకీయాల్లో తన బలాన్ని చాటుకున్న వేళ ఏపీకి సంబంధించిన కీలకమైన అంశాలలో మరీ ఇంతగా కన్ఫ్యూజన్ తో వ్యవహరించడం అంటే అది ఆ పార్టీకి మంచిదేనా అన్నది ప్రధాన ప్రశ్న. మరి ఏపీ ప్రజల మెప్పు పొంది మరోసారి అధికారం అందుకుని ఏపీ భవితను శాసించాలని చూస్తున్న వైసీపీకి రాజధాని వంటి అత్యంత ముఖ్యమైన అంశలో అయోమయం ఉండడం అంటే చాలా సీరియస్ గానే ఆలోచించాలని అంటున్నారు.
వైసీపీ స్టాండ్ ఏమిటి :
ఇదే ప్రశ్నను మీడియా వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు సంధించింది. దానికి ఆయన చెప్పిన జవాబు చూస్తే వైసీపీ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నట్లుగా అర్ధం అవుతోంది. అయిదేళ్ల పాలనలో మూడు రాజధానులు మా విధానం అని బొత్స అన్నారు. ఇపుడు మావిగన్ పేరుతో ప్రభుత్వానికి సూచన చేశామని చెప్పారు. మరి అమరావతి రాజధాని మీద మీద మీ వైఖరి ఏమిటి అంటే మా వైఖరి ముఖ్యం కాదని ఆయన జవాబు ఇవ్వడం విశేషం. వారు అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు కదా చేయనివ్వండి ఎవరు వద్దన్నారు అన్నారు. ఇక అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద తాము పోరాడుతామని బొత్స చెప్పారు.
మావిగన్ అంటూనే :
మరి వైసీపీ విధానం ఏంటి అంటే ప్రస్తుతం మావిగన్ అని బొత్స అంటున్నారు. ఇక అమరావతిలో పోరాటం చేస్తామని అంటున్నారు. సరే అవినీతి మీద ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలిచి పోరాడాల్సిందే. కానీ ఏపీకి అయిదు కోట్ల మందికి రాజధానిగా ఉన్న అమరావతి విషయంలో ఈ రోజుకీ వైసీపీ స్పష్ట లేకుండా ముందుకు సాగుతోందా అన్న సందేహాలకు అయితే బొత్స జవాబులులతో కలుగుతున్నాయి. అమరావతి రాజధానిగా మాకు ఓకే కానీ అక్కడ అవినీతి మీద మాత్రం కాదు అని సూటింగా స్పష్టంగా చెప్పవచ్చు కదా అని అంటున్న వారూ ఉన్నారు. అమరావతి రాజధానిగా ఇష్టం లేదా లేకపోతే ఆ విషయం కూడా సూటిగా చెప్పేయవచ్చు కదా అని అంటున్న వారూ ఉన్నారు. ఇలా ఏ విషయం తేల్చకుండా అమరావతిలో అవినీతి మీద పోరాటం అంటేనే విమర్శలు వస్తున్నాయి.
అక్కడే కార్నర్ :
కూటమి నేతలు కూడా సరిగ్గా ఇక్కడే వైసీపీని కార్నర్ చేస్తున్నారు. అమరావతిలో పర్యటించే నైతిక హక్కు మీకు ఎక్కడిది అని కూడా వారు నిలదీస్తున్నారు. అమరావతి మీద వైసీపీకి స్టాండ్ లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఈ విషయంలో తన స్పష్టతను తెలియచేయకుండా ఉద్యమాలు ఎన్ని చేసినా మరెన్ని సూచనలు ఇచ్చినా జనాలు వాటిని ఏ విధంగా తీసుకుంటారు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి వైసీపీ పెద్దలే ఈ విషయంలో ఆలోచించుకోవాల్సి ఉందని అంటున్నారు.
