Begin typing your search above and press return to search.

సీనియర్ నేతలే జగన్ బలం...వదులుకుంటే దెబ్బే ?

వైసీపీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నేతల మీదనే ఆధారపడుతూ రాజకీయాలు చేస్తూ వస్తోంది.

By:  Satya P   |   22 Sept 2026 8:15 AM IST
సీనియర్ నేతలే జగన్ బలం...వదులుకుంటే దెబ్బే ?
X

వైసీపీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నేతల మీదనే ఆధారపడుతూ రాజకీయాలు చేస్తూ వస్తోంది. ఇప్పటికి మూడు సార్వత్రిక ఎన్నికలను వైసీపీ ఎదుర్కొంది. ఇందులో తొలి రెండు ఎన్నికల్లో వైసీపీ సీనియర్లకే టికెట్లు ఇచ్చింది. 2024 కి వచ్చేసరికి వైసీపీ చేసినన్ని రాజకీయ ప్రయోగాలు మరే పార్టీ ఇప్పటిదాకా చేసి ఉండదు, ఇక మీదట చేయదు అన్నట్లుగానే సాగింది. దీని వల్లనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ దిగజారింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే గతంలో తప్పులు మళ్లీ వైసీపీ చేయవద్దు అని ఆ పార్టీకి వ్యూహకర్తలు సూచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇంతకీ పొరపాట్లు ఏంటి :

ఏకంగా వంద దాకా సీట్లలో వైసీపీ 2024 ఎన్నికల్లో భారీ మార్పులు చేసింది. దాంతో తమకు రాజకీయంగా పట్టున్న చోటు నుంచి సీనియర్లు వేరే చోట్లకు చివరి నిముషంలో వెళ్లాల్సి వచ్చింది. అక్కడే పార్టీకి తొలి దెబ్బ పడింది అని అంటున్నారు. అంతే కాదు కొందరు సీనియర్ నేతల వారసులకు టికెట్లు ఇచ్చి పోటీ చేయించింది. దాంతో ఆయా చోట్ల కూటమి నుంచి బలమైన నేతలు దిగి చాలా ఈజీగా వీరిని ఓడించేశారు. జనంలోనూ ఈ పోలిక వల్ల వైసీపీ నష్టపోయింది అని అంటున్నారు. దాంతో 2029 ఎన్నికల్లో కూడా ఇదే విధమైన వైఖరితో ప్రయోగాలు చేస్తే వైసీపీ దారుణంగా నష్టపోతుందని ఆ పార్టీ కొత్తగా నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త కపిల్ సాహు బృందం స్పష్టం చేసింది అని అంటున్నారు.

కీలక నివేదికతో :

ఇంతకీ ఎన్నికల వ్యూహకర్త కపిల్ సాహుకి ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ ఏడాది మేలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీని అధికారంలోకి తెచ్చి విజయ్ ని సీఎం గా చేయడంతో సాహు బృందం కీలక పాత్ర పోషించింది అని అంటున్నారు. ఈ బృందం వ్యూహాలు అన్నీ అక్కడ చక్కగా పనిచేసి విజయ్ కి సీఎం పీఠాన్ని దక్కించాయని అంటున్నారు దాంతో ఏరి కోరి మరీ వైసీపీ ఈ మధ్యనే తమ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త కపిల్ సాహు బృందాన్ని నియమించింది అని అంటున్నారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన ఈ బృందం వైసీపీ పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో ఒక నివేదికను తయారు చేసి అందించింది అని చెబుతున్నారు. ముఖ్యంగా రీజనల్ వైజ్ గా అయిదు జిల్లాలను పట్టుకుని ఈ బృందం గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసి నివేదికను రెడీ చేసింది అని చెబుతున్నారు. అందులో ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు, రాయలసీమలో మరో రెండింటితో పాటు కోస్తాలో ఒక జిల్లా ఉందని అంటున్నారు

ఇంచార్జిల పనితీరు మీద :

వైసీపీ ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లలో ఇంచార్జిలను నియమించింది. అయితే వీరిలో స్ట్రాంగ్ గా ఎంత మంది ఉన్నారు, పని తీరు ఎలా ఉంది అన్నది పార్టీ ఈ బృందం నుంచి నివేదిక కోరినట్లుగా చెబుతున్నారు. వైసీపీకి క్షేత్ర స్థాయిలో గ్రాఫ్ ఎలా ఉంది, ప్రజల నుంచి వస్తున్న స్పందన, అలాగే వచ్చే ఎన్నికల్లో ఎవరిని పోటీకి దించితే ఫలితాలు సరిగ్గా వస్తాయి అన్నది కూడా ఈ బృందం పూర్తిగా అధ్యయనం చేసి మరీ నివేదిక తయారు చేసింది అని అంటున్నారు. దాని ప్రకారం 2024 ఎన్నికల్లో రాజకీయ బదిలీల పేరుతో చేసిన అతి పెద్ద మార్పులను ఇపుడు సరి చేసుకోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు. అంతే కాదు వారికి తమ సొంత నియోజకవర్గం అప్పగిస్తే తిరిగి వారు రాణిస్తారు అని నివేదికలో వెల్లడించినట్లుగా పేర్కొంటున్నారు. రాజకీయంగా చూస్తే వైసీపీలో సీనియర్లకు నెట్ వర్క్ బలంగా తమ సొంత ఇలాకాల్లో ఉంది అని అంటున్నారు. వారిని కదిపినా లేదా కొత్త వారిని తెచ్చి టికెట్లు ఇచ్చినా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయన్నదే నివేదిక సారాంశంగా చెబుతున్నారు.

సీనియర్లకే పగ్గాలు :

వైసీపీ 2029లో ప్రయోగాలు చేయకుండా సీనియర్లకే టికెట్లు ఇస్తేనే మేలు చేకూరుతుందని ఈ నివేదిక తెలియచేస్తోంది అని అంటున్నారు. అయితే వైసీపీలో చాలా మంది సీనియర్లు తమ వారసులను ముందు పెడుతున్నారు. వారిని కనుక దించితే అంత పట్టు సాధించకపోగా చేదు ఫలితాలు వస్తాయని నివేదిక చెబుతోంది అంటున్నారు. దీంతో తొందరలోనే వైసీపీ అధినాయకత్వం సీనియర్లతో కీలక సమావేశాలు నిర్వహించడమే కాకుండా వారికి మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి సీనియర్ నేతలు కొంతమంది పోటీకి విముఖంగా ఉన్నారు, మరి కొన్ని చోట్ల జూనియర్లకు పగ్గాలు అందాయి. వాటిని ఎలా సరిచేసుకుంటారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.