జగన్ ఒంటరిగా కాదా...మాస్టర్ ప్లాన్ ఏంటి ?
సింహం సింగిల్ గా వస్తుంది. మేము ఒంటరిగానే ఒంటి చేత్తోనే ఎదుర్కొంటాం. ఇవన్నీ మాట్లాడేందుకు బాగానే ఉంటాయి.
By: Satya P | 20 July 2026 2:29 PM ISTసింహం సింగిల్ గా వస్తుంది. మేము ఒంటరిగానే ఒంటి చేత్తోనే ఎదుర్కొంటాం. ఇవన్నీ మాట్లాడేందుకు బాగానే ఉంటాయి. సినిమాలలో అయితే డైలాగులుగా బాగా పేలుతాయి. కానీ ఇది రాజకీయం. ప్రజలతో ముడిపడి ఉన్న ఫీల్డ్ ఇది. ప్రజా సమూహంతో చేసే రాజకీయంలో వ్యూహాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఏ మాత్రం తేడా కొట్టినా కూడా సీన్ రివర్స్ అవుతుంది. వైసీపీ విషయం తీసుకుంటే 2014, 2019, 2024 ఎన్నికలు వేరు అని అంటున్నారు. ఆ మూడు ఎన్నికల్లో వైసీపీ మూడు రకాలుగా విభిన్నమైన రాజకీయ భూమికలను పోషించింది. కానీ ఈసారి 2029 లో మాత్రం వైసీపీకి ఒక అగ్ని పరీక్షగానే ఉండబోతోంది అని అంటున్నారు. విశ్లేషకులు సైతం ఇదే మాట చెబుతున్నారు.
రిస్క్ తీసుకోకూడదనే :
చాన్స్ తీసుకోవాలంటే మరో చాన్స్ ఉండాలి. కానీ వైసీపీకి 2029 ఎన్నికలు చాలా కీలకం అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళనాడులో అన్నా డీఎంకే లాంటి ఢక్కామెక్కీలు తిన్న పార్టీయే వరసగా రెండు సార్లు ఓటమి చెందిన తరువాత చీలికలు పీలికలు అయిపోతున్న నేపథ్యం ఉంది. ఒక్కసారి ఓటమికే నిన్నటిదాకా అధికారంలో ఉన్న డీఎంకే తృణమూల్ కాంగ్రెస్ లలో కూసాలు కదులుతున్న నేపథ్యం ఉంది. వైసీపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి అతి పెద్ద బలం బలగం జగన్ అన్నది నిజం. ఆయనను అల్లుకుని ఆయన చుట్టూనే ఉన్న పార్టీ వైసీపీ. అందుకే జగన్ ని విశ్వసిస్తూ వైసీపీ నేతలు అంతా 2029 కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే 2029 ఎన్నికల్లో వైసీపీ రిస్క్ ఏ విధంగానూ తీసుకోకూడదని పార్టీ వారు అంతా సూచిస్తున్నారు అని అంటున్నారు.
కలసివచ్చిన వార్తితో :
వైసీపీ ఒంటరిగా పోటీ పడడం ఏ విధంగా చూసినా 2029 ఎన్నికల్లో రిస్క్ అని అంటున్నారు. ఎందుకంటే కూటమి అవతల మూడు పార్టీలతో బలంగా ఉంది. వారి ముగ్గురు ఓటు షేర్ కలిస్తే 2024 ఎన్నికల్లో 56 శాతం పైగా వచ్చింది. వైసీపీ ఓటు షేర్ 40 శాతం ఉంది. తేడా భారీగానే ఉంది. అయిదేళ్ళ తరువాత యాంటీ ఇంకెంబెన్సీ ఉందనుకున్నా కూటమికి అయిదారు శాతం ఓట్లు తగ్గుతాయని భావించినా వైసీపీ ఆ మేరకు మరో అయిదారు శాతం పెంచుకుంటుందని లెక్కలేసినా రెండూ సమ ఉజ్జీలుగా మారి పోరు హోరా హోరీ అవుతుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఈ క్రమంలో కలసి వచ్చిన పార్టీలు చిన్నవో పెద్దవో అయినా సరే ముందుకు వెళ్తే ఒకటీ అరా శాతం ఓటు షేర్ కూడా రేపటి ఎన్నికల్లో భారీగా ఫలితాల మార్పునకు కారణం అవుతుందని అంటున్నారు.
నోరున్న పార్టీలని :
ఈ క్రమంలోనే నోరున్న పార్టీలు జనంలో ప్రభావితం చేసే పార్టీలుగా వామపక్ష పార్టీలను వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. ఈ రెండు పార్టీలు కూటమి మీద పోరు చేస్తున్నాయి. వైసీపీ లేవనెత్తుతున్న అంశాలనే ఆ పార్టీలు కూడా నిలదీస్తున్నాయి. సీపీఎం సీపీఐ జనంలో ఆందోళనలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నాయి. దాంతో తమతో భావ సారూప్యం ఉన్నందువల్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలసి ముందుకు సాగితే మేలు జరుగుతుందని వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. మరింత గట్టిగా కూటమి సర్కార్ ని నిలదీసేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతుందని కూడా లెక్క వేస్తోంది అని అంటున్నారు.
మారిన స్వరంతోనే :
ఇక ఈ మధ్య కాలంలో వామపక్షాల స్వరంలోనూ మార్పు కనిపిస్తోంది. వైసీపీని గొడ్డలి పార్టీని అని పదే పదే చంద్రబాబు విమర్శించడం మీద సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఒకసారి అధికారంలోనూ రెండు సార్లు ప్రతిపక్షంలోనూ ఉన్న పార్టీని పట్టుకుని ఆ విధంగా ఎలా అంటారు అని ఆయన నిలదీశారు. ఇక సీపీఎం సైతం వైసీపీతో పనిచేసేందుకు ఆసక్తిగా ఉందని ప్రచారం సాగుతోంది. విభజన ఏపీలో వరసగా మూడు ఎన్నికలు జరిగినా వామపక్షాలకు అసెంబ్లీలో ఎక్కడా ప్రాతినిధ్యం లేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని అయినా అసెంబ్లీలోకి ప్రవేశించాలని ఈ పార్టీలు చూస్తున్నాయి. వైసీపీ కూడా ఎర్రన్నలను కలుపుకుంటే కూటమిని మరింత బలంగా ఢీ కొట్టగలమని భావిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ఊహాగానాలు ఎపుడు నిజం అవుతాయో.
