జగన్ ని ముంచింది మీరే !
వైసీపీ భారీ ఓటమి పాలు అయింది. వై నాట్ 175 అని ఒక స్ట్రాంగ్ స్లోగన్ లో 2024 ఎన్నికల ముందు జనంలోకి వచ్చిన వైసీపీకి దక్కినవి కేవలం 11 సీట్లు మాత్రమే.
By: Satya P | 16 Sept 2025 4:00 PM ISTవైసీపీ భారీ ఓటమి పాలు అయింది. వై నాట్ 175 అని ఒక స్ట్రాంగ్ స్లోగన్ లో 2024 ఎన్నికల ముందు జనంలోకి వచ్చిన వైసీపీకి దక్కినవి కేవలం 11 సీట్లు మాత్రమే. కనీసంగా 18 అసెంబ్లీ సీట్లు దక్కినా ప్రతిపక్ష హోదా వచ్చేది. కానీ అవేమీ లేదు. దారుణంగా వైసీపీ పరాజయం పొందింది. అయిదేళ్ళ పాలనలో అభివృద్ధి విషయం పక్కన పెడితే బటన్ నొక్కి సంక్షేమంలో తామే చాంపియన్ అని చెప్పుకున్న వైసీపీకి ఇంత దిగజారుడు ఫలితాలు రావడమేంటి అన్న చర్చ ఎపుడూ జరుగుతూనే ఉంది. అయితే వైసీపీ ఓటమికి కారణాలు ఏవి అంటే బోలెడు అని చెబుతూనే ఉంటారు. అవి తవ్వి తీసిన కొద్దీ ఇంకా కనిపిస్తూనే ఉంటున్నాయి.
ఇప్పటికీ అర్థం కానిది :
వైసీపీకి ఇంతటి దారుణమైన ఓటమి అన్నది కలలో కూడా ఎవరూ అనుకోలేదు. ఆ మాటకు వస్తే రాజకీయ ప్రత్యర్ధులు సైతం వైసీపీ ఓడుతుందని అనుకున్నారే కానీ ఇంత ఘోర పరాభవం దక్కుతుందని అనుకోలేదని అంటారు. ఇక వైసీపీకి చెందిన క్యాడర్ అయితే వారికి ఇప్పటికీ అర్ధం కాని విషయంగానే ఈ 11 సీట్ల వ్యవహారం ఉంది అని అంటున్నారు. ఒక వైపు 40 శాతం ఓటు షేర్ వచ్చింది. మరో వైపు చూస్తే ఆ ఓటు షేర్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అతి తక్కువ సీట్లు దక్కాయి. దీని మీద కొందరు అయితే ఈవీఎంల మహిమ అంటున్నారు, మరి కొందరు అయితే క్యాడర్ ని పట్టించుకోకపోవడం వల్ల అని అంటున్నారు. ఇలా చాలా రకాలైన కారణాలు చెబుతూ వస్తున్నారు.
చుట్టూ ఉన్న వారేనా :
ఇక జగన్ ఓటమి కారణం ఇవన్నీ కాదని అసలు వేరేది ఉందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ అయిదేళ్ళూ తాడేపల్లిలోనే ఉన్నారు బయటకు వచ్చినా పరదాల మాటున సభలు జరిగేవి. మరో వైపు చూస్తే ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంటూ ఉండేదని కూడా ఆ పార్టీలో కీలక నేతలుగా పనిచేసి వచ్చిన వారు చెబుతూ ఉన్నారు. వారే వైసీపీ ని జగన్ ని ముంచేశారు అని అంటున్నారు. సర్వేల పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చి వైసీపీకి తిరుగులేదని ఎదురులేదని చెప్పి మభ్యపెట్టిన వారే జగన్ చుట్టూ ఉన్నారని వారి వల్లనే పార్టీకి ఘోరమైన ఓటమి సంభవించింది అని అంటున్నారు. ఇదే అన్నిటి కంటే ముఖ్యమైన ప్రధానమైన కారణంగా చెబుబుతున్నారు.
ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత :
ఇక చూస్తే జగన్ పట్ల ప్రజలలో మంచి ఇమేజ్ ఉందని కానీ వైసీపీకి చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల పట్ల జనంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఈ అసలు నిజాన్ని జగన్ వద్దకు తీసుకుని వెళ్ళి చెప్పలేదని కూడా చెబుతున్నారు. ఇంకో వైపు క్యాడర్ ని అసలు ఏ మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అలా బ్రహ్మాండమైన ఊపుతో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చిన క్యాడర్ నిరాశతో ఉన్నా వారి గురించిన సమాచారం అధినేతకు తెలియచేయలేదని అంటున్నారు. జగన్ కి జనాలకు క్యాడర్ కి మధ్య ఒక అతి పెద్ద అడ్డు తెర కట్టేసి ఆయన చుట్టూ చేరిన ఆ నలుగురు చేసిన సర్వనాశనం వల్లనే వైసీపీ పూర్తిగా మునిగిపోయింది అని అంటున్నారు.
బిల్డప్పులతోనే :
వైసీపీకి దమ్ము ఉందని ధైర్యం ఉందని చెబుతూ ఎంతసేపూ పొద్దు పుచ్చుతూ వచ్చిన వారే అధినాయకత్వం చుట్టూ ఉన్నారని కూడా అంటున్నారు. వాస్తవాలు జగన్ కి చేరకుండా జాగ్రత్తపడిన వారి మూలంగానే ఇదంతా జరిగింది అని కూడా ఇపుడు అసలు నిజాలు చెబుతూ నిష్టూర మాడుతున్నారు. జగన్ ని బయటకు రానీయకుండా చేయడంతో అయిదేళ్ళూ ఇటు జనాలను అటు పార్టీ జనాలకు కలవనీయకుండా చేసిన దాని ఫలితంగానే వైసీపీ దారుణాతి దారుణంగా ఓటమి పాలు అయింది అని అంటున్నారు.
పార్టీ రెక్కలు విరిగినా :
ఏ పార్టీకి అయినా క్యాడర్ రెక్కలుగా ఉంటుంది. వారే రధ చక్రాలుగా ఉంటారు. అలాంటి మూల స్థంభాలను ఏమీ కాకుండా చేశారు అని అంటున్నారు. క్యాడర్ వేదనలు రోదనలు జగన్ వైపు చేరకుండా కోటరీ పనిచేసింది అని కూడా చర్చించుకుంటున్నారు. దాని వల్లనే వైసీపీ అన్ని విధాలుగా చెడిపోయి ఎన్నికల్లో అనూహ్యమైన ఓటమిని చవి చూసి చతికిలపడింది అని అంటున్నారు. వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది ఏ రోజూ అధినాయకత్వానికి తెలియ చేయకపోవడం వల్లనే ఇంతటి పేలవమైన ఫలితాలను అందుకోవాల్సి వచ్చిందని కూడా క్యాడర్ నుంచి వస్తున్న మాట. మరి ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని వైసీపీ అధినాయకత్వం జనం బాటన పార్టీ జనం మాటున నిలిచి ముందుకు సాగుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. లేకపోతే ఈ రోజుకీ ఈవీఎంలు అని ఎన్నికల్లో దౌర్జన్యాలు అని వేరే కారణాలతో పొద్దు పుచ్చితే మాత్రం రానున్న రోజులలో మరింతగా ఇబ్బందిపాలు కాక తప్పదని అంటున్నారు.
