Begin typing your search above and press return to search.

వైఎస్సార్ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్న మోడీ !

అవునా ఇది నిజమా అని ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఇది నిజం. రాజకీయ చరిత్రలో పదిలంగా ఉన్న నిజం.

By:  Garuda Media   |   3 Sept 2025 10:33 AM IST
వైఎస్సార్ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్న మోడీ !
X

అవునా ఇది నిజమా అని ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఇది నిజం. రాజకీయ చరిత్రలో పదిలంగా ఉన్న నిజం. వైఎస్సార్ తెలుగు రాజకీయాల్లో మేరు నగ ధీరుడుగా వెలిగిన రోజులలో జరిగిన వాస్తవం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎం గా వైఎస్సార్ కీర్తి హస్తినపురిలో గొప్పగా వెలిగిపోతున్న నేపధ్యంలో జాతీయ రాజకీయం అంతా ఆయన చుట్టూ తిరిగింది. ఆయన పేరు చాలా సార్లు మారుమోగింది. దాంతో ఆనాడు ఇతర పార్టీల నాయకులు ముఖ్యమంత్రులు అంతా వైఎస్సార్ షేక్ హ్యాండ్ కోసం పోటీలు పడేవారు అని చెబుతారు. అలా అప్పటికి గుజరాత్ నుంచి బీజేపీ సీఎం గా ఉన్న నరేంద్ర మోడీ కూడా వైఎస్సార్ తో కరచాలనానికి ఉబలాట పడ్డారు అన్నది నిజం అంటున్నారు.

ఢిల్లీ లో తెలుగు తేజంగా :

కాంగ్రెస్ కి 2004లో అధికారం అందించడంలో ఉమ్మడి ఏపీ ఎంతగానో దోహదపడింది. ఏపీ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ ఎంపీలు నెగ్గి ఆనాడు యూపీఏ బలం పెరగడానికి కారణం అయ్యారు. అలా వైఎస్సార్ పరపతి కూడా జాతీయ స్త్యాయిలో పెరిగింది. కేంద్రంలో యూపీయే ఏర్పాటు అయి మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి అతి పెద్ద రీజన్ వైఎస్సార్ అని అంతా అనుకున్న నేపధ్యంలో వైఎస్సార్ ఢిల్లీ వస్తే చాలు అంతా ఆయన చుట్టూ చేరేవారు. అంతలా వైఎస్సార్ జాతీయ రాజకీయాల్లో ప్రధాన ఆకర్షణగా మారారు. ఆయనను కలవాలని ఆయనతో పరిచయం చేసుకోవాలని ఎంతో మంది ఆరాటపడిన నేపథ్యం కూడా ఉంది.





వైఎస్సార్ దగ్గరకు వచ్చిన మోడీ :

ఇక ఆ సమయంలో గుజరాత్ సీఎం గా ఉన్న నరేంద్ర మోడీ వైఎస్సార్ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకోవడం అది తెలుగు వారి శక్తి అని అంతా అంటున్నారు. ఈ రోజున చూస్తే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం అంతా అడుగుతున్న నేపథ్యం ఉంది. ఏపీ నుంచి అయితే అన్ని పార్టీల అధినేతలూ మోడీ ప్రాపకం కోసం చూస్తున్న నేపథ్యం ఉంది. అంతే కాదు మోడీ ఈజ్ గ్రేట్ అని కీర్తిస్తున్న తీరుని కూడా చూస్తున్నారు. కానీ అదే మోడీ వైఎస్సార్ వంటి తెలుగు దిగ్గజం కోసం ఆయన కరచాలనం కోసం ఎదురు చూశారు అంటే ప్రతీ తెలుగు గుండె కచ్చితంగా ఉప్పొంగాల్సినదే అని అంటున్నారు.

వైఎస్సార్ సాటి లేరుగా :

సాధారణంగా జాతీయ రాజకీయాల్లో దక్షిణాదికి ప్రాధాన్యత తక్కువ అని అంటారు. అందునా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కూడా ఇంకా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. అలాంటిది ఢిల్లీలో తెలుగు సత్తా చాటి అందరినీ ఆకర్షించడం అంటే మాటలు కాదు. ఆ రేర్ ఫీట్ ని ఒక జాతీయ పార్టీలో ఉంటూ బలమైన ప్రాంతీయ నాయకుడిగా ఎదిగి వైఎస్సార్ నిరూపించారు అన్నది విశ్లేషణ. ఇక మోడీ తనను కలవడానికి వచ్చినపుడు తన ముఖంలో చిరునవ్వు చెదరకుండానే ఆయనను చూస్తూ వైఎస్సార్ మాట్లాడిన తీరు సైతం ఆకట్టుకునేలా ఉంది .

వైఎస్సార్ బాడీ లాంగేజ్ ని ఆ ఫోటోలో చూస్తే కనుక నిట్ట నిలువునా తెలుగు జాతి గర్వాన్ని గౌరవాన్ని ఢిల్లీలో అందరికీ చూపించారు అని అర్ధమవుతోంది. ఏది ఏమైనా వైఎస్సార్ ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసింది కేవలం అయిదుంపావు ఏళ్ళే కానీ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకం కావడమే కాదు ఆనాటి ఇతర పార్టీల నాయకులను సూదంటు రాయిగా ఆకట్టుకున్నారు అన్నది చెప్పక తప్పదు. అలా హస్తినా పురిలో వైఎస్సార్ నిలబెట్టిన తెలుగు జాతి గౌరవాన్ని ఈనాటి తరం కూడా స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగితే ఎంతో బాగుంటుంది అని అంటున్నారు అంతా.