Begin typing your search above and press return to search.

వారసత్వం కాదు నాయకత్వం ఇచ్చేది వారే చెల్లెమ్మా !

ఎవరైనా జనంలో నుంచే రావాలి. జన నాయకులుగా ఎదగాలి. వైఎస్సార్ అలాగే ఎవరెస్ట్ శిఖంగా ఎదిగారు. ఆయనకు ముందు రాజకీయాల్లో ఎవరు ఉన్నారు.

By:  Satya P   |   13 Sept 2025 6:00 AM IST
వారసత్వం కాదు నాయకత్వం ఇచ్చేది వారే చెల్లెమ్మా !
X

ఎవరైనా జనంలో నుంచే రావాలి. జన నాయకులుగా ఎదగాలి. వైఎస్సార్ అలాగే ఎవరెస్ట్ శిఖంగా ఎదిగారు. ఆయనకు ముందు రాజకీయాల్లో ఎవరు ఉన్నారు. ఆయనకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ ఆయన సొంతంగానే తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తిరుగులేని నేతగా జన గుండెల్లో పదిలంగా తన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్సార్ మూడు దశాబ్దాల రాజకీయ జీవితం చూస్తే ఒక ప్రత్యేకత ఎంతో విశిష్టత కనిపిస్తుంది.

ఎనిమిదేళ్ళు మాత్రమే :

వైఎస్సార్ తన మొత్తం ముప్పయ్యేళ్ళ రాజకీయ జీవితంలో కేవలం ఎనిమిదేళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నారు అన్నది గుర్తు చేసుకోవాలి. ఆయన టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి మంత్రి పదవిని అందుకున్నారు. అలా 1980 నుంచి 1983 మధ్యలో అంజయ్య, భవనం వెంకటరామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేశారు. 1983 జనవరిలో టీడీపీ గెలవడంతో ఆయన విపక్షంలోకి వచ్చారు. ఇక 1989లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ వైఎస్సార్ కడప నుంచి ఎంపీగా ఉన్నారు. 1991లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినా కూడా ఆయనకు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం రాలేదు. ఇక 1989 నుంచి 1994 మధ్యలో అనేక సార్లు ఆయన పేరు ఏపీ కాంగ్రెస్ సీఎం గా వినిపించినా చాన్స్ అయితే దక్కలేదు. దాంతో తాను ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు అని గుర్తించిన వైఎస్సార్ తన పట్టుదలను పెంచారు. జనాలకు ఇంకా చేరువ అయ్యారు. జనం మనిషిగా ఆయన ముద్రపడ్డారు. 1999 నుంచి 2004 మధ్యలో వైఎస్సార్ ప్రజల పక్షాల చేసిన పోరాటాలు కానీ మండుటెండలో ఆయన చేసిన పాదయాత్ర కానీ ఆయనను జన నేతగా చేసింది. ఆ విధంగా ఆయన 2004లో సీఎం అయ్యారు. ఇక అయిదేళ్ల పాటు విజయవంతం గా పనిచేసి 2009లో సైతం రెండోసారి సీఎం అయ్యారు. తానే కాదు తన బ్రాండ్ ని క్రియేట్ చేసి అనేక మందిని గెలిపించారు. వైఎస్సార్ అంటే ఒక పొలిటికల్ వైబ్రేషన్ గా తెలుగు నాట శాశ్వతం చేశారు.

జనం వద్దకే వెళ్ళాలి :

వైఎస్సార్ వారసత్వం గురించి ఎవరిది అని చర్చించుకోవడం అన్నది ముఖ్యం కాదు ప్రజలలో నిలిచి తన నాయకత్వం నిరూపించుకున్న వారే ప్రజా నాయకులు అవుతారు. వారే బలంగా నిలిచి పది కాలాల పాటు సేవ చేసేందుకు వీలు కలుగుతుంది. ఇవన్నీ ఇవ్వాల్సింది ప్రజలే. వైఎస్సార్ పేరు అన్నది రాజకీయ ఎంట్రీ కోసం మాత్రమే పనికి వస్తుంది. ఆ మీదట నాయకత్వం నిరూపించుకోవాల్సింది జనం మధ్యనే. ప్రజలు ఎవరిని ఆదరించి నెత్తిన పెట్టుకుంటారో వారే లీడర్ గా ఉంటారు. ఆ విధంగా చేయాలి అంటే జవసత్వాలతో సమర్ధ నాయకత్వానికి బాటలు వేసుకోవాల్సి ఉంటుంది.

ఎవరైనా రావచ్చు :

ఇక ప్రజా జీవితంలోకి ఎవరైనా రావచ్చు. వారిని అడ్డు పెట్టడానికి కూడా ఏమీ లేదు. వైఎస్సార్ వారసులం మేమే అని ఏ ఒక్కరూ క్లెయిం చేసుకోవాల్సింది కూడా ఇక్కడ లేదు. వైఎస్సార్ రాజకీయ నాయకుడి స్థాయి నుంచి ప్రజా నేతగా మారి జనం గుండెలలో దేవుడిగా కొలువు ఉన్నారు. ఆయనది ప్రజా కుటుంబం. ప్రజలే ఆయన కుటుంబం. ఇక వైఎస్సార్ వారసత్వం అంటే ఆయన ఇంటి పేరు కాదు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడం, ఆయనలోని మంచితనం మానవత్వం పేద ప్రజల పట్ల చూపించిన కరుణను జనంలోకి తీసుకెళ్ళి తాము కూడా ఆయన మాదిరిగా ప్రజా సేవకు అంకితం అవుతామని భరోసా ఇవ్వగలిగితే తప్పకుండా జనాశీర్వాదం లభిస్తుంది. అందువల్ల ఈ విషయం తేల్చుకోవాల్సింది రాజకీయంగా కానే కాదు, జనంలోనే. ఎవరు ప్రజలకు చేరువగా ఉంటూ వైఎస్సార్ సిద్ధాంతాలను అమలు చేస్తారో వారే సిసలైన వారసులు అన్నదే అంతా గుర్తించాలి