Begin typing your search above and press return to search.

రాజారెడ్డిని ఓడించిన పులివెందుల

పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీని ఓడించిన నేపధ్యమూ చరిత్రలో పద్లంగా ఉందని గుర్తుకు తెస్తున్నారు.

By:  Satya P   |   13 Aug 2025 12:17 AM IST
రాజారెడ్డిని ఓడించిన పులివెందుల
X

పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట అని రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా ఉంటుంది. పులివెందులలో ప్రతీ గడపా ప్రతీ ఓటూ ఆ కుటుంబానికే అంకితం అని కూడా చాలా బలంగా భావిస్తారు. అయితే పులివెందులలో వైఎస్సార్ కుటుంబానికి ఎక్కువ సంఖ్యలో అభిమాన జనం ఉన్నారు. ఎక్కువ సార్లు విజయాలు దక్కాయి కానీ అదే సమయంలో వైఎస్సార్ ఫ్యామిలీ ఓడిన సంఘటనలూ ఉన్నాయని అంటున్నారు. పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీని ఓడించిన నేపధ్యమూ చరిత్రలో పద్లంగా ఉందని గుర్తుకు తెస్తున్నారు.

రాజారెడ్డి ఓటమి :

పులివెందుల పంచాయతీకి 1970లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజారెడ్డి తన సతీమణితో కలసి వార్డు అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఈ దంపతులు ఇద్దరూ చెరో వార్డులో పోటీకి దిగితే ప్రజలు ఇద్దరినీ ఓడించారు. రాజారెడ్డి అంటే వైఎస్సార్ కి తండ్రి జగన్ కి తాత. మరి ఆ విధంగా రాజకీయాల పట్ల ఆసక్తిని ఆ కుటుంబంలో పెంచుకున్న తొలి తరం వ్యక్తిగా రాజారెడ్డి తన కోరికను పోటీ చేయడం ద్వారా వ్యక్తం చేస్తే మొదటి ప్రయత్నంలోనే పులివెందుల జనాలు తిరస్కరించారు అని నాటి విషయాలని ఒక చానల్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వెల్లడించారు. ఆయనే వైఎస్సార్ ఫ్యామిలీ మరెన్ని సార్లు ఓడిందో కూడా డేటా అంతా చెప్పుకొచ్చారు.

ఘనంగా ఎగిరిన పసుపు జెండా :

ఇక వైఎస్సార్ రాజకీయ రంగ ప్రవేశం 1978లో జరిగింది. ఆయన పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో రెండోసారి గెలిచారు. ఇక 1984లో పార్లమెంట్ కి ఎన్నికలు జరిగితే కడప ఎంపీ సీటుని తెలుగుదేశం గెలుచుకుంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన డీఎన్ రెడ్డికి 332,915 ఓట్లతో పాటు 51.3 శాతం ఓట్లను టీడీపీ సాధించింది. ఆ సమయంలో పులివెందులలో కూడా టీడీపీకి మెజారిటీ వచ్చింది. అంటే మొత్తం ఓట్లలో సగానికంటే ఎక్కువ అన్న మాట. అలా టీడీపీ వస్తూనే కడప కోటను ఢీ కొట్టింది అన్న మాట.

వైఎస్సార్ కే ఇబ్బంది :

అదే విధంగా 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కే గెలుపు ఇబ్బంది పెట్టిన ఉదంతం ఉంది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కేవలం 5,435 ఓట్లతో బయటపడ్డారు అని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వైఎస్సార్ కి 368,611 ఓట్లు రాగా టీడీపీ తరఫున పోటీ చేసిన కందుల రాజమోహన్ రెడ్డికి 363,166 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నిక ఎంతటి కలకలం రేపింది అంటే ఒక దశలో వైఎస్సార్ ఓటమి ఖాయమని కూడా ప్రచారం సాగేంతలా అని చెబుతారు. ఇక ఈ ఎన్నికల్లోనూ పులివెందులలో తెలుగుదేశం మంచి రాజకీయ ప్రదర్శన చేసింది అని అంటారు.

ఆయన ఓటమితో అలా :

ఇక మరో వైపు చూస్తే 2017లో కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలు అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బీటెక్ రవి ఎమ్మెల్సీగా విజయం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పులివెందుల స్థానిక సంస్థల ఓటర్లు టీడీపీకి జై కొట్టారని చెబుతారు. అలా చూస్తే కనుక వైఎస్సార్ కుటుంబానికి పులివెందుల కంచుకోట అని ఎంతగా ప్రచారంలో ఉన్నా దెబ్బ తీసిన సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.