“మిస్సింగ్ యూ మచ్” తండ్రికి జగన్ నివాళి
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
By: A.N.Kumar | 2 Sept 2025 12:34 PM ISTవైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించారు.
తల్లి వైఎస్ విజయమ్మను ఆప్యాయంగా పలకరించిన జగన్, భార్య వైఎస్ భారతి, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ఘాట్‌ను సందర్శించి తమ గౌరవం నివాళులర్పించారు. “Missing you much” అంటూ జగన్ ట్వీట్ చేయడం, ఆయన తండ్రిపై ఉన్న ప్రేమను, జ్ఞాపకాలను ప్రతిబింబించింది. తర్వాత వైఎస్ షర్మిల కూడా తన కుమారుడు, కుమార్తె, కోడలితో కలిసి ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సమేతంగా మహానేతను స్మరించుకున్నారు.
- వైఎస్సార్‌సీపీ నేతల నివాళులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇడుపులపాయ చేరుకొని నివాళులు అర్పించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, అంజాద్ బాషా, మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్, ఎమ్మెల్యే ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘు రామ్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు తదితరులు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
- సంక్షేమ రారాజు స్మరణ
సంక్షేమ పథకాల ద్వారా పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు స్మరించుకున్నారు. సంక్షేమ ప్రదాత, అభివృద్ధి విధాతగా గుర్తింపు పొందిన మహానేత సేవలను ఈ సందర్భంగా ఘనంగా ప్రస్తావించారు.
