వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా సునీత పలు కోర్టుల్లో చేసిన న్యాయపోరాటానికి కూడా ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు.
By: Tupaki Political Desk | 24 July 2026 11:58 PM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. వివేకా హత్య కేసు సమగ్రంగా దర్యాప్తు జరగలేదంటూ ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు పూర్తి చేసి ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని సీబీఐ కోర్టుకు తెలపగా, ఇరువైపులా వాదనలను విన్న న్యాయస్థానం ప్రస్తుతం కొత్తగా దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ఏడేళ్ల క్రితం నాటి వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసినట్లేనని భావిస్తున్నారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా సునీత పలు కోర్టుల్లో చేసిన న్యాయపోరాటానికి కూడా ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు.
2019 మార్చిలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందులలో ఆయన సొంత ఇంట్లోనే హత్య చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును అప్పటి ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కేసును సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ పలువురిని అరెస్టు చేసింది. విపక్షానికి చెందిన కొందరు నేతలను నిందితులుగా చేర్చింది. కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. అయితే నిందితులకు మరికొందరితో సంబంధం ఉందని, వారి గుట్టు తెలియాలని వివేకా కుమార్తె వైఎస్ సునీత తొలి నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు.
కీలక నిందితుల అసలు పాత్రను, తెరవెనుక ఉన్న కుట్ర కోణాలను పూర్తిగా వెలికితీయకుండానే సీబీఐ విచారణ ముగించిందని ఆరోపణలు చేస్తున్న సునీత నాంపల్లిలోని సీబీఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేశారు. ఆమె అభ్యంతరాలను పరిశీలించిన న్యాయస్థానం గతంలో ఒకసారి సీబీఐ విచారణకు ఆదేశించింది. నిందితులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల ఫోన్ సంభాషణలను తెలుసుకుని అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు సూచనలతో దర్యాప్తు చేసిన సీబీఐ న్యాయస్థానానికి నివేదిక కూడా సమర్పించింది. అయితే మలి విడత విచారణపైనా సునీత సంతృప్తి చెందలేదు. సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదనే ఆరోపణలతో మరోసారి కోర్టుకెక్కారు.
ఇక ఈ కేసు విషయమై తాజాగా నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని సమగ్రంగానే దర్యాప్తు చేపట్టామని, ఇప్పటికే సంబంధిత ఛార్జ్‌షీట్‌లను కూడా న్యాయస్థానంలో దాఖలు చేశామని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలను పరిశీలించిన నాంపల్లి సీబీఐ కోర్టు.. దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ వాదనలతో ఏకీభవించింది. సీబీఐ ఇప్పటికే పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని కొత్తగా మళ్లీ విచారణ జరగాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ పరిణామంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
