రాష్ట్రపతి ముంగిటకు వివేకా హత్య కేసు....ఏం జరగనుంది ?
దేశ రాష్ట్రపతికి విశేష ప్రత్యేక అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతిని నడిచే రాజ్యాంగంగా చెబుతారు.
By: Satya P | 9 Aug 2026 4:00 AM ISTదేశ రాష్ట్రపతికి విశేష ప్రత్యేక అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతిని నడిచే రాజ్యాంగంగా చెబుతారు. రాష్ట్రపతి ఉరి శిక్ష పడిన వారికి సైతం ఆఖరి నిముషంలో క్షమా బిక్ష పెట్టి ప్రాణాలను కాపాడే అధికారం కలిగి ఉంటారు. నిజానికి దేశంలో పాలన అంతా రాష్ట్రపతి పేరు మీద మంత్రి వర్గం చేస్తుంది. రాష్ట్రపతి అంతటి సర్వాధికారాలు కలిగిన వారు కాబట్టి తమ అభ్యర్థనలను వినతులు చాలా మంది చేసుకుంటారు. రాష్ట్రపతి భవన్ కి ఎన్నో నివేదనలు అభ్యర్ధనలు వెళ్తూ ఉంటాయి. ఇపుడు ఏపీకి సంబంధించి ఒక రాజకీయ సంచలనం గా ఉన్న విషయం మీద రాష్ట్రపతి భవన్ కి అభ్యర్ధన చేరింది.
న్యాయం కోసం అంటూ :
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగలేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత రాష్ట్రపతి భవన్ కి లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం చేయాలని ఆ లేఖలో రాష్ట్రపతిని వైఎస్ సునీత కోరారు. ఈ కేసులో ఏడేళ్ళు గడచినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సీబీఐ దర్యాప్తు అనంతర పరిణామాలను లేఖలో క్షుణ్ణంగా ఆమె లేఖలో వివరించారు. ఇప్పటికైనా వివేకా హత్య కేసులో తగిన న్యాయం జరిగేలా చూడాలని సునీత రాష్ట్రపతిని అభ్యర్ధించారు.
రాజకీయ సంచలనమే :
వివేకా హత్య కేసు దాదాపుగా క్లోజ్ అయింది అని అంతా భావిస్తున్న తరుణంలో సునీత రాష్ట్రపతికి నేరుగా రాసిన లేఖ రాజకీయంగా సంచలనం రేపుతోంది. రాష్ట్రపతికి ఈ లేఖలో అన్ని విషయాలను విడమరచి చెప్పడమే కాకుండా న్యాయం చేయాలని కోరడంతో ఇపుడు ఏమి జరుగుతుంది అన్నది కూడా సర్వత్రా చర్చించుకుంటున్నారు. నిజానికి చూస్తే ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు దాకా సునీత వెళ్ళి న్యాయ పోరాటం చేయాల్సింది అంతా చేశారు. ఈ కేసులో మరి కొందరు అనుమానితులను విచారించాలని ఆమె కోరారు. అయితే అందరినీ విచారించామని సీబీఐ పేర్కొంది. మరో వైపు చూస్తే ఈ కేసులో అన్ని దశలూ దాటిపోయాయి. న్యాయపరంగా చేయాల్సింది అయితే ఏమీ లేదనే అంటున్నారు.
అలుపెరగని పోరాటం :
ఇక సునీత ఈ కేసు విషయంలో అలుపెరగని పోరాటమే చేస్తూ వస్తున్నారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారు అన్న దాని మీద ఆమెకు ఉన్న అనుమానాలు ఆమె అనుమానిస్తున్న నిందితుల గురించి కూడా దర్యాప్తు సంస్థకు తెలియచేశారు. అయితే విచారణ మాత్రం కూలంకషంగా సాగింది అని సీబీఐ పేర్కొంది. కానీ సునీత మాత్రం ఇంకా అసలైన నిందితులు ఉన్నారని అంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ కి లేఖ రాయడం జరిగింది అని అంటున్నారు. మరి సునీత రాసిన లేఖ మీద రాష్ట్రపతి భవన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. సాధారణంగా రాష్ట్రపతి భవన్ కి వచ్చే వినతులు కానీ లేఖలు కానీ ఫిర్యాదులు కానీ ఉంటే వాటిని సంబంధిత శాఖలకే పంపిస్తారు. ఆ విధంగా ఈ కేసులో కూడా హోం శాఖకు ఏమైనా ఈ లేఖని పంపిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఒక వేళ అదే జరిగితే హోం శాఖ ఏమి చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఆఖరి అవకాశంగా సునీత రాష్ట్రపతి భవన్ తలుపు తట్టారని అంటున్నారు. మరి దీని పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
