కడప బరిలో వైఎస్ సునీత? పొలిటకల్ హీట్, జగన్ కి షాక్!!
ఇదే సమయంలో జగన్ రెడ్డిని సొంత జిల్లాలో ఇరుకన పెట్టేలా ఆయన చిన్నాన్న కుమార్తె వైఎస్ సునీతారెడ్డి రంగంలోకి దిగారని అంటున్నారు.
By: Tupaki Political Desk | 18 Sept 2026 8:00 PM ISTస్థానిక ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత జరగనున్న లోకల్ వార్ ను కూటమి పార్టీలు రెఫరెండంగా భావిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకుని మెజార్టీ స్థానాల్లో గెలవాలని విపక్షం వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఇవ్వకుండా పోరాడాలని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి చేసిన ప్రకటనతో ఎన్నికల వాతావరణం వేడెక్కిపోయింది. ఇదేసమయంలో జగన్ రెడ్డిని సొంత జిల్లాలో ఇరుకన పెట్టేలా ఆయన చిన్నాన్న కుమార్తె వైఎస్ సునీతారెడ్డి రంగంలోకి దిగారని అంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేస్తూ స్థానిక ఎన్నికల్లో తన సత్తా చూపించేందుకు డాక్టర్ వైఎస్ సునీత తహతహలాడుతున్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మద్దతు ప్రకటించిన సునీత ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయంలో కూటమి వైపు చూస్తున్నారని అంటున్నారు. తన తండ్రి వివేకా హత్య కేసు విషయంలో తగిన సహకారం అందలేదనే అసంతృప్తితో ఉన్న సునీత కడప జిల్లాలో వివేకా అభిమానులను అందరిని సంఘటితం చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కూటమి తరఫున తమ కుటుంబానికి జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో సునీత సడన్ గా ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తమ కుటుంబానికి జడ్పీ చైర్మన్ పదవి ఇస్తే కూటమి తరఫున ప్రచారం చేయడానికి కూడా సిద్దమని సునీత చెప్పడంపై అధికార పార్టీ నేతలు కూడా కంగుతింటున్నారని అంటున్నారు. మాజీ జగన్ రెడ్డిపై కోపం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్న సునీత స్థానిక ఎన్నికల్లో తమ అవకాశాలను తన్నుకుపోయేలా ఉన్నారని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో సునీత కనుక కూటమి తరఫున ప్రచారం చేస్తే తమకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందని వైసీపీ నాయకులు టెన్షన్ పడుతున్నారని చెబుతున్నారు.
అయితే కడప జడ్పీ సీటు ఆశిస్తున్న సునీత నేరుగా పోటీ చేస్తారా? లేక కుటుంబంలో వేరొకరికి పోటీకి పెడతారా? అనే విషయంపై క్లారిటీ లేదని అంటున్నారు. ప్రధానంగా తన సమీప బంధువు ప్రదీప్ రెడ్డిని పులివెందుల జడ్పీటీసీగా పోటీకి నిలిపి కడప జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కూటమి తరపున గెలిపించాలని సునీత ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రదీప్ రెడ్డి కాకుండా సునీతరెడ్డి పోటీ చేస్తే ఆలోచిస్తామని కూటమి నేతలు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే తండ్రి హత్య కేసుపై న్యాయపోరాటం చేస్తున్న సునీతరెడ్డి ఆ విషయంలో తన పంతం నెగ్గేవరకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, కడప లోకల్ ఫైట్ కు వైఎస్ సునీత రెడీ అవుతున్నారని జరుగుతున్న ప్రచారంపై వైసీపీలో హాట్ టాపిక్ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత జిల్లాలో గత స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచి పూర్వవైభవం సంపాదించుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే సునీత, షర్మిల వంటివారు వల్ల ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇదే భయం వైసీపీ నేతలనూ వెంటాడుతోందని అంటున్నారు. ప్రధానంగా పులివెందుల మండలం, మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు, కడప, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికలు వైఎస్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రచారం చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
