Begin typing your search above and press return to search.

యలహంక ప్రాపర్టీ వంద శాతం నాదే.. షర్మిల ట్వీట్, అన్న జగన్ రెడ్డికి కౌంటర్

తన కుమార్తె వివాహంపై సోదరుడు వైఖరి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల.. ఎస్స్ లో చేసిన ట్వీట్ లో అనేక అంశాలను ప్రస్తావించారు.

By:  Tupaki Political Desk   |   31 Oct 2026 11:41 AM IST
యలహంక ప్రాపర్టీ వంద శాతం నాదే.. షర్మిల ట్వీట్, అన్న జగన్ రెడ్డికి కౌంటర్
X

బెంగుళూరులోని యలహంక ప్రాపర్టీ వంద శాతం వాటాగా వచ్చినట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అప్పటివరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ఇల్లు ఆస్తుల పంపకాల్లో నాకు, నా పిల్లలకు వచ్చిందని చెబుతూ షర్మిల ఎక్స్ లో పోస్టు పెట్టారు. యలహంక నివాసంలో షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం చేయాలని నిర్ణయించగా, ఆమె సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సెక్యూరిటీ కారణాలు చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య ఆస్తుల వివాదం హాట్ టాపిక్ గా మారింది. యలహంకలో అంజలిరెడ్డి వివాహానికి జగన్ అడ్డు చెబుతున్నారని వార్తలు వచ్చిన నుంచి పెద్ద రాజకీయ దుమారమే నడుస్తోంది. దీనిపై ఇంతవరకు బహిరంగంగా మాట్లాడని షర్మిల ఎక్స్ ద్వారా తొలిసారిగా స్పందించారు.

అంత నీచత్వం లేదు

తన కుమార్తె వివాహంపై సోదరుడు వైఖరి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల.. ట్విట్టర్ లో చేసిన ట్వీట్ లో అనేక అంశాలను ప్రస్తావించారు. "నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.’’ అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి సాక్షిగా నిజం చెబుతున్నా యలహంక ప్యాలెస్ తనదేనని షర్మిల స్పష్టం చేశారు. నాన్న వైఎస్సార్ స్వయంగా తిరిగిన ఇల్లు కావడమే కాకుండా, తాను పెరిగిన ఇల్లే తన పెళ్లి వేదిక కావాలని కుమార్తె అంజలి రెడ్డి ఆశించినట్లు షర్మిల పేర్కొన్నారు. "మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నా" అంటూ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వివాదాల్లేకుండా పెళ్లి జరిపించడమే మా బాధ్యత

వివాహ వేదిక వివాదంపై స్పందించిన ప్రతి ఒక్కరికీ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. "నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం" అని తెలిపారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వేదిక మార్పు తప్పలేదని సూచిస్తూ, కాబోయే నవ దంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వైఎస్ షర్మిల మనసారా ఆకాంక్షించారు.

కాగా, షర్మిల ట్వీట్ అంజలిరెడ్డి వివాహం వేదిక మార్పుపై స్పష్టత వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో బెంగళూరు ఇల్లు తనది అంటూ షర్మిల చెప్పడంతో సోదరుడు జగన్ రెడ్డి వాదనను వ్యతిరేకిస్తున్నట్లు సంకేతాలిచ్చారని అంటున్నారు. బెంగళూరు ఇల్లు తనది అంటూ జగన్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో ఆ ఇల్లు తనది అంటూ షర్మిల కూడా వాదిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం మరింత ముదిరినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ కుటుంబ వివాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొత్తానికి జగన్ రెడ్డి వైఖరి కారణంగా షర్మిల తన కుమార్తె వివాహ వేదికను మార్చుకోవాల్సివచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.