Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు వంద‌రెట్లు న‌యం: ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై ఏపీ కాంగ్రెస్ పార్టీచీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు.

By:  Garuda Media   |   29 Aug 2025 10:42 PM IST
జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు వంద‌రెట్లు న‌యం: ష‌ర్మిల
X

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై ఏపీ కాంగ్రెస్ పార్టీచీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో వైసీపీ అంట‌కాగుతోంద‌ని.. అందుకే ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి విష‌యంలో జ‌గ‌న్‌.. ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప‌లికార‌ని దుయ్య‌బ‌ట్టారు. ``జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు వంద‌రెట్లు న‌యం. ప్ర‌జ‌ల‌కు చెప్పి.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ, జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందు ఒక‌టి చెప్పి.. సింహం- సింగిల్ అని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించి.. తెర‌చాటున అక్ర‌మ పొత్తు పెట్టుకున్నాడు`` అని ష‌ర్మిల విమ‌ర్శించారు. అధికారికంగానే పొత్తు పెట్టుకున్న‌చంద్ర‌బాబు కూట‌మి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇచ్చారంటే అర్థం ఉంద‌న్నారు.

కానీ, బీజేపీని వ్య‌తిరేకిస్తున్నామ‌ని.. సింగిల్‌గానే పోటీ చేస్తామ‌ని చెప్పుకొనే జ‌గ‌న్ మాత్రం.. తెర‌చాటున చేతులు క‌లిపి అక్ర‌మంగా పొత్తు పెట్టుకున్నాడ‌ని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు ముందుకు సాగ‌కుండా చేసే క్ర‌మంలో ఈ అక్ర‌మ పొత్తు జ‌గ‌న్‌కు క‌లిసి వ‌స్తోంద‌ని అన్నారు. అందుకే.. అవినాష్ రెడ్డి, జ‌గ‌న్‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఈగ కూడా వాల‌లేద‌ని, వివేకా కుమార్తె సునీత‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏళ్లు గ‌డిచినా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``ఈ తెర‌చాటు పొత్తులు ఎవ‌రి కోస‌మో జ‌గ‌న్ చెప్పాలి. చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్న‌ది ప్ర‌జ‌ల కోసమేన‌ని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?`` అని ష‌ర్మిల నిల‌దీశారు.

ఇక‌, విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటు ప‌రం కాకుండా చూసేందుకు ఉద్య‌మిస్తామ‌ని, కార్మికుల‌తో క‌లిసి తాము కూడా రోడ్డెక్కు తామ‌ని వైసీపీ చేసిన ప్ర‌క‌ట‌న‌పైనా ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. అస‌లు వైసీపీకి ఆహ‌క్కు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించే ప్ర‌తిపాద‌న వైసీపీ హ‌యాంలోనే వ‌చ్చింద‌న్నారు. ఆ స‌మ‌యంలో కార్మికులు రోడ్డెక్కితే కేసులు పెట్టించార‌ని.. క‌నీసం మూడేళ్ల‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఎందుకు కార్మికుల‌ను క‌ల‌వ‌లేద‌ని, వారికి మ‌ద్ద‌తుగా ఎందుకు మాట్లాడ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు త‌గుదున‌మ్మా అంటూ.. కార్మికుల‌కు మ‌ద్దతు ప‌లుకుతాన‌ని చెప్ప‌డం ఎవ‌రి కోస‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇదంతా బూట‌క‌మ‌ని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీని కార్మికులు ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని పిలుపునిచ్చారు.

ఇండియా కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి బి. సుద‌ర్శ‌న్ రెడ్డి రాజ్యాంగ విలువ‌లు ఉన్న వ్య‌క్తి అని ష‌ర్మిల తెలిపారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా.. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల‌న్న‌దే త‌మ అభిమ‌త‌మ‌న్నారు. రాజ్యాంగంపై గౌర‌వం ఉన్న ప్ర‌తి పార్టీ, ప్ర‌తి ప్ర‌జాప్ర‌తినిధి ఆయ‌న‌కుఓటు వేయాల‌ని ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీని తాము వేడుకున్న‌ట్టుగా జ‌రుగుతున్న ప్ర‌చారం త‌ప్ప‌ని ష‌ర్మిల అన్నారు. తాము అడిగిన మాట వాస్త‌వ‌మేన‌ని , త‌ట‌స్థ పార్టీల‌ను స‌హ‌జంగానే ఏ పార్టీ అయినా అడుగుతుంద‌ని.. కానీ, బీజేపీతో తెర‌చాటు చేతులు క‌లిపిన వైసీపీని తాము అడ‌గ‌లేద‌ని చెప్పారు.