షర్మిల రాయలసీమ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయబోతోందా ?
వైఎస్సార్ తనయ వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల. తండ్రి అన్న మాదిరిగానే ఆమె కూడా రాయలసీమ రక్తం.
By: Satya P | 30 Dec 2025 9:15 AM ISTవైఎస్సార్ తనయ వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల. తండ్రి అన్న మాదిరిగానే ఆమె కూడా రాయలసీమ రక్తం. పంతాన్ని పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న వారుగా ఉంటారు. ఆమె పట్టుదలకు ప్రతి రూపం అంటారు, ఓటమిని అంగీకరించని నైజం కూడా ఆమె సొంతం. ఆమె మదిలో రాజకీయాల్లో రాణించాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. అయితే అది తొలి మలి ప్రయత్నాలలో ఏ మాత్రం ఫలించలేదు. తన అన్న వైఎస్ జగన్ సీఎం అయ్యాక వైసీపీలో తనకు సముచిత ప్రాధాన్యత దక్కుతుందని ఆమె భావించారు అంటారు అది జరగకపోవడంతో ఆమె 2021లోనే వైసీపీని వీడి బయటకు వచ్చారు. ఆ తరువాత ఆమె 2022లో తెలంగాణాలో వైఎస్సార్ టీపీ అని ఒక కొత్త పార్టీని స్థాపించారు. కాళ్ళు అరిగేలా జనంలో తిరిగారు. భారీ పాదయాత్ర చేశారు. అయితే ఆమె తాను తెలంగాణా కోడలుని అని ఎంత చెప్పినా సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న గడ్డ కావడంతో ఆమె ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదని అంటారు.
కట్ చేస్తే కాంగ్రెస్ :
ఇక తమ సొంత పార్టీ ఆశలను ఆమె వదులుకుని కాంగ్రెస్ లో ఆ పార్టీని 2023 డిసెంబర్ లో విలీనం చేశారు. ఆ తరువాత 2024 జనవరిలో పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. ఆమె పీసీసీ సారధిగా తనకూ కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ పొలిటికల్ గ్రాఫ్ వస్తుందని ఆశించి ఆ పార్టీ జెండాను ఎత్తుకున్నారు పైగా వైఎస్సార్ బ్లడ్ కాబట్టి కచ్చితంగా క్లిక్ అవుతుందని కూడా ఊహించారు. కానీ తన అన్న జగన్ ని మాజీ సీఎం గా చేయడంతో ఎంతో కొంత తన వంతు పాత్ర పోషించ గలిగారు తప్పించి తాను మాత్రం అనుకున్న విధంగా రాణించలేకపోయారు. ఇక రెండేళ్ళ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రస్థానంలో ఆమె సాధించినది కూడా ఏమీ లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో ఎత్తిగిల్లింది కూడా లేదు అని చెబుతున్నారు. దాంతో ఆ పార్టీలో ఎన్నాళ్ళు ఉన్న జరిగేది ఒరిగేది ఏమీ లేదని ఆమె ఒక డెసిషన్ కి వచ్చారని ప్రచారం అయితే ఉంది.
కొత్త ప్రయోగంతో :
ఇక రాయలసీమలో బలమైన సామాజిక వర్గంగా రెడ్లు ఉన్నారు. గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే ఆరు జిల్లాలలో వారి ప్రభావం విశేషంగా ఉంటుంది. కడప కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరులలో రెడ్ల రాజకీయంతోనే కధ అంతా సాగుతుంది. దాంతో తెలంగాణా రాష్ట్ర సమితి మాదిరిగా రాయలసీమ రాష్ట్ర సమితిని కనుక స్థాపిస్తే కచ్చితంగా ఈ ఆరు జిల్లాలలో ప్రభావం చూపించవచ్చు అన్నది ఆమె ఆలోచనగా ఉంది అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక వైసీపీకి కూడా గ్రేటర్ రాయలసీమ హార్డ్ కోర్ రీజియన్ గా ఉంది అని అంటున్నారు మరి జగన్ కి పట్టున్న ఈ ప్రాంతాంలో షర్మిల కనుక కొత్త పార్టీ అంటూ ముందుకు వస్తే మొదటి దెబ్బ పడేది అన్నకే అని అంటున్నారు.
వైసీపీకి భారీ షాక్ :
వైసీపీకి 2024 లో ఓటమి సంభవిస్తే అది కూటమి వల్ల కావచ్చు కానీ భారీ ఓటమి అంటే కనీసం 18 అసెంబ్లీ సీట్లు కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకే పరిమితం అవడం వెనక షర్మిల ప్రభావం రాయలసీమలో బలంగా పనిచేయబట్టే అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. లేకపోతే కడప వంటి కంచుకోటలో పది సీట్లులో టీడీపీ కూటమికి ఆరు దక్కి వైసీపీకి నాలుగు సీట్లు రావడం అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఎదురు నిలిచి వైసీపీ మీద గురి పెట్టడమే కారణం అని అంతా అనుకున్నారు. ఇపుడు కూడా చూస్తే షర్మిల సొంత పార్టీతో కనుక రంగ ప్రవేశం చేస్తే అది కచ్చితంగా వైసీపీకే భారీ షాక్ ఇస్తుందని అంటున్నారు. ఒక విధంగా వైసీపీ ఓట్లు చీలి మరోసారి కూటమికే విజయావకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు. మరి షర్మిల రాయలసీమ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ పెడతారా నిజంగా అది గాసిప్ నా అన్నది తెలియాలి అంటే కొన్నాళ్ళ పాటు వేచి చూడాల్సిందే అని అంటున్నారు. సో ప్రస్తుతం ఈ గాసిప్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.
