Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలక ప్రతిపాదన.. రాహుల్ గ్రీన్ సిగ్నల్.. ఇక రచ్చేనా?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆ పార్టీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు.

By:  Tupaki Political Desk   |   28 Jan 2026 6:50 PM IST
కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలక ప్రతిపాదన.. రాహుల్ గ్రీన్ సిగ్నల్.. ఇక రచ్చేనా?
X

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆ పార్టీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన షర్మిల మంగళవారం ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై చర్చించడంతోపాటు రాహుల్ తో ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. అయితే ఈ ఉద్యమాన్ని ఏపీ నుంచే ప్రారంభించాలని షర్మిల ప్రతిపాదించారు. దీనికి రాహుల్ కూడా అంగీకరించడంతో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.

షర్మిల ప్రతిపాదనను రాహుల్ ఓకే చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికలకు ముందు ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె ఎక్కువగా విపక్షాన్నే టార్గెట్ చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్ష నేత జగన్ సైతం తన సోదరి షర్మిల తనపై ఎక్కువగా విమర్శలు చేయడాన్ని ఎత్తిచూపుతున్నారు. తాము అధికారంలో లేకపోయినా, షర్మిల తమనే నిందిస్తున్నారని జగన్, ఆయన పార్టీ నేతలు పలు సందర్బాల్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శలపై పెద్దగా స్పందించని షర్మిల కొన్నాళ్లుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం ఆమె విదేశీ పర్యటనే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

కారణం ఏదైనా కొన్ని రోజులుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మందగించాయని చెబుతున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు నిస్తేజంగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల విరామం తర్వాత పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ లో కాస్త ఊపు కనిపించింది. మిత్రపక్షాలైన కమ్యూనిస్టులను కలుపుకుని పలు కార్యక్రమాల్లో షర్మిల దూకుడుగా వ్యవహరించి పొలిటికల్ గా అందరినీ ఆకర్షించారు.

ఇదే ఊపులో ఆమె అధికార పక్షంపై కాస్త రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు కొంత ఇబ్బందికరంగా మారాయి. అయితే అమెరికా పర్యటనకు ముందు ఈ విమర్శలు ఎక్కువగా వినిపించగా, షర్మిల విదేశీ పర్యటన ముగించుకుని వస్తూనే ఆ విమర్శలకు చెక్ చెప్పేలా అడుగులు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామీణులకు ఎంతో మేలు చేసే ఉపాధి హామీ పథకం పేరు మార్పుతోపాటు ఆ పథకం ఉనికే ప్రమాదంలో పడేలా కేంద్రం కొత్త చట్టాన్ని చేసిందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జాతీయ స్థాయిలో ఉద్యమానికి పిలుపునిచ్చింది.

సరిగ్గా పార్టీ పిలుపును క్యాష్ చేసుకోవాలని భావించిన షర్మిల ఉపాధి హామీపై ఉద్యమాన్ని ఏపీ నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 20 ఏళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఏపీలో అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఉపాధి పథకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు పేదలకు వరంలా పనిచేసిన పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నీరుగారుస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై రెండు కూటముల మధ్య కొన్నాళ్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ పిలుపునివ్వగా, విపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త యాత్రకు సిద్ధమని ప్రకటించారు. అయితే షర్మిల చాకచక్యంగా రాహుల్ ను ఏపీ నుంచి యాత్రకు ఆహ్వానించడం దేశవ్యాప్తంగా ఆకర్షించింది.

ఇది ఒక విధంగా ఏపీలోని ప్రతిపక్షం వైసీపీపై పైచేయి సాధించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షంగా ఇంతవరకు కేంద్ర పథకంపై వైసీపీ ఏం మాట్లాడలేదని అంటున్నారు. రాహుల్ రాష్ట్రం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల సానుకూల వైఖరి పెంచే చర్యగా మారుతుందని అంటున్నారు. మొత్తానికి షర్మిల వ్యూహాత్మకంగా పావులు కదిపి రాహుల్ ను రాష్ట్రానికి రప్పించడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు.