నోటికి కాదు.. చేతికి పనిచెప్పు షర్మిలమ్మా.. !
కానీ, షర్మిల హయాంకు వచ్చే సరికి మాత్రం గాంధీ భవన్ వెలవెల బోతోంది. సీనియర్‌నాయకులు, మాజీ మంత్రులు కూడా ఎవరూ గాంధీభవన్ వైపు కన్నెత్తి చూడడం లేదు.
By: Garuda Media | 7 Dec 2025 6:00 PM ISTనోటికి పనిచెప్పడం తేలిక పని.. అయితే.. దీని వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. పైగా రాజకీయాల్లో అసలే ఉండదు. ఈ విషయం తెలిసో.. తెలియకో.. గత వైసీపీ హయాంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రజల్లోకి రాకుండా.. బటన్ నొక్కుతూ.. బటన్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. పైగా ఇంటికే పరిమితమై.. మరింత చెడ్డపేరు మోసుకున్నారు. దీంతో పార్టీ పరాజయం పాలైంది. ఇప్పుడు పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. గతం తాలూకు మచ్చలు-మరకలు వదిలి పెట్టడం లేదు.
ఇక, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వై.ఎస్. షర్మిల కూడా..నోటికే పని చెబుతున్నారు తప్ప.. చేతికి పనిచెప్పడం లేదన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమెను కీలక నేతలు ఎవరూ పెద్దగా లెక్క చేయడం లేద న్న వాదన కూడా ఉంది. నిజానికి విజయవాడలోని గాంధీభవన్(కాంగ్రెస్ పార్టీ కార్యాలయం).. ఒకప్పుడు కళకళలాడుతూ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత.. పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన రఘువీరా రెడ్డి, సాకే శైలజానాథ్ హయాంలోనూ గాంధీ భవన్‌లో సమావేశాలు.. సదస్సులు నిర్వహించారు.
కానీ, షర్మిల హయాంకు వచ్చే సరికి మాత్రం గాంధీ భవన్ వెలవెల బోతోంది. సీనియర్‌నాయకులు, మాజీ మంత్రులు కూడా ఎవరూ గాంధీభవన్ వైపు కన్నెత్తి చూడడం లేదు. షర్మిల వచ్చినప్పుడు ఓ రెండు గంటల హడావుడి తప్ప.. ఆ తర్వాత.. మళ్లీ తాళాలు వేసేస్తున్నారు. దీనికి కారణాలు ఏంటనేది అందరికీ తెలిసినా.. సమీక్షించేందుకు సరిదిద్దుకునేందుకు షర్మిల ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఎవరికి వారు మౌనంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు నోరు చేసుకోవడం ద్వారా గుర్తింపు కోసం షర్మిల ప్రయత్ని స్తున్నారు.
ఫలితంగా షర్మిల కు ఇమేజ్ పెరగకపోగా.. మరింతగామైనస్ అవుతున్నారన్న వాదన బలంగా వినిపి స్తోంది. నిజానికి రాజకీయాల్లో ఉన్న వారు.. తప్పకుండా ప్రజల మధ్య ఉండాలి. లేకపోతే.. గుర్తింపు.. ప్రజల్లో చర్చ కూడా ఉండడం కష్టం. ఈ విషయం తెలిసి కూడా షర్మిల ముందుకు రావడం లేదు. నిజానికి ఇప్పుడు బలమైన స్కోప్ ఉంది. పార్టీ పరంగా ఎదిగేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకొనే ఛాన్స్ కూడా ఉంది. కానీ షర్మిల ఆ తరహా ప్రయత్నాలు చేయడం లేదు.
