కవిత కంటే షర్మిల బెటర్
ఇప్పుడు ఆ ఇద్దరి రాజకీయ జీవితం గురించే తెలుగు నాట చర్చ. వారే ఒకరు వైఎస్ షర్మిల అయితే రెండవ వారు కల్వకుంట్ల కవిత.
By: Satya P | 19 Nov 2025 5:00 PM ISTరాజకీయాలో రాణించాలంటే ఫాదర్ అయినా ఉండాలి, లేదా గాడ్ ఫాదర్ అయినా ఉండాలి. అలా కాకుండా బలమైన నీడ నుంచి బయటపడి తనకంటూ సొంత ముద్ర కోసం ప్రయత్నించే వారికి తీరం సదూరం. అయినా అది అలుపెరగని భారం. ఇదంతా ఎందుకంటే ఆ ఇద్దరు మహిళా నాయకురాళ్ళు తెలుగు నాట రెండు అతి పెద్ద రాజకీయ కుటుంబాలకు చెందిన ఆడపడుచులు గురించే. ఈ ఇద్దరూ రాజకీయ ప్రవేశం కూడా కేరాఫ్ ఫాదర్ గానే సాగింది. అయితే ఇపుడు ఈ ఇద్దరూ ఆ నీడను వీడి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి రాజకీయ జీవితం గురించే తెలుగు నాట చర్చ. వారే ఒకరు వైఎస్ షర్మిల అయితే రెండవ వారు కల్వకుంట్ల కవిత.
కూతుళ్ల రాజకీయం :
తెలుగు నాట చూస్తే షర్మిల కవిత కనిపిస్తారు, దేశంలో చూస్తే బీహార్ లో లాలూ కూతురు ఉన్నారు. ఇలా చాలా మంది ఆడబిడ్డలు రాజకీయంగా తపన పడుతున్నారు. అయితే ప్రాబ్లం ఏంటి అంటే వీరంతా ఒక రకమైన భ్రమలలో ఉన్నారని అంటున్నారు. కొడుకుల కంటే తాము ఎంతో పవర్ ఫుల్ అని కూడా వీరు భావిస్తూ ఉంటారు. తామే రాజకీయంగా విరగదీస్తామని నమ్మకం కూడా పెట్టుకుంటున్నారు.
అన్నల ఓటమి వెనక :
ఇక ఏపీలో జగన్ కి భారీ ఓటమి ప్రాప్తించడానీకి, తెలంగాణాలో బీఆర్ ఎస్ ఓటమికే చెల్లెల్ళు పనికి వస్తున్నారు తప్ప వాళ్ళకు సొంతంగా అంత సీన్ అయితే లేదని రాజకీయ విశ్లేషకుల భావన. ఇక చూసుకుంటే తెలుగునాట షర్మిల కానీ కవిత కానీ అన్నల మీదనే కోపంతో తాము ఉన్న చోటు నుంచి దూరం జరిగారు. తామే గ్రేట్ అన్న భావనలో సొంత రాజకీయం కొత్త పార్టీ అంటూ దూకుడు చేస్తున్నారు.
వైఎస్సార్ బతికి ఉన్నపుడు :
ఇక తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే కవిత షర్మిల ఈ ఇద్దరు చెల్లెమ్మల మధ్యన కూడా పోలికలు తేడాలు చూస్తున్నారు విశ్లేషకులు. ఈ నేపధ్యంలో కవిత కంటే షర్మిల చాలా బెటర్ అన్న మాట కూడా వినిపిస్తోంది. ఎందుకు అంటే వైఎస్సార్ బతికి ఉన్నపుడు కుటుంబంలో పెద్దగా విభేదాలు లేవు. వైఎస్సార్ బాగా విలువ ఇచ్చారు. జగన్ సైతం బాగా షర్మిలను చూసుకున్నారు అని చెబుతారు. ఇక వైఎస్సార్ మరణించిన తరువాత అన్నా చెల్లెళ్ళ మధ్య డబ్బుల పంచాయతీ వచ్చి తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారు, మళ్ళీ ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ గా పదవి అందుకుని తన సొంత రాజకీయం స్టార్ట్ చేశారు. అయితే వైఎస్సార్ జీవించి ఉన్నపుడు మాత్రం ఎలాంటి విభేదాలు అయితే ఆ కుటుంబంలో లేవనే గుర్తు చేస్తున్నారు.
కవిత కేసుల వల్ల :
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత లిక్కర్ కేసు లో ఇరుక్కున్నది కాబట్టి బీఆర్ఎస్ వీక్ అయింది అనేది రాజకీయ విశ్లేషకుల భావన. బీజేపీకి తలవొగ్గి కొంచెం స్లో అయింది బీఆర్ఎస్ అన్న మాట కూడా ఉంది. ఇక ఏపీలో షర్మిల రాజకీయం చూస్తే అసలు పూర్తిగా చచ్చిన కాంగ్రెస్ ని ఆమె బతికించలేకపోయింది. అలాగే కవిత పార్టీ సొంతంగా పెట్టినా కూడా కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆమె ఇస్తున్న ప్రకటనలు అన్నీ సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తాయి, ఎందుకంటే సోషల్ మీడియాకు యూట్యూబ్ కి కంటెంట్ ఎపుడూ కావాలి కాబట్టి అని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్ట్రానికి మీడియా కానీ ఇతర మీడియా వెర్షన్స్ కానీ కంటెంట్ తోనే లాగించేస్తున్నాయి. కాబట్టి అందులో తమ పేరు వచ్చిందని తమకు ఎంతో ఫాలోయింగ్ ఉందని భావిస్తే పొరపాటు అని అంటున్నారు.
ఎంపీగా ఓటమి :
ఇక కవిత సంగతి చూస్తే ఎంతో ఓటు బ్యాంక్ ఫుల్ క్యాడర్ ఉండి కూడా బీఆర్ ఎస్ 2018లో మంచి ఊపులో ఉన్నపుడు నిజామాబాద్ నుంచి సిట్టింగ్ సీటు నుంచి రెండోసారి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు అని గుర్తు చేస్తున్నారు. ఆ దెబ్బకే ఆమె 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా గమ్మున్న కూర్చున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా అదేదో సినిమాలో డైలాగ్ మాదిరిగా కొన్ని రాజకీయ పార్టీలకు బయట శతృవుల కంటే కూడా ఇంట్లో వారే వైరం పెట్టుకుని దెబ్బ తీస్తున్నారు అని అంటున్నారు. కవిత అయినా షర్మిల అయినా మరో పార్టీకి చెందిన వారు అయినా సొంతంగా రాజకీయాల్లో నిలబడాలి అంటే దానికి చేయాల్సిన కృషి వేరేగా ఉంటుంది. పాలిటిక్స్ లో లక్ష్యాలు పెట్టుకుని వెళ్ళాలి. కానీ తమకు ఏదో అన్యాయం జరిగిందని జనంలోకి వచ్చి పార్టీలు పెట్టి వారు సింపతీ చూపిస్తారు అనుకుంటే ఏ మాత్రం వర్కౌట్ కానే కాదు అని అంటున్నారు దానికి తెలుగు నాట తాజా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.
