Begin typing your search above and press return to search.

కొత్తేం లేదు .. వింత అంతకన్నా కాదు‘.. జగన్ రెడ్డిని కలిశారన్న ప్రచారంపై షర్మిల ట్వీట్

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, ఆయన చెల్లెలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ వార్తలపై క్లారిటీ వచ్చింది.

By:  Tupaki Political Desk   |   22 Sept 2026 2:32 PM IST
కొత్తేం లేదు .. వింత అంతకన్నా కాదు‘.. జగన్ రెడ్డిని కలిశారన్న ప్రచారంపై షర్మిల ట్వీట్
X

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, ఆయన చెల్లెలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ విషయమై ఎక్స్ వేదికగా పీసీసీ చీఫ్ షర్మిల పూర్తి వివరణ ఇచ్చారు. ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి, షర్మిల మధ్య ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యాయని, ఇద్దరి మధ్య దెబ్బతిన్న సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ విషయంలో జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ జోక్యం చేసుకుని అన్నాచెల్లెళ్ల మధ్య రాజీ కుదిర్చారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రాజకీయంగా అందరి దృష్టి ఆకర్షించింది.

అయితే అన్నతో సంబంధాలు పునరుద్ధరించుకునే విషయంలో షర్మిల పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఆమె తాజా ట్వీట్ ద్వారా అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై షర్మిల ఘాటుగా స్పందించారు. ఆమె ట్వీట్ లో వాడిన పదాలు చూస్తేనే ఆమె ఈ విషయంలో ఎంత కోపంగా ఉన్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ రెడ్డిని కలిసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. పూర్తిగా నిరాధార, పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గిట్టని వాళ్ళవి పస లేని ఆరోపణలు అంటూ స్పష్టం చేశారు.

వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని నేను చివరిసారిగా కలిసింది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే అన్న విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కలిసినా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. తన బిడ్డ పెళ్లికి రావాలని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కొత్తేం లేదు .. వింత అంతకన్నా కాదు అంటూ షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేయాల్సిన ఖర్మ వైఎస్ఆర్ బిడ్డకు లేదని స్పష్టం చేశారు.

శుభకార్యానికి, రాజకీయానికి లింకులు పెట్టి తన విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. షర్మిల ట్వీట్ తో జగన్ తో భేటీపై కొన్నిరోజులుగా షికారు చేస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లు అయిందని అంటున్నారు. అంతేకాకుండా షర్మిల ఆగ్రహం, ఆవేదన చూస్తుంటే ఆమె జగన్ తో రాజీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడం కూడా చర్చకు దారితీస్తోంది. రాజకీయాల్లో ఉన్నవారిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చేయడం సహజమే అయినప్పటికీ, తాను జగన్ తో కలవడం అంటే రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రగా ఆమె చూస్తుండటమే హాట్ టాపిక్ అవుతోందని అంటున్నారు.