వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వరుడు ఎవరో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఇంట త్వరలో పెళ్లి సందడి నెలకొననుంది.
By: A.N.Kumar | 6 Sept 2026 4:17 PM ISTఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఇంట త్వరలో పెళ్లి సందడి నెలకొననుంది. ఆమె కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ కుమార్తె వివాహం నిశ్చయమైన శుభవార్తను కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
షర్మిల కుమార్తె అంజలి రెడ్డి.. సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి దంపతుల కుమారుడు డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. రఘురామ్ రెడ్డి కుటుంబానిది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా స్వస్థలం కాగా.. ప్రస్తుతం వారు అమెరికాలో స్థిరపడ్డారు. కుటుంబ సభ్యులంతా అమెరికా పౌరులేనని షర్మిల తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
కాబోయే అల్లుడు డాక్టర్ రఘురామ్ రెడ్డి
డాక్టర్ రఘురామ్ రెడ్డి అమెరికాలో వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో మెడిసిన్ చదివినట్లు సమాచారం. ప్రస్తుతం టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నారు. అంజలి రెడ్డి కూడా అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె బీబీఏ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఫైనాన్స్ రంగంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
షర్మిల భావోద్వేగ పోస్ట్
కుమార్తె వివాహం నిశ్చయమైన సందర్భంగా షర్మిల ఆనందం వ్యక్తం చేశారు. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. అంజలి రెడ్డి, డాక్టర్ రఘురామ్ రెడ్డి వివాహం నిశ్చయమైన విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ శుభ సందర్భంలో తమ కుటుంబానికి స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలు, ఆశీస్సులు అందించాలని ఆమె కోరారు.
అయితే అంజలి రెడ్డి–రఘురామ్ రెడ్డి వివాహం ఎప్పుడు, ఎక్కడ జరగనుంది అనే వివరాలను మాత్రం షర్మిల వెల్లడించలేదు. త్వరలోనే వివాహ తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. షర్మిల తన కుమార్తెతో పాటు కాబోయే అల్లుడు రఘురామ్ రెడ్డి ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇప్పటికే కుమారుడు రాజారెడ్డి వివాహం
వైఎస్ షర్మిలకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం 2024 ఫిబ్రవరిలో అట్లూరి ప్రియతో జరిగింది. రాజారెడ్డి–ప్రియ వివాహ వేడుక రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహానికి ముందు షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని స్వయంగా కలిసి వివాహానికి ఆహ్వానించారు. జగన్ నిశ్చితార్థ వేడుకకు హాజరైనప్పటికీ జోధ్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరు కాలేదు.
ఇప్పుడు షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం కూడా నిశ్చయమవడంతో వైఎస్ కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలుకానుంది. అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల్లో స్థిరపడిన అంజలి రెడ్డి, డాక్టర్ రఘురామ్ రెడ్డి త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. దీంతో ఈ వివాహ వేడుక ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే అంశంపై వైఎస్ కుటుంబ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ పెళ్లికి అయినా వైఎస్ జగన్ వస్తారో రారో వేచిచూడాలి.
