వైసీపీది దోచుకునే పాలన...వైసీపీలో వైఎస్సార్ లేరు
వైసీపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ తన తండ్రి మాజీ సీఎం వైఎస్సార్ పాలనను ఆకాశానికి ఎత్తేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
By: Satya P | 24 Feb 2026 10:37 PM ISTవైసీపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ తన తండ్రి మాజీ సీఎం వైఎస్సార్ పాలనను ఆకాశానికి ఎత్తేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి పనులు చేశారు అని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్ ది ప్రజారంజక పాలన అన్నారు. వైసీపీలో వైఎస్సార్ లేరు అని ఆమె తన సోదరుడు పార్టీ మీద హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు వైఎస్సార్ ది మంచి పాలన అయితే వైసీపీది దోచుకునే పాలన అని ఆమె విడమరచి విషయం చెప్పేశారు.
అత్త మీద కోపంతో :
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నారు అని ఆమె టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తన అయిదేళ్ల పాలనలో ఎన్నో తప్పులు చేస్తే దానిని తీసుకుని వచ్చి వైఎస్సార్ కి ఆపాదించడం సబబేనా అని ఆమె కూటమి ప్రభుత్వం పెద్దలను ప్రశ్నించారు. అసలు ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్ ప్రస్తావన ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. వెంటనే అసెంబ్లీ రికార్డుల నుంచి వైఎస్సార్ మీద సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.
జీవో ఇచ్చిందే వైఎస్సార్ :
తిరుమల తిరుపతి విషయంలో వైఎస్సార్ ఎంతో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని షర్మిల అన్నారు. ఏడు కొండలు వెంకన్నవే అని జీవో ఇచ్చింది వైఎస్సారే అని ఆమె స్పష్టం చేశారు. అలాంటి వైఎస్సార్ మీద ఏడు కొండలను రెండు కొండలు చేయాలని చూశారు అని చంద్రబాబు విమర్శలు చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ విషయంలో జరిగినది అంతా తప్పుడు ప్రచారం అని ఆమె అన్నారు. ఆనాడు కూడా విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారని ఆయన బురద జల్లారు అని ఆమె ఫైర్ అయ్యారు. వాస్తవానికి చూస్తే ఏడు కొండలు మొత్తం వెంకన్నవే అని 2007లో ప్రభుత్వం తరఫున ఒక శాశ్వత జీవోను తెచ్చింది వైఎస్సార్ అని అలా ఆయన చరిత్ర సృష్టించారు అని ఆమె అన్నారు.
అన్యమత ప్రచారాన్ని సైతం :
అంతే కాకుండా తిరుమలలో అన్య మత ప్రచారాన్ని అడ్డుకోవడానికి జీవో 746, 747లను తీసుకొచ్చి కఠిన నిబంధనలు అమలు చేసిన ఘనత కూడా వైఎస్సార్ దే అని ఆమె అన్నారు. మరో కొత్త విషయం కూడా ఆమె చెప్పారు. తిరుమల లడ్డూకు అంతర్జాతీయంగా పేటెంట్ హక్కులు సాధించింది కూడా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ నే అని షర్మిల స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి :
వైసీపీకి వైఎస్సార్ కి అసలు ఏ మాత్రం సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చారు వైసీపీ పాలన అంతా దోచుకుని తినడం గా సాగింది అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ మనిషిగా చివరి దాకా జీవించారు అని అన్నారు. అలాంటి వైఎస్సర్ ని చంద్రబాబు దూషించడం తగదని షర్మిల అన్నారు. వేద పండితుల కోసం ఆయుష్మాన్ భవ కార్యక్రమం. అలాగే దళితుల కోసం దళిత గోవిందం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్సార్ నిజంగా తిరుపతి విషయంలో ఎంతో పవిత్రంగా వ్యవహరించారు అని షర్మిల అన్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీది దోచుకుని తినే పాలనగా చెబుతూ ఆమె జగన్ మీద మరోసారి ఫైర్ అయ్యారు.
