షర్మిల అంతే.. కాంగ్రెస్ ఇంతే.. !
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల పుంజుకున్నారా? ఆమె గ్రాఫ్ పెరిగిందా? అంటే.. లేదన్న సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 23 March 2026 5:00 AM ISTకాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల పుంజుకున్నారా? ఆమె గ్రాఫ్ పెరిగిందా? అంటే.. లేదన్న సమాధానమే వినిపిస్తోంది. పోనీ.. పార్టీ పరంగా ఏమైనా గ్రాఫ్ పెరిగిందా? అంటే.. అది కూడా లేదు. గత 2024 పిబ్రవరిలో పార్టీ బాధ్యతలు చేపట్టిన షర్మిల ఇప్పటి వరకు ఏమేరకు పుంజుకున్నారన్నది చూస్తే..గత ఎన్నికల సమయంలో ఆమె కొంత మేరకు ప్రచారంలోకి వచ్చారు. కానీ.. దానిని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయారు. ఫలితంగా అటు పార్టీపరంగానే.. కాకుండా రాజకీయంగా కూడా షర్మిల గ్రాఫ్ పెరగలేదు.
ఆ నమ్మకం రాకనే..!
ఏ పార్టీ అయినా.. పుంజుకోవాలంటే.. ప్రజల్లోనూ.. కార్యకర్తలు, నాయకుల్లోనూ నమ్మకం కలిగించాలి. అధికారంలోకి వస్తామని.. లేదా.. కనీసం దాని అంచుల వరకైనా వస్తామని పార్టీల పరంగా నమ్మకం కలిగించాలి. ఇది కలిగించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. గతంలో కమ్యూనిస్టులు కూడా ఈ విషయంలోనే పూర్తిగా చేతులు ఎత్తేసి.. మొత్తంగా చేతులు కాల్చుకున్న పరిస్థితిని తెచ్చుకున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాదా.. అనేది పక్కన పెడితే.. వచ్చేస్తామన్న ప్రకటనే నాయకులు, కార్యకర్తలకు బూస్ట్‌గా పనిచేస్తుంది.
ఈ తరహా విశ్వాసం కల్పించడంలో షర్మిల పూర్తిగా విఫలమయ్యారు. దీంతో కొత్తగా నాయకులు పుట్టుకు రావడం ఎలా ఉన్నా.. ఉన్న నాయకులు కూడా పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. ఎన్నో విషయాలు చెప్పుకొస్తున్న షర్మిల.. పార్టీలో విశ్వాసాన్ని పెంపొందించే విషయంలో పూర్తిగా చతికిల పడుతున్నారు. అంతేకాదు.. నాయకుల్లో విశ్వాసాన్ని కూడా ఆమె పెంచలేక పోతున్నారు. దీంతో గత ఏడాది కాలంగా పార్టీ గ్రాఫ్ మరింత దిగజారిపోయిందన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం.
నెక్ట్స్ ఏంటి.. ?
ఈ పరిస్థితులతో తదుపరి లక్ష్యం ఏంటి? షర్మిల ఎలా ముందుకు సాగుతారన్నది సహజం గానే చర్చకు వచ్చే విషయం. కానీ.. ఎక్కడా ఆమేరకు చర్యలు కానీ.. ఆలోచన కానీ లేవు. నిజానికి షర్మిల యాత్రలకు.. పర్యటనలకు మునుపు ఉన్న హవా కూడా కనిపించడం లేదు. నాయకులు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల అరకులో పర్యటించినప్పుడు సొంత ఖర్చుపై వెళ్లాల్సి వచ్చిందని తెలిసింది. అక్కడ భోజనం, అల్పాహార ఖర్చు కూడా ఆమె పెట్టుకున్నారని నాయకులు చెప్పడం గమనార్హం. మరీ ఇంత దీనస్థితిలో కాంగ్రెస్ ఉందా? అనేది చర్చ.
