షర్మిల మిక్స్ డ్ పాలిటిక్స్.. టార్గెట్ వైసీపీ.. !
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన వ్యూహాలను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
By: Garuda Media | 15 May 2026 1:00 PM ISTకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన వ్యూహాలను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. వైసిపి అధినేత తన సోదరుడు జగన్ వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ప్రకటించిన దరిమిలా ఆమె బస్సు యాత్రకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి. ఇది వాస్తవమేనని పార్టీలోని సీనియర్ నాయకులు కూడా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయడం ద్వారా వైసిపి వ్యూహాలను అడ్డుకొని తన రాజకీయ వ్యూహాలను అమలు చేయాలన్నది షర్మిల ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నది లక్ష్యం ఉంది.
అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని గమనించిన తరువాత ఈ వ్యూహంలో కొంత మార్పు చేసే దిశగా షర్మిల ఆలోచన చేస్తున్నట్టు సీనియర్ నాయకులు చెబుతున్నారు. ప్రాంతాలవారీగా తన యాత్రను చేపట్టాలన్నది షర్మిల వ్యూహంగా కనిపిస్తోంది. దీనిలో భాగంగా వైసీపీకి బలంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర చేయాలని.. ఇతర జిల్లాల్లో అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టినా ఇబ్బంది ఉండదని షర్మిల భావిస్తున్నారు.
గత ఎన్నికల సమయంలోనే రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసు తోపాటు జగన్ తన కుటుంబానికి తనకు చేసిన అన్యాయాన్ని ఆమె ప్రజల మధ్యగా తీసుకువెళ్లారు. అయితే అప్పట్లో సమయం సరిపోలేదు కాబట్టి ఈ దఫా పాదయాత్ర చేయడం ద్వారా ఈ అంశాలను ప్రస్తావించడంతో పాటు మరింతగా ప్రజలను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాయలసీమలో పాదయాత్ర చేయాలని ఇతర ప్రాంతాల్లో బస్సు యాత్రకు సన్నద్ధం కావాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
త ద్వారా బలమైన వైసీపీ ఓటు బ్యాంకును తనపై తిప్పుకునే దిశగా ఆమె అడుగులు వేయాలని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమలో వైసీపీకి కొంతమేరకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ బస్సు యాత్ర చేయడం ద్వారా అంత తేలికగా వైసిపి ఓటు బ్యాంకు దక్కించుకునే అవకాశం ఉండదని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వ్యక్తిగతంగా వైసిపిని అన్ని టార్గెట్ చేసుకొని పార్టీ పరంగా దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు.
ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి పశ్చిమగోదావరి సహా కోస్తాంధ్రలో మాత్రం బస్సు యాత్రతో సరి పెట్టాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మీడియాకు ఆఫ్‌ది రికార్డుగా వెల్లడించారు. దీనిని బట్టి వైసీపీ చేస్తున్న వ్యూహాలకు షర్మిల బలమైన ప్రతి వ్యూహాలను వేస్తున్నట్టు తెలుస్తోంది.
