Begin typing your search above and press return to search.

బాబు కంటే ముందే వైఎస్సార్ సీఎం...ఎక్కడ తేడా కొట్టింది ?

ఏపీ రాజకీయాల్లో ఇద్దరు మిత్రులుగా వైఎస్సార్ చంద్రబాబుని పేర్కొనాలి. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు.

By:  Satya P   |   2 Sept 2026 9:03 AM IST
బాబు కంటే ముందే వైఎస్సార్ సీఎం...ఎక్కడ తేడా కొట్టింది ?
X

ఏపీ రాజకీయాల్లో ఇద్దరు మిత్రులుగా వైఎస్సార్ చంద్రబాబుని పేర్కొనాలి. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ ఒకేసారి 1978లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇద్దరూ 1980లో మొదటిసారి మంత్రులు అయ్యారు. అలా ఇద్దరి రాజకీయ జీవితం సమానంగా సాగింది. ఇక 1983లో కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. చంద్రబాబు టీడీపీ బాట పడితే వైఎస్సార్ కాంగ్రెస్ కి కేవలం 35 ఏళ్ల వయసులో పీసీసీ చీఫ్ అయ్యారు. అలా నాలుగేళ్ల పాటు ఆయన కీలక పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత జలగం వెంగళరావు పీసీసీ చీఫ్ అయ్యారు. 1989 ఎన్నికల ముందు సీనియర్ నేత మర్రి చెన్నారెడ్డి పీసీసీ పగ్గాలు అందుకున్నారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో గెలిచింది. అయితే వైఎస్సార్ తొలిసారి కడప నుంచి లోక్ సభకు పోటీ చేసి ఎంపీ అయ్యారు. దాంతో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు.

రాజీవ్ తో సాన్నిహిత్యం :

ఇదిలా ఉంటే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో వైఎస్సార్ కి ఎంతో సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆయనకు పీసీసీ చీఫ్ ఇచ్చారు కూడా. యువతకు పెద్ద పీట వేయాలన్న రాజీవ్ ఆలోచనతోనే వైఎస్సార్ కి చిన్న వయసులో పెద్ద పదవులు దక్కాయి. ఇక రాజీవ్ గాంధీ 1989లో ఓటమి పాలు కావడం కూడా వైఎస్సార్ అధికార పదవుల వైభోగానికి అడ్డుకట్ట వేసినట్లు అయింది. లేకపోతే కేంద్ర మంత్రిగా వైఎస్సార్ ప్రమాణం చేసేవారు అని అంటారు. ఇక 1991లో మధ్యంతర ఎన్నికలు కేంద్రంలో వచ్చాయి. ఆ సమయంలోనే ఎన్నికల ప్రచారం చేస్తూ రాజీవ్ గాంధీ శ్రీ పెరుంబుదూర్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించారు. దాంతో వైఎస్సార్ కి కేంద్ర స్థాయిలో బలమైన బంధం ఒక్కసారిగా తెగినట్లు అయిందని అంటారు.

కచ్చితంగా ముఖ్యమంత్రిగా :

ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక జీవించి ఉంటే మధ్యంతర ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యేవారు అని చెబుతారు. ఆయన ప్రధాని అయితే వైఎస్సార్ కి కూడా ఏపీలో ముఖ్యమంత్రిగా చాన్స్ దక్కేదని కూడా అంటారు. అంటే 1991 లోనే అన్న మాట. ఒక విధంగా చూస్తే రాజకీయాలలో తొలి రోజులలో తన దోస్త్ అయిన చంద్రబాబు కంటే ముందే వైఎస్సార్ సీఎం అయ్యేవారు అని అంటారు. చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇలా వైఎస్సార్ కి రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం రాజకీయంగా తీరని నష్టాన్నే చేసిందన్న విశ్లేషణ అయితే ఆయన అభిమానులలో అనుచర గణంలో ఉంది అని పేర్కొంటారు.

మరోసారి దెబ్బ :

అయితే వైఎస్సార్ పట్టు వదలకుండా తన రాజకీయ లక్ష్యం వైపుగా వడివడిగానే అడుగులు వేస్తూ వచ్చారు. ఆయన 1999 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోని అన్ని వర్గాలను కలుపుకుని పీసీసీ చీఫ్ అయ్యారు. ఆ ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నంతగా అనుకూల వాతావరణం ఏర్పడింది. అయితే సరిగ్గా అదే సమయంలో యునైటెడ్ ఫ్రంట్ లో ఉన్న టీడీపీ ఎన్డీయే వైపు వచ్చింది. అలా టీడీపీ బీజేపీ కలిసి ఉమ్మడి ఏపీలో పోటీ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. దాంతో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం బాబు రెండోసారి సీఎం కావడం జరిగిపోయాయి. కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా అధికారానికి ఆమడ దూరంలో ఉండాల్సి వచ్చింది.

వైఎస్సార్ చరిష్మాతోనే :

ఆ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని పీసీసీ చీఫ్ గా వైఎస్సార్ కూడా ఎంతో విశ్వాసంతో ఉన్నా రాజకీయ సమీకరణలు దెబ్బ కొట్టాయని విశ్లేషణలు ఉన్న్నాయి. ఇలా రెండు సందర్భాలలో సీఎం పీఠం చాన్స్ దూరం అయినా మొక్కవోని దీక్షతో జనంలో ఉంటూ పార్టీని ఏక త్రాటిపైన నడిపిస్తూ 2003 ఏప్రిల్ 9న మండు వేసవి ఎండల్లో వైఎస్సార్ చేసిన పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకుని వచ్చింది. ఆయన 2004 మే లో ఉమ్మడి ఏపీ సీఎం అయ్యారు. మొత్తంగా రెండు టెర్ములూ కలుపుకుని అయిందుంపావు సంవత్సరాలు వైఎస్సార్ పాలించారు. 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలు కావడం తెలుగు రాజకీయ చరిత్రలో ఒక విషాద ఘట్టంగానే అంతా చూస్తారు.