జగన్ వర్సెస్ షర్మిల: వైఎస్ మురిపింపా.. వైఎస్ మరిపింపా..!
తెలుగు రాజకీయ అవనికపై అనేక మంది వారసులు వచ్చారు. ప్రస్తుతం కూడా ఉన్నారు. రావడం వేరు.. వారసత్వంగా తమ తమ తల్లిదండ్రుల లక్షణాలను పుణికి పుచ్చుకోవడం వేరు.
By: Garuda Media | 3 Sept 2025 2:00 AM ISTతెలుగు రాజకీయ అవనికపై అనేక మంది వారసులు వచ్చారు. ప్రస్తుతం కూడా ఉన్నారు. రావడం వేరు.. వారసత్వంగా తమ తమ తల్లిదండ్రుల లక్షణాలను పుణికి పుచ్చుకోవడం వేరు. ఈ విషయంలో వైఎస్ వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన పిల్లలు.. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల.. ఏమరకు.. తండ్రిని మరిపిస్తున్నారు? అంటే.. ప్రశ్నలు తలెత్తక మానవు. ఏమేరకు తండ్రిని మురిపిస్తున్నారంటే.. ఔనన్న సమాధానమే వినిపిస్తుంది. మురిపించడం వేరు.. మరిపించడం వేరు.
వైఎస్ పేరును పది పథకాలకు పెట్టిన జగన్.. వైఎస్ పేరును నిరంతరం స్మరించే షర్మిల.. ఆయనను మురిపిస్తున్నారే.. తప్ప మరపించేస్థాయిలో రాజకీయాలు ఎప్పుడూ చేయలేదన్నది విశ్లేషకులు చెబుతు న్న మాట. వైఎస్ రాజశేఖరెడ్డి మరణించి.. 16 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 16 ఏళ్లలో వైఎస్ స్థాయికి ఈ ఇద్దరు వారసులు చేరుకోలేక పోయారన్నది నిష్టుర సత్యం. కేవలం ఆయన వర్ధంతులు.. జయంతులకు మాత్రమే పరిమితం అయ్యారు. జగన్ హయాంలో ఓ పది పథకాలకు ఆయన పేరు పెట్టుకున్నారు. ఇంతకుమించి.. అసలు వైఎస్ ను మరపించే స్థాయికి చేరలేకపోతున్నారు.
ఏంటీ వైఎస్ లక్షణాలు..
''ఓడామా.. గెలిచామా.. అన్నది కాదు.. అధ్యక్షా.. ప్రజలకు ఎంత మేరకు చేరువ అయ్యామన్నది ముఖ్యం. ప్రజలతో ఎంత మేరకు ఉన్నామన్నది ముఖ్యం`` అంటూ.. అసెంబ్లీలో తొలిసమావేశం సందర్భంగా వైఎస్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ తరహాలో ఆయన ఇద్దరు పిల్లలు ఆలోచన చేయలేక పోతున్న విషయం తెలిసిందే. ప్రజలను పక్కన పెట్టి వ్యక్తిగత అంశాలతో అజెండాలు రూపొందించుకుని ముందుకు సాగు తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. జగన్ తన కేసులు.. తన వారి కేసుల కోసం రాజీ పడుతుంటే.. షర్మిల.. తన ఆస్తులు.. వ్యక్తిగత అంశాలతో రాజీ పడుతున్నారు.
రాజకీయాల్లో వైఎస్‌కు మరో లక్షణం కూడా ఉంది. అది, ఆయన ప్రత్యర్థులను పెంచుకున్నారే తప్ప.. శత్రువులను పెంచుకోలేదు. వైఎస్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మూడుమాసాల్లో చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఓ కీలక కేసులో చిక్కుకున్నారు. ఆ సమయంలో వైఎస్ ప్రత్యర్థిగా .. చంద్రబాబు వియ్యంకుడిపై కక్ష సాధించే అవకాశం ఉంది. కానీ, ఆయన అలా చేయలేదు.
రాజకీయాల్లో మాత్రమే ప్రత్యర్థులు ఉంటారని పేర్కొంటూ.. సదరు కేసు జోలికి కూడా పోలేదు. ఈ తరహా లక్షణం జగన్‌లో మచ్చుకు కూడా కనిపించదు. ఇలా.. తనను తాను ఓ స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆయన వారసులుగా ఉన్న ఇద్దరు పిల్లలు కూడా.. కేవలం మురిపించే రాజకీయాలు చేస్తున్నారే.. తప్ప.. వైఎస్‌ను మరిపించి ఉంటే.. ఇప్పుడు వైఎస్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు వినిపిస్తుంది? అనేది ప్రశ్న.
