Begin typing your search above and press return to search.

సినిమా చూపిస్తా...జగన్ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్ళు ఆగండి, తప్పు చేసిన ప్రతీ ఒక్కరికీ సినిమా చూపిస్తాను అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Satya P   |   23 Sept 2026 7:44 PM IST
సినిమా చూపిస్తా...జగన్ సంచలన వ్యాఖ్యలు
X

రెండేళ్ళు ఆగండి, తప్పు చేసిన ప్రతీ ఒక్కరికీ సినిమా చూపిస్తాను అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటు అని అలా పోలీసులను ఉపయోగించుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని చూస్తారని విమర్శించారు. అయితే ప్రజాస్వామ్యం కాపాడాలని పోలీసులను రిక్వెస్ట్ చేయండి అని పార్టీ నేతలకు సూచించారు. అలా కాదు అని ఎవరైనా భావించి వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే అలాంటి వారి పేర్లను డిజిటల్ బుక్ లో వెంటనే ఎక్కించేయండి అని సూచించారు. 2029 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత డిజిటల్ బుక్ తీసి తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తామని అన్నారు. వ్యవస్థలను వాడి ఇబ్బందులు సృష్టించాలని చూస్తే చట్టం ఎలా పనిచేస్తుందో వైసీపీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతుందని జగన్ హాట్ కామెంట్స్ చేశారు.

కార్యకర్తే నంబర్ వన్ :

ఇక రెండేళ్ళు ఆగితే వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన జోస్యం చెప్పారు. ఈసారి జగన్ 2.0ని అంతా చూస్తారు అని క్యాడర్ కి చెప్పారు. ఇందులో కచ్చితంగా కార్యకర్తలే నంబర్ వన్ అని జగన్ గట్టి భరోసా ఇచ్చారు. కార్యకర్తల ప్రభుత్వంగా రేపటి వైసీపీ ప్రభుత్వం ఉండబోతోంది అని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలే వైసీపీకి ఆస్తి అని ఆయన అంటూ వారి కోసం ప్రతీ నియోజకవర్గం ఇంచార్జి నుంచి తన దాకా అంతా అండగా ఉంటామని అన్నారు. కార్యకర్తలు అయితే ప్రజల వద్దకు వెళ్ళి వైసీపీ చేసిన మంచి పనులు చాటి చెప్పాలని కోరారు.

విశాఖలో నీటికి కటకట :

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విశాఖలో చరిత్రలో మొదటి సారి తాగు నీటికి కటకట ఏర్పడింది అని జగన్ సెటైర్లు పేల్చారు. పోలవరం నీరు అని చెబుతున్నారు కానీ అది ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. పోలవరం ఎత్తుని 45.72 మీటర్లు పెంచి నిర్మిస్తే కనుక కచ్చితంగా మరో 75 టీఎంసీల నీరు అక్కడ స్టోర్‌ చేయవచ్చు అని అన్నారు. అపుడు గ్రావిటీ ద్వారా విశాఖకే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం నీరు ఇవ్వవచ్చు అని చెప్పారు. కానీ చంద్రబాబు పోలవరం ఎత్తు తగ్గించారని జగన్ విమర్శించారు. గ్రావిటీ ద్వారా చక్కగా రావాల్సిన నీరు రాకుండా చేశారని నిందించారు.

ఉత్తరాంధ్ర భూదందా :

ఉత్తరాంధ్రాలో అతి పెద్ద భూ దందా జరుగుతోంది అని ఆయన విమర్శించారు. విశాఖ నడిబొడ్డున 55 ఎకరాల భూమి అది కూడా అయిదు వేల కోట్ల రూపాయలు విలువ చేసే దానిని తోడల్లుడికి ఇచ్చేశారు అని మండిపడ్డారు. రూపాయికి చాక్లెట్ కూడా రాదని అలాంటిది ఎకరం భూమి ఇచ్చేస్తున్నారని కూటమి ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. నీరు తాగేందుకు ఇవ్వలేకపోతున్నారు కానీ అన్ని చోట్లా మద్యం గంజాయి మాత్రం బాగా దొరుకుతోందని జగన్ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రాలో అభివృద్ధి అంతా వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది అని దానిని తన ఖాతాలో వేసుకోవడం తప్పించి చంద్రబాబు కొత్తగా చేసింది ఏమిటని జగన్ నిలదీశారు.

మేయర్ ని దించేశారు :

వైసీపీ హయాంలో బడి నుంచి ఆసుపత్రి దాకా అన్నింటా మేలు చేసామని ఉద్దానంలో రక్షిత మంచి నీరు ఇచ్చి ఏకంగా పలాసలో సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి నిర్మించామని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం అయినా విశాఖలో డేటా సెంటర్ అయినా వైసీపీ ఘనత అని ఆయన చెప్పారు. ఇవన్నీ ప్రజలకు తెలిసినా మరోసారి చెప్పాలని జగన్ కోరారు. తమ పార్టీ నుంచి అయిదేళ్ళకు ప్రమాణం చేసి పాలిస్తున్న విశాఖ మేయర్ ని ఎలా దించేసి కూటమి నేతలు అధికారం హైజాక్ చేశారు అన్నది విశాఖ ప్రజలు అందరికీ వివరించాలని జగన్ కోరారు. అంతే కాదు కార్పోరేటర్లను ప్రలోభాలు పెట్టి లాగేశారు అన్నారు వైసీపీ శ్రేణులు ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవాలని జగన్ సూచించారు.