వైసీపీ వెనక్కు వస్తుందా ?!
అయితే తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణలో పోటీ చేయబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
By: Garuda Media | 23 Aug 2026 11:00 AM IST‘మా దృష్టి పూర్తిగా 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీదనే ఉంది. గత నాలుగున్నర సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని’ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2018 నవంబర్ 10న పార్టీ సెంట్రల్ కమిటీ ద్వారా నిర్ణయాన్ని ప్రకటించాడు.
2014 ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యేగా బానోతు మదన్ లాల్, పినపాక ఎమ్మెల్యేగా పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావు పేట ఎమ్మెల్యేగా తాతా వెంకటేశ్వర్లు గెలుపొందారు. ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందుకే తాము పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదనే ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.
అయితే తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణలో పోటీ చేయబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శల వెనక వైసీపీ ఉందని, వైఎస్ భారతిని తెలంగాణ అధ్యక్షురాలిగా నియమించి 2028 ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉన్న సంబంధాలు కూడా అందరికీ తెలిసినవే. తాజగా రేవంత్ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణల వెనక బీఆర్ఎస్, వైసీపీ ఉన్నాయని ప్రచారం చేయడం ద్వారా తెలంగాణలో ఉన్న ఆంధ్రులు, ఎన్టీఆర్, టీడీపీ అభిమానులను రేవంత్ వైపు మరల్చేందుకు ఈ చర్చను ముందుకు తీసుకువచ్చారని అంటున్నారు.
2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 11 శాసనసభ స్థానాలకు పరిమితం అయింది. 58 సభ్యులు ఉన్న శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య 42. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరి అనర్హత అంశం మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉంది.
వైసీపీ మనుగడ కొనసాగాలంటే 2029 ఎన్నికల్లో ఏపీలో ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణ రాజకీయాల వైపు అడుగుపెట్టే అవకాశం ఎంత మాత్రం లేదనే చెప్పాలి. మరి ఈ ఊహాగానాలపై ఆ పార్టీ అధిష్టానం ఎలా స్పందించాలో వేచిచూడాలి.
