లోకల్ ఎలక్షన్.. కూటమి కన్నా ముందుగా జగన్ ప్లాన్!
ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
By: Tupaki Political Desk | 24 July 2026 3:26 PM ISTఏపీలో స్థానిక ఎన్నికలకు అన్నిపార్టీలు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరులో మున్సిపాలిటీలు, ఆ తర్వాత జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలతోపాటు పంచాయతీ పోరు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గడువు ముంచుకొస్తుండటంతో అధికార కూటమితోపాటు విపక్షం వైసీపీ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమితో డీలా పడిన వైసీపీ స్థానిక ఎన్నికలతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అధినేత జగన్ పర్యటనలకు జనం భారీగా వస్తుండటంతో పార్టీపై సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మాజీ సీఎం జగన్ సైతం పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సంసిద్ధం చేసే ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని, ఏకగ్రీవం అయ్యే పరిస్థితి తలెత్తకూడదని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ తాజాగా సమావేశమయ్యారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు పలువురు ప్రముఖ నేతలతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికలు ఎప్పుడైనా సరే ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సాధారణంగా తీసుకునే ధోరణి వీడాలని జగన్ పార్టీ నేతలకు హితవు పలికారు.
స్థానిక ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల స్థాయిలోనే అత్యంత ప్రాధాన్యమైనవిగా భావించాలని, విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో శ్రమించాలని ఆదేశించారు. గ్రామీణ స్థాయిలో పార్టీ పట్టును నిలబెట్టుకోవడానికి ప్రతి గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన బాధ్యత పూర్తిగా నాయకులదేనని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు జగన్ ముందస్తు వ్యూహం సిద్ధం చేశారు. ఏ ఒక్క స్థానంలోనూ పార్టీ అభ్యర్థి లేరనే మాట వినిపించకూడదని, అన్ని స్థానాల్లోనూ సత్తా చాటే అభ్యర్థులను బరిలోకి దింపాల్సిందేనని తేల్చిచెప్పారు. అంతేకాకుండా, ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉంటూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
కమిటీలకు గుర్తింపు కార్డులు
పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వచ్చే నెల నుంచి వివిధ స్థాయిల్లోని పార్టీ కమిటీలకు అధికారికంగా గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు జగన్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉత్సాహంగా పనిచేస్తూ పార్టీకి అంకితమైన వారిని గుర్తించి వారికి మరింత కీలక బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, రాబోయే స్థానిక పోరులో అధికార కూటమికి దీటైన పోటీనిచ్చేందుకు వైసీపీ అధినేత ఇప్పటి నుంచే పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
