Begin typing your search above and press return to search.

నేతల పాత మోజు...జగన్ మాట వింటారా ?

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాను నిర్ణయం ఒకసారి తీసుకుంటే వెనక్కి తగ్గేది లేదు అన్నది పార్టీ వర్గాలు చెబుతూంటాయి.

By:  Satya P   |   10 Aug 2026 1:23 PM IST
నేతల పాత మోజు...జగన్ మాట వింటారా ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాను నిర్ణయం ఒకసారి తీసుకుంటే వెనక్కి తగ్గేది లేదు అన్నది పార్టీ వర్గాలు చెబుతూంటాయి. అలాంటి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని పార్టీ నేతల నుంచి ఒక విధంగా ఒత్తిడి వస్తోంది అని అంటున్నారు. అదేంటి అంటే పాత నియోజకవర్గాలు తమ సొంత ప్రాంతాలకు తిరిగి తమను బదిలీ చేయమని. 2024 ఎన్నికల ముందు ఎక్కడ నుంచో తెచ్చి ఎక్కడికో విసిరేసినట్లుగా దాదాపుగా వంద దాకా అసెంబ్లీ నియోజకవర్గాలలో షిఫ్టింగ్ చేసి వైసీపీ అతి పెద్ద రాజకీయ ప్రయోగం చేసింది. అలా జిల్లాలను కూడా దాటించి మరీ పోటీ చేయించింది. కరెక్ట్ గా ఎన్నికల ముందు ఈ విధంగా ముక్కూ మొహం తెలియని నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ఎన్నికల గోదాలో ఈదలేక చతికిలపడిన వారే ఎందరో ఉన్నారు. వైసీపీ చేసిన ఈ ప్రయోగం వికటించింది. కేవలం 11 సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. ఇంత జరిగినా రెండేళ్ళ కాలం గిర్రున తిరిగినా ఈ బదిలీల నుంచి ఆయా నేతలకు విముక్తి మాత్రం దక్కడం లేదని అంటున్నారు.

నిరాసక్తంగానే :

పోనీ ఎన్నికల ముందు తక్కువ టైం ఉంది కదా ఎవరూ తెలియదు అనుకుంటే ఏమో కానీ ఓడి పాతిక నెలలు దాటినా వైసీపీ నేతలు షిఫ్టింగ్ నియోజకవర్గాలలో తమ పలుకుబడి పెంచుకోలేకపోయారు. దానికి కారణం వారికి నిరాసక్తత అని అంటున్నారు. మరో వైపు చూస్తే అక్కడ బలంగా ఉన్న పాత వర్గాలు నుంచి సహాయ సహకారం లేకపోవడం, క్యాడర్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడం. దీంతో చాలా మంది వైసీపీ నేతలు 2024 ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గాలకు దాదాపుగా వెళ్ళడం మానుకున్నారని అంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో పేరుకి ఇంచార్జి ఉన్నా పార్టీ యాక్టివిటీలు ఏవీ పెద్దగా జరగడం లేదని అంటున్నారు.

మార్చండి అంటూ :

ఈ నేపథ్యంలో తమను సొంత నియోజకవర్గాలకే బదిలీ చేయాలని అలాగైతేనే రాజకీయం బాగుంటుందని తాము కూడా జనాల్లోకి వెళ్ళగలమని పార్టీని పటిష్టం చేయగలమని చెబుతున్నారు. జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్ళినపుడు నేతల నుంచి ఇదే తరహా విన్నపాలు వస్తునాయి. అలాగే తాడేపల్లి ఆఫీసులో జగన్ ని నేతలు కలసినపుడు ఈ విషయం మీదనే కోరుకుంటున్నారు. అధినాయకత్వం ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. కానీ ఇప్పటిదాకా స్పష్టమైన హామీ కానీ భరోసా కానీ నేతలకు రాలేదని అంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో సైతం :

ఇక మరో రెండు నెలలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా గట్టిగా నిలబడాలని అధినాయకత్వం నేతలను ఆదేశించింది. అయితే తమకు సొంత నియోజకవర్గాలు అయితే పార్టీని బలోపేతం చేయడం సులువు అని నేతలు అంటున్నారు. షిఫ్టింగ్ చేసిన చోట అయితే తమకు పలుకుబడి అంతగా లేదని చెప్పేసుకుంటున్నారు. అక్కడ పార్టీ బలం కానీ ప్రత్యర్థి బలం కానీ తమకు అసలు తెలియడం లేదని దాంతో తాము ఏ విధంగా స్థానిక ఎన్నికల్లో ఫైట్ ఇవ్వగలమని వారు ప్రశ్నిస్తున్నారు. అధినాయకత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు సరైన నిర్ణయం తీసుకుంటే తమ సొంత ఇలాకాలో తాము రాజుగా ఉంటామని పార్టీని కూడా అక్కడ దివ్యంగా వెలిగిస్తామని చెబుతున్నారు. మరి అధినాయకత్వం ఆలోచనలు ఏమిటో ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు.