Begin typing your search above and press return to search.

జగన్ కి హై రిస్క్...పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రాణ హాని ఉందా, ఆయన హై రిస్క్ లో ఉన్నారా. ఇది ఎవరికీ ఇప్పటిదాకా తట్టని విషయమే.

By:  Satya P   |   23 Oct 2026 11:28 AM IST
జగన్ కి హై రిస్క్...పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రాణ హాని ఉందా, ఆయన హై రిస్క్ లో ఉన్నారా. ఇది ఎవరికీ ఇప్పటిదాకా తట్టని విషయమే. కానీ అదే వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం గట్టిగా చెబుతున్నారు. జగన్ కి హై రిస్క్ ఉందని, ఆయనకు ప్రాణ హాని ఉందని అంటున్నారు. అయితే ఆయన ఈ రెండు విషయాలను విడిగా చెప్పలేదు, వేరే విషయంతో కలిపి చెబుతున్నారు. ఆ వేరే విషయం ఏమిటి అంటే బెంగళూరులోని జగన్ నివాసం ఉంటున్న యలహంక ప్యాలెస్‌ లో తన కుమార్తె వివాహం చేయాడానికి వైఎస్ షర్మిల నిర్ణయించిన నేపథ్యంలో జగన్ అక్కడ తన సెక్యూరిటీ పరంగా వద్దు అని చెప్పడం జరిగింది అని పేర్ని నాని వివరిస్తూ జగన్ కి ప్రాణ హాని ఉందని చెప్పారు.

ఎందుకు అనుమతి లేదంటే :

ఇదిలా ఉంటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ లో తన మేనకోడలు షర్మిల కుమార్తె వివాహానికి మాజీ సీఎం జగన్ అనుమతి ఎందుకు ఇవ్వలేదో వివరించిన క్రమంలో పేర్ని నాని జగన్ కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యన అక్కడ ఉంటున్నారు అని చెప్పారు. జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని కూడా చెప్పారు. పైగా యలహంక ప్యాలెస్‌ సింహద్వారం ఒక్కటే అని చెప్పారు. అలా కామన్ గా ఉండే కాంపౌండ్ లోనే జగన్ షర్మిల నివాసాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అంతా ఓపెన్ గా ఉంటుందని ఆయన అంటూ పెళ్ళి వంటివి అక్కడ చేయడానికి అది కళ్యాణ మండపం కాదని కూడా చెప్పారు.

అపరిచితులు ఎంతో మంది :

ఇక జగన్ నివాసంలోనే ఒక వైపు ఈ పెళ్ళి జరిగితే అపరిచితులు ఎంతో మంది వస్తారని క్యాటరింగ్ నుంచి పూలు అలంకరించే వారి నుంచి ఇలా ఎంతో మంది వచ్చి పోయే ఆ ప్రాంతం అంతా జగన్ హై సెక్యూరిటీకి భంగపరచే విధంగా ఉంటుందని పేర్ని నాని చెప్పారు. దాని వల్ల జగన్ కి భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే జగన్ అక్కడ పెళ్ళి వద్దు అని చెప్పారు తప్ప వేరే కారణం ఏదీ లేదని పేర్ని నాని వివరించే ప్రయత్నం చేశారు.

ఎన్నో ఉండగా అంటూ :

ఇక చూస్తే బెంగళూరులో ఎన్నో వేదికలు ఉండగా అక్కడే పెళ్ళి ఎందుకు చేయడం అని కూడా ఆయన అన్నారు. పైగా జగన్ వద్దు అని చెప్పిన తరువాత సమంజసం కాదని అన్నారు. జగన్ ఉంటున్న యలహంక ప్యాలెస్‌ గురించి మాట్లాడుతున్న టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు హైదరాబాద్ లో కట్టించుకున్న అద్భుతమైన ప్యాలెస్ గురించి ఏనాడైనా మాట్లాడిందా ఫోటోలు ప్రచురించిందా అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రతీ శుక్రవారం బాబు లోకేష్ ఇద్దరూ అమరావతి నుంచి హైదరాబాద్ కి వెళ్ళి సోమవారం వస్తారు కదా మరి ఒక్క ఫోటో అయినా ఆ ప్యాలెస్ గురించి ఎందుకు ప్రచురించలేదూ అని పేర్ని నిలదీశారు.

మరో వివాదంగా :

మొత్తం మీద చూస్తే ఆస్తుల గొడవ నుంచి అన్నా చెళ్ళెళ్ళు ఇపుడు యలహంక ప్యాలెస్‌ దాకా వచ్చారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే షర్మిల కుమార్తె వివాహం నవంబర్ 25న ఉంది. కచ్చితంగా నెల రోజుల సమయం. ఈ వివాహం యలహంక ప్యాలెస్‌ లో జరుగుతుందా లేదా ఎక్కడ వేదిక మారుతుంది అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. షర్మిల పట్టుదల బట్టి చూస్తే యలహంక ప్యాలెస్‌ చుట్టూ వివాదం మరింతగా పెరుగుతుందా అన్నది కూడా చూస్తున్నారు. వైసీపీ నేతలు కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఇది వ్యక్తిగత వివాదాల స్థాయి నుంచి రాజకీయాల దాకా సాగుతోంది అని అంటున్నారు.