స్థానిక ఎన్నికల వేళ..పులివెందులకు జగన్ !
ఇదిలా ఉంటే పులివెందుల మున్సిపాలిటీ లో ఇరవై వార్డులలో కూటమికి ఏకగ్రీవం కావడం జరిగింది. మొత్తం 40 వార్డులు ఉంటే అందులో ఇరవై ముందే ఏకగ్రీవం అయ్యాయి.
By: Satya P | 26 Oct 2026 11:31 PM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి బాగా రాజుకుంది. ఎటు చూసినా రాజకీయం వేసవి ఉష్ణోగ్రత ను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత ఇలాకా పులివెందులలో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. జగన్ ఈ నెల 27, 28 తేదీలలో పులివెందులలో మకాం వేయనున్నారు. అంతే కాదు ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తారని పార్టీ నేతలతో సమావేశం అవుతారని వైసీపీ వర్గాల భోగట్టా.
క్యాంప్ ఆఫీసులోనే :
ఇదిలా ఉంటే జగన్ రెండు రోజుల పర్యటన ఖరారు అయింది. ఆయన ఈ నెల 27న ఉదయం పులివెందులకు చేరుకోనున్నారు. అక్కడ ఆయన భకరాపురంలో క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. తాడేపల్లి నుంచి నేరుగా బయలుదేరి పులివెందులకు జగన్ వస్తారు అని అంటున్నారు. భకరాపురంలో జగన్ ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుని వారి సమస్యలను తెలుసుకుంటారు అని అంటున్నారు. ఇక అదే 27న జగన్ పులివెందులలోని తన నివాసంలో రాత్రికి బస చేస్తారు అని అంటున్నారు. ఆ మరుసటి రోజున కూడా ఆయన పులివెందులలో పర్యటనలు చేస్తారు అని అంటున్నారు.
దిశానిర్దేశం కోసం :
ఇక పులివెందుల మునిసిపాలిటీకి ఎన్నికలు ఉన్నాయి. అలాగే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. కడప మేయర్ సీటుకు ఎన్నికలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పులివెందుల మునిసిపాలిటీలో సగం వార్డులకు ఏకగ్రీవం అయింది. దాంతో వైసీపీకి కొంత షాక్ తగిలింది అని అంటున్నారు. ఇక మిగిలిన వార్డులలో అయినా వైసీపీ గట్టిగా నిలబడితే కూటమిని ఎంతో కొంత నిలువరించగలుగుతామని వైసీపీలో చర్చ సాగుతోంది. దాంతో జగన్ పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతారు అని అంటున్నారు. పార్టీపరంగా ఆయన దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు.
జగన్ పినతల్లి పోటీతో :
ఇదిలా ఉంటే పులివెందుల మున్సిపాలిటీ లో ఇరవై వార్డులలో కూటమికి ఏకగ్రీవం కావడం జరిగింది. మొత్తం 40 వార్డులు ఉంటే అందులో ఇరవై ముందే ఏకగ్రీవం అయ్యాయి. ఇక మిగిలిన ఇరవైకి నవంబర్ 1న పోలింగ్ ఉంది. పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా తన పినతల్లి వైఎస్ ప్రమీలమ్మను అభ్యర్ధిగా జగన్ ఖరారు చేశారు. ఆమె మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి. ఆమెకు గతంలోనూ అంటే 2014 లో పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అయినా సరే పులివెందులలో సగానికి వార్డులు ఏకగ్రీవం కావడంతో వైసీపీ ఏమి చేస్తుందో చూడాల్సి ఉంది.
కూటమి విమర్శలు :
సగానికి సగం వార్డులు పులివెందులలో ఏకగ్రీవం కావడం వైసీపీకి గుణపాఠం అని కూటమి నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించారని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించార్జు. కూటమి అబ్భివృద్ధి సంక్షేమంతోనే ప్రజల్లోకి వెళ్తోందని ఆయన అన్నారు. ఒక విధంగా పులివెందులలో పెద్ద ఎత్తున వార్డులు ఏకగ్రీవం వైసీపీకి చాలా హర్ట్ చేసే విషయంగా ఉంది. నామినేషన్ల దగ్గరే వైసీపీ వీగిపోయింది అని కూటమి నేతలు అంటున్నారు. గతంలో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయిన సంగతిని గుర్తు చేస్తున్నారు. దాంతో పులివెందులలో వరసగా మూడవసారి ఎమ్మెల్యేగా ఉన్న జగన్ వైసీపీని గట్టిగా నిలబెట్టేందుకు క్యాడర్ కి లీడర్ కి సరైన డైరెక్షన్ ఇస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పులివెందులలో జగన్ టూర్ ఆసక్తిని రేపుతోంది.
