వైఎస్సార్ వివేకా కాంబో మిస్...అందుకే అలా !
వైఎస్సార్ కి పులివెందుల కంచుకోట అని అంటారు. అది ఊరికే ఏమీ సాధ్యపడలేదు.
By: Satya P | 14 Aug 2025 4:00 PM ISTవైఎస్సార్ కి పులివెందుల కంచుకోట అని అంటారు. అది ఊరికే ఏమీ సాధ్యపడలేదు. ఆయన మూడున్నర దశాబ్దాల రెక్కల కష్టంతోనే ఆ కంచుకోట నిర్మితం అయింది అని అంటారు. వైఎస్సార్ రూపాయి డాక్టర్ గా తన వైద్య వృత్తిని ప్రారంభించారు. అలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వారు, జనంతో మమేకం అయిన వారు. ఆయన తొలి ఎన్నిక 1978లో జరిగింది. అతి చిన్న కరపత్రాలను ముద్రించి జనంలో ఆయన ప్రచారం చేస్తే మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా చేసి జనాలు నీరాజనాలు పలికారు.
అంతకంతకు పెంచుకుంటూ :
అయితే తొలి విజయంతోనే వైఎస్సార్ రిలాక్స్ కాలేదు. తన పలుకుబడిని పరపతిని అంతకంతకు పెంచుకున్నారు. జనాలకు ఎపుడూ ఆయన అందుబాటులో ఉండేవారు. ఆయన ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎంపీ అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినా పీసీసీ చీఫ్ అయినా పులివెందులను మరచిపోలేదు. ఆయన హైదరాబాద్ ఢిల్లీలో ఎక్కడ ఉన్నా పులివెందుల ఠంచనుగా వచ్చేవారు అని చెబుతారు. ఇక ఆయన వస్తే ఊరంతా పండుగే అన్నట్లుగా ఉండేదని అంటారు.
ప్రజా దర్బార్ లతో:
వైఎస్సార్ ప్రజా దర్బార్ లను నిర్వహిస్తూ జనం సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందారు. ఆయన ఊళ్ళో ఉంటే తెల్లవారు జామున పెరట్లో లేచిన పొయ్యి అర్ధరాత్రి అయినా ఆరకుండా ఉండేది అంటే ఎంత మంది వచ్చేవారో అర్ధం చేసుకోవాలని చెబుతారు. ఆయన వద్దకు వెళ్ళిన వారికి సమస్య పరిష్కారం అయినా కాకపోయినా ఎంతో ఓదార్పు అయితే దక్కేదని అంటారు. తమకంటూ ఒక నాయకుడు ఉన్నారని జనాలు సంతృప్తి చెందేవారు.
అన్నకు మారుగా తమ్ముడు :
ఇక వైఎస్సార్ ఊర్లో లేని సమయంలో అంతా తాను అయి తమ్ముడు వివేకానందరెడ్డి మొత్తం చూసేవారు జనాలను వెంటబెట్టుకుని మరీ ఆఫీసులకు వెళ్ళి సమస్యలు పరిష్కరించేవారు. ఆయన వద్ద ఎలాంటి భేషజాలు ఉండేవి కావని చెబుతారు. సామాన్యుడిగా ఉంటూ ప్రజలతో తాను అన్నట్లుగా వివేకా వ్యవహరించిన తీరుతోనే పులివెందుల వైయస్సార్ ఫ్యామిలీకి అలా కట్టుబడి పోయింది. అది రాజకీయ బంధం కాదు అంతకంటే ఎక్కువగా ఒక భావోద్వేగంతో కూడుకున్న బంధంగా అన్నదమ్ములు ఇద్దరూ తీర్చిదిద్దారు.
ఆ లోటు అలాగే ఉందా :
వైఎస్సార్ గతించి 16 ఏళ్లు పై దాటుతోంది. వివేకా మరణించి ఆరేళ్ళు అవుతోంది. ఆ లోటు అలాగే ఉంది అని అంటున్నారు. వైఎస్సార్ ప్లేస్ లో జగన్ వారసుడిగా ఉన్నారు. అలాగే వివేకా ప్లేస్ లో అవినాష్ రెడ్డి ఉన్నారు. కానీ ఆ పెద్దలను జనాలు మరచిపోలేకపోతున్నారు అని అంటున్నారు. ఈ జగన్ సైతం తండ్రి మాదిరిగా పులివెందులలో ప్రజా దర్బార్ ని నిర్వహిస్తున్నా మరింతగా జనాలకు కనెక్ట్ కావాల్సి ఉందని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
అంతే కాదు అవినాష్ సైతం ప్రజలతో మరింతగా ఉంటూ తమ కుటుంబం అన్న ఫీలింగ్ తీసుకుని రావాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఓటమి ఒక గుణ పాఠం మాత్రమే. ఈ రోజుకీ వైఎస్సార్ కుటుంబం పట్ల పులివెందుల జనంలో అభిమానం ఉంది. కానీ దానిని ఇంతకు ఇంతా పెంచుకొని పదిలపరచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆ దిశగా వైసీపీ చేసే ప్రయత్నాలే ఆ పార్టీకి శ్రీరామ రక్షగా మారుతాయని అంటున్నారు.
