Begin typing your search above and press return to search.

ప‌ర్య‌ట‌న‌ల రాజ‌కీయం: జ‌గ‌న్ కోసమా... జ‌నం కోస‌మా..?

వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పర్యటనలు ప్రజల కోసమా లేకపోతే వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునేందుకు చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

By:  Garuda Media   |   6 Nov 2025 10:00 AM IST
ప‌ర్య‌ట‌న‌ల రాజ‌కీయం: జ‌గ‌న్ కోసమా...  జ‌నం కోస‌మా..?
X

వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పర్యటనలు ప్రజల కోసమా లేకపోతే వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునేందుకు చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా కృష్ణాజిల్లా పర్యటనలో వైసిపి వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. భారీ ఎత్తున జన సమీకరణ చేయటం, డీజే సౌండ్ తో ఊరేగింపుగా జగన్ ను తీసుకొని వెళ్లడం.. పెద్ద ఎత్తున హంగామా చేయటం వంటివి రాజకీయ పార్టీలు సహా పలువురు తప్పుపడుతున్నారు. రైతులను పరామర్శించడం తప్పు కాకపోయినా ఈ పేరుతో బల ప్రదర్శన దిగటం ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌.

ముఖ్యంగా దారి పొడవునా ఊరేగింపుగా వెళ్లడం వంటివి సరికాదన్నది మేధావులు కూడా చెబుతున్న మాట. ఈ వ్యవహారంలో గతంలోనే అనేక కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా పల్నాడులో నిర్వహించిన కార్యక్రమంలో శింగ‌య్య అనే వ్యక్తి మృతి చెందడం కూడా అందరికీ తెలిసిందే. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఇదే తరహాలో హడావుడి చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ముందుకు సాగుతున్నారు.

దీంతో అసలు జనం కోసం జగన్ వస్తున్నారా లేకపోతే జగన్ కోసం జనాన్ని తరలిస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం కావడంతో సహజంగానే వైసిపి పై ఇమేజ్ తగ్గింది అనే వాదన వినిపిస్తోంది. మరోవైపు పార్టీ నాయకులు కూడా దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఇమేజ్ను పెంచుకునేందుకు జగన్ ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న వాదన టిడిపి వర్గాల నుంచి బలంగా వినిపిస్తుండగా వైసీపీలోను ఇదే తరహా ఆలోచన కనిపిస్తోంది.

కొంతమంది సీనియర్ నాయకులు ఇంత హడావుడి ఎందుకు ఇలా చేయడం వల్లే గతంలో కూడా దెబ్బతిన్నామని చెప్పుకొస్తున్నారు. పరామర్శించాలని అనుకున్నప్పుడు ఓ పదిమంది నాయకులతో వెళ్లి పరామర్శించి రావచ్చు అని, అదేవిధంగా ఆర్థిక సాయం కూడా చేయొచ్చని దీనివల్ల హైలెట్ కావచ్చు అని వారు చెబుతున్నారు. కేవలం పరామర్శల పేరుతో హడావిడి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి శాంతి భ‌ద్ర‌త‌ల‌ సమస్యలు సృష్టించే విధంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో మరింత చులకన అయ్యే ప్రమాదం ఉందన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట.

ఏదేమైనా తాజా పర్యటన కూడా జగన్కు ప్లస్సు కాకపోగా మైనస్ అయింది అన్నది సీనియర్లు మధ్య జరుగుతున్న చర్చ. ఈ విషయంలో జగన్ మరి భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటారా లేదా ఇదే పద్ధతి కొనసాగిస్తారా అనేది చూడాలి. గతంలో ఓదార్పు యాత్రలు చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత పాదయాత్ర చేశారు. ఏదైనా ఎన్నికల సమయంలో చేయడం వరకు బాగానే ఉంటుంది.

కానీ ఇలా ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ జనాలను సమీకరించడం పెద్ద ఎత్తున ఉద్యమాల మాదిరి చేయటం వంటివి సరికాదు అన్నది సాధారణ ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న మాట. ఏదేమైనా ఇటువంటి విధానాన్ని ఇటువంటి పోకడలను సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.