Begin typing your search above and press return to search.

జగన్ పాదయాత్ర..బ్లాస్టింగ్ న్యూస్ అదేనా ?

సరిగ్గా అంతకు పదేళ్ళ క్రితం 2017 నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి కూడా చివరిలో 7 ఉన్న ఏడాదితోనే మొదలెడుతున్నారు అని అంటున్నారు.

By:  Satya P   |   4 Sept 2026 8:30 AM IST
జగన్ పాదయాత్ర..బ్లాస్టింగ్ న్యూస్ అదేనా ?
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తాను అని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. పార్టీ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. ఏ ఏడాది అంటే 2027 అన్నది తెలిసింది. కానీ ఏ నెల ఏ డేటూ అన్నది ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఇపుడు ఒక బ్లాస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జగన్ పాదయాత్ర డేట్ మంత్ కూడా చెబుతూ ఈ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జగన్ తన తండ్రి వైఎస్సార్ 78వ జయంతి వేళ ఆ రోజు నుంచే పాదయాత్రకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. అంటే 2027 జూలై 8 నుంచి అన్న మాట. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి జయంతి రోజైన ఆ రోజే తన పాదయాత్రను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో కూడా ఆయన ఇదే వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సరిగ్గా అంతకు పదేళ్ళ క్రితం 2017 నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి కూడా చివరిలో 7 ఉన్న ఏడాదితోనే మొదలెడుతున్నారు అని అంటున్నారు.

నేషనల్ మీడియా చెప్పింది :

ఇదిలా ఉంటే జగన్ ఎప్పటి నుంచి పాదయాత్ర ఏపీలో మొదలెడతారు అన్నది నేషనల్ మీడియా ఇండో-ఏషియన్ న్యూస్ సర్వీస్ వెల్లడించింది.ఈ సంస్థ పేర్కొన్న దాని ప్రకారం చూస్తే జగన్ 2027 జూలై 8 ముహూర్తం పెట్టుకున్నారు అని స్పష్టం చేసింది. ఇది కూడా పార్టీ వర్గాలు చెప్పినట్లుగా పేర్కొనడం విశేషం. మరి ఇది నిజమేనా ఈ డేట్ కచ్చితంగా జగన్ పాదయాత్రకు నాంది పలుకుతుందా అంటే తెలియాలంటే ఇంకా పది నెలల సమయం ఉంది. ఇక ఈ న్యూస్ నిజమా కాదా అన్నది పక్కన పెడితే జగన్ పాదయాత్రకు సంబంధించి వచ్చిన ఈ వార్త అయితే వైసీపీ వర్గాలలో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని కలిగిస్తోంది అంటున్నారు. ఈ ఏడాది గడిస్తే చాలు జగన్ జనంలోకి వస్తారు, ఏకంగా పాదయాత్రతో అందరితో కలసి అడుగులు వేస్తారు అని వైసీపీ వర్గాలలో చర్చ సాగుతోంది.

జాతకం ప్రకారమేనా :

మరో వైపు చూస్తే జగన్ జాతకం ప్రకారం నవంబర్ 9 వరకూ పెద్దగా ఆశించిన ఫలితాలు ఉండవని అంటున్నారు. ఆ తరువాత ఒక్కసారిగా ఆయన జాతకం మారుతుందని ఆయనకు రాజకీయంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే ఈ ఏడాది చివరి నుంచే జిల్లాల పర్యటనలు వంటివి ప్రారంభించి వాటిని ఒక పద్ధతిలో నిర్వహించుకున్నాక 2027 జూలై 8 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు అని అంటున్నారు.

పోయిన చోటనే అంటూ :

రాజకీయాల్లో పోయిన చోటనే వెతుక్కోవాలి అని అంటారు. జగన్ కూడా అదే పని చేస్తున్నారు. తన రాజకీయ జీవితంలో 2017లో అతి పెద్ద పాదయాత్రను నిర్వహించి 2019లో అధికారాన్ని అందుకున్న ఆయన మరోసారి భారీ పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలా జగన్ తన సుదీర్ఘ రాజకీయ పాదయాత్రను ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపడానికి వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. అదే సమయంలో 2029 లో కచ్చితంగా అధికారం అందుకోవడానికే అని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే కనుక పాదయాత్ర షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అంటున్నారు. అంతవరకూ వస్తున్నవి ఊహాగానాలేనా అంటే వైసీపీ అధికారికంగా ప్రకటించేవరకూ అలాగే అనుకోవాలని అంటున్నారు.