పాదయాత్రకు జగన్ రెడీ.. ప్రజలు సిద్ధమా.. !
ప్రాంతాల వారీగా కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ముందుకువచ్చింది. ఇప్పటికే జిల్లాల ఏర్పా టు, మండలాల వారీగా ప్రజల ఇష్టం మేరకు.. మార్పులు తీసుకువచ్చారు.
By: Garuda Media | 16 Jan 2026 1:00 PM IST2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్.. పాదయాత్రకు రెడీ అవుతున్నారు. 2027 చివరి దశలో ఆయన పాదయాత్ర చేస్తారని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. అయితే.. గతంలో పాదయాత్ర చేసి విజయం దక్కించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ఇదే ఫార్ములాను జగ న్ అనుసరిస్తున్నట్టు తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. గతా నికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసాలు చాలా కనిపిస్తున్నాయన్నారు.
ఎప్పటికప్పుడు సమస్యలు మారుతున్నాయని.. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే పాదయాత్రకు రెడీ అవుతున్నారన్నది పేర్ని చెప్పినమాట. అయితే.. జగన్ పాదయాత్రకు సిద్ధమైనా.. ప్రజలు రెడీగా ఉన్నారా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రజల సమస్యలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఈ విషయంలో సందేహం లేదు.
ప్రాంతాల వారీగా కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ముందుకువచ్చింది. ఇప్పటికే జిల్లాల ఏర్పా టు, మండలాల వారీగా ప్రజల ఇష్టం మేరకు.. మార్పులు తీసుకువచ్చారు. అలాంటిది.. ఇప్పుడు కొత్తగా ఉండే సమస్యలు అంటూ పెద్దగా లేదు. పోనీ.. పదవుల విషయాన్ని చూసినా.. పదవులు కూడా ప్రజలకు నచ్చిన మేరకు ఇచ్చేందుకు కూటమి రెడీ అవుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయనుంది. ఇది రాజకీయంగానే కాకుండా.. బీసీల పరంగా కూడా పెను మార్పు అనే చెప్పాలి.
ఇక, ప్రాంతాలు.. మౌలిక సదుపాయాల పరంగా చూసుకున్నా.. వైసీపీ హయాం కంటే కూడా ఇప్పుడు కూటమి నాయకులు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో జగన్‌కు ఛాన్స్ ఏమేర కు ఉంటుందన్నది ప్రశ్న. పైగా.. 2027 అంటే.. అప్పటికి రాష్ట్రంలో పెట్టుబడులు రాక పెరుగుతుంది. ఉపాధి, ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుంది. అమరావతి నిర్మాణం తొలిదశ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పోలవరం లోనూ ఇదే తరహా పరిస్థితి ఉండనుంది. సో.. ఇన్ని కారణాల నేపథ్యంలో ప్రజలు జగన్ పాదయాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.
