డాక్టర్ సుధాకర్ పోస్టర్లతో జగన్ కు స్వాగతం!
జగన్ పర్యటన నేపథ్యంలో నర్సీపట్నంలో కొన్నిచోట్ల డాక్టర్ సుధాకర్ ఫొటోతో పోస్టర్లు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ భారీ పోస్టర్లు జగన్ రాజకీయ ప్రత్యర్థులు పనిగా అనుమానిస్తున్నారు.
By: Tupaki Political Desk | 9 Oct 2025 11:38 AM ISTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఊహించని ట్విస్టు ఇచ్చారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న జగన్.. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు గురువారం వస్తున్నారు. విశాఖ నుంచి నర్సీపట్నంలోని మాకవరపాలెం వరకు ఆయన రోడ్డు మార్గం గుండా పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనకు స్వాగతం పలుకుతూ వైసీపీ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు వేయగా, జగన్ రాజకీయ ప్రత్యర్థులు సైతం విమర్శనాత్మక స్వాగత పోస్టర్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది.
జగన్ పర్యటన నేపథ్యంలో నర్సీపట్నంలో కొన్నిచోట్ల డాక్టర్ సుధాకర్ ఫొటోతో పోస్టర్లు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ భారీ పోస్టర్లు జగన్ రాజకీయ ప్రత్యర్థులు పనిగా అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర అవమానాలతో మానసికంగా కుంగిపోయిన డాక్టర్ సుధాకర్ మరణించారు. కోవిడ్ సమయంలో నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసిన డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం కనీసం మాస్కులు సరఫరా చేయడం లేదని, కరోనా రోగులకు చికిత్స చేసి తాము ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నామని ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఆ వీడియో వైరల్ కాగా, జగన్ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సస్పెన్షన్ తర్వాత సుధాకర్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన కరోనా సమయంలో చెప్పిన మాటలే కారణమని ఆరోపణలు, విమర్శలు వ్యక్తమయ్యాయి.
కరోనా తర్వాత కొద్ది కాలానికే డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. జగన్ ప్రభుత్వ వైఖరి వల్లే తీవ్ర కుంగుబాటుకు లోనైన డాక్టర్ సుధాకర్ మరణించారని అప్పటి ప్రతిపక్షం, ప్రస్తుత అధికార కూటమి తీవ్ర ఆరోపణలు చేసింది. డాక్టర్ సుధాకర్ మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా, ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులు ఎన్నికల అంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీని ఇరుకన పెట్టేందుకు టీడీపీ, జనసేన పార్టీలకు డాక్టర్ సుధాకర్ మరణం ఓ అస్త్రంగా మారింది. ఇక ఎన్నికలు ముగిసినా, డాక్టర్ సుధాకర్ మరణం వైసీపీని వెంటాడుతోందని చెప్పేందుకు నర్సీపట్నంలో వెలిసిన పోస్టర్లే నిదర్శనమని అంటున్నారు.
జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ సుధాకర్ పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. ‘మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా?’ అంటూ ఆ పోస్టర్లపై ముద్రించారు. ప్రజలు.. తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరిక కూడా పోస్టర్ పై ఉంది. ఇక ఈ పోస్టర్లను ఫొటోలు తీసి టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పోస్టర్లు ముద్రించడాన్ని నిరసిస్తున్నారు. కాగా, డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ఆస్పత్రిలో పనిచేస్తూ సస్పెన్షన్ గురి కావడం, ఆ తర్వాత ఆయన మరణించడం, ఈ ఎపిసోడ్ ఓ రాజకీయ వివాదంగా మారగా, జగన్ యాదృచ్ఛికంగా అదే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీల సందర్శనకు రావడం అధికార పార్టీకి ఓ రాజకీయ అస్త్రంగా మారిందని టాక్ వినిపిస్తోంది.
