Begin typing your search above and press return to search.

నర్శీపట్నం వస్తున్న జగన్ కి పచ్చి నిజం చెప్పిన అయ్యన్న

ఏపీ మాజీ సీఎం విపక్ష నేత వైఎస్ జగన్ నర్శీపట్నం వస్తున్నారు. ఆయన ఈ నెల 9న నర్శీపట్నం చేరుకుని అక్కడ తమ హయాంలో మజూరు చేసిన మెడికల్ కాలేజీని సందర్శిస్తారు.

By:  Satya P   |   4 Oct 2025 11:00 PM IST
నర్శీపట్నం వస్తున్న జగన్ కి పచ్చి నిజం చెప్పిన అయ్యన్న
X

ఏపీ మాజీ సీఎం విపక్ష నేత వైఎస్ జగన్ నర్శీపట్నం వస్తున్నారు. ఆయన ఈ నెల 9న నర్శీపట్నం చేరుకుని అక్కడ తమ హయాంలో మజూరు చేసిన మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ఏ మేరకు నిర్మాణం పూర్తి చేసుకుందో కూడా ఆయన పరిశీలిస్తారు. అక్కడ నుంచే ఆయన మీడియాతో మాట్లాడుతారు అని అంటున్నారు. నర్శీపట్నం అంటేనే సీనియర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గం. పది సార్లు పోటీ చేస్తే ఏడు సార్లు అయ్యన్న గెలిచిన కంచుకోటగా మార్చుకున్న సీటు అది. జగన్ అయితే 2019 ఎన్నికలప్పుడు నర్శీపట్నం నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక 2024 ఎన్నికల సమయంలో ఆయన ఆ ప్రాంతాన్ని టచ్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే నర్సీపట్నానికి జగన్ వచ్చి చాలా కాలమే అయింది. దాంతో పాటుగా ఆయన ఉత్తరాంధ్ర రాక కూడా ఈ మధ్య కాలంలో లేదు. దీంతో ఒక విధమైన హైప్ అయితే వైసీపీలో క్రియేట్ అవుతోంది.

జీవోలు ఏవీ అన్నందుకేనా :

ఇదిలా ఉంటే మెడికల్ కాలేజీల మీద వైసీపీ ప్రభుత్వం తమ క్రెడిట్ అని చెప్పుకుంటోంది. వాటిని పేదలకు దక్కకుండా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోంది అని కూడా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మధ్యనే కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టేందుకు జీవో అయినా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని, ఉంటే అవి ఏవీ ఎక్కడ అని ఆయన నిలదీశారు. దాంతో పాటుగా అయ్యన్న స్పీకర్ గా ఉంటూ వైసీపీకి విపక్ష హోదా ఇవ్వడం లేదు అన్నది కూడా ఉంది. పైగా ఆయన విపక్షంలో ఉన్నపుడు వైసీపీని టార్గెట్ చేసేవారు. ఫైర్ బ్రాండ్. ఇలా అన్నీ కలసి ఆయన ఇలాకాలోనే జగన్ అడుగు పెట్టి మెడికల్ కాలేజీను సందర్శిస్తే పొలిటికల్ గా ఆ కిక్కు వేరే లెవెల్ లో ఉంటుందని వైసీపీ భావించింది. అందుకే జగన్ నర్శీపట్నాన్ని ఎంచుకున్నారు అని అంటున్నారు.

అసెంబ్లీకి రావాలి అంటూ :

జగన్ నర్శీపట్నం వస్తున్న వేళ స్పీకర్ అయ్యన్న హాట్ కామెంట్స్ చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాలని అన్నారు. అలా కాకుండా మీడియా ముందు మైకుల ముందు మాట్లాడమేంటని ఎకసెక్కమాడారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఒక ఎమ్మెల్యేకు ఎంత సమయం ఇస్తామో అంతే సమయం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీకి జనాలు ఇచ్చినవి కేవలం 11 సీట్లు మాత్రమే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ప్రజలు ఇవ్వలేని హోదా తాము ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. హోదా అన్నది ఇవ్వడం కుదరదని మరో మారు చెప్పేశారు. అలా పచ్చి నిజమే ఆయన వెల్లడించారు.

ఎమ్మెల్యేలు మాత్రమేనా :

అయ్యన్న చెప్పిన దానిని బట్టి చూస్తే జగన్ ఎమ్మెల్యేగానే ఉన్నారని స్పష్టం అయింది. అంతే కాదు ఆయన మాట్లాడితే ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయమే ఇస్తారని కూడా తేల్చేశారు. ఇక పులివెందుల జెడ్పీటీసీలో కూడా వైసీపీ దారుణంగా ఓడిందని అయ్యన్న చేసిన మరో వ్యాఖ్య జగన్ అండ్ కో ని తీవ్రంగా హర్ట్ చేసేదే. మొత్తం మీద చూస్తే నర్శీపట్నం వస్తున్న జగన్ కూటమి ప్రభుత్వం మీద స్పీకర్ వైఖరి మీద ఏమి మాట్లాడుతారో చూడాల్సిందే.