జగన్ పర్యటనలో గందరగోళం.. ఏమైందంటే?
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం పర్యటిస్తున్నారు.
By: Tupaki Political Desk | 4 Nov 2025 1:31 PM ISTమొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం పర్యటిస్తున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన జగన్.. పెనమలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రైతులు, తుఫాను బాధితులను పరామర్శించనున్నారు. అయితే మాజీ సీఎం కాన్వాయ్ ను వందల మంది కార్యకర్తలు అనుసరిస్తుండటంతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ క్రమంలోనే ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో జగన్ కాన్వాయ్ లోని వాహనలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
పోలీసులు ఎంతలా ఆంక్షలు పెడుతున్నా, జగన్ అభిమానులు లెక్కచేయడం లేదు. మాజీ సీఎం పెనమలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన నుంచి మచిలీపట్నం హైవేపై ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ జగన్ కాన్వాయ్ ను నిలిపేస్తుండటంతో వెనుక ప్రయాణిస్తున్నవారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పెనమలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన వెంటనే జగన్ కాన్వాయ్ లో డీజే వాహనాన్ని చేర్చారు. అయితే పోలీసులు డీజే వాహనానికి అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు గోపువానిపాలెంలో పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పోలీసులు సూచించగా, జగన్ పర్యటన అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.
మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా పర్యటనపై పోలీసులు వివిధ ఆంక్షలు విధించారు. కేవలం 10 వాహనాలు, 500 మందికి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారాపురం, ఎస్.ఎన్.గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని సూచించారు. ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. అదేవిధంగా జగన్ పర్యటనకు దూరంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ముందుగా నోటీసులిచ్చారు. అయితే పోలీసు ఆంక్షలను కాదని వైసీపీ కేడర్ భారీగా తరలివచ్చింది. అనుమతించిన దానికన్నా ఎక్కువ వాహనాలతో జగన్ కాన్వాయ్ ముందుకు సాగుతోంది. విజయవాడ నగరంలోని పడమట సెంటర్ నుంచి దారిపొడవునా జగన్ కు స్వాగతం పలుకుతూ, వైసీపీ కేడర్ భారీ ప్రదర్శన నిర్వహిస్తోంది.
