డియర్ కామ్రేడ్...జగన్ తో సీపీఐ నేతలు
రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన పరిణామం గానే చెప్పాలని అంటున్నారు. వైసీపీ సోలో పార్టీ. ఒంటరిగానే పోటీ చేసే పార్టీ.
By: Satya P | 25 Sept 2026 9:00 AM ISTరాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన పరిణామం గానే చెప్పాలని అంటున్నారు. వైసీపీ సోలో పార్టీ. ఒంటరిగానే పోటీ చేసే పార్టీ. ఆ పార్టీ ఎవరితో కలిసేది ఉండదు, ఏ రాజకీయ పక్షం నేతతో భేటీ అంతకంటే కనిపించదు, వైసీపీ అంటే ఒకటి ఒంటరి అంకె అన్నట్లుగానే ఉంటుంది. ఇక రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు ఉంటాయి. వైసీపీ అయితే వీటి గురించి అసలు పట్టించుకోదు, మేము మా ప్రజలు మాకు పైన దేవుడి దీవెనలు అని అధినాయకత్వం తరచూ చెప్పే మాట. ఎవరెన్ని కూటములు కట్టినా ఎంతగా కలసికట్టుగా దూసుకుని వచ్చినా జనాలు మా వైపే అన్న నిబ్బరం వైసీపీది. 2024 ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా సరే ఇదే మా రూట్. ఎప్పటికీ ఇదే రైట్ అన్నది వైసీపీ పొలిటికల్ ఫిలాసఫీ.
ఎర్రన్నలు అతిధులుగా :
అలాంటి వైసీపీ ఆఫీసుకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎర్రన్నలు అతిధులుగా వచ్చారు. రావడమే కాదు జగన్ ని కలిసారు. ఆయనతో భేటీ వేశారు. చాలా సేపు ముచ్చట్లు కూడా పెట్టారు. మరి ఇంతకీ ఈ సమావేశం దేనికీ అన్నదే కదా. అయితే మ్యాటర్ సింపుల్. వైసీపీ అధినేత జగన్ సీపీఐ నేతలు తాజాగా కీలక సమావేశం జరిపారు. ఈ భేటీలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజతో పాటు కీలక నేతలు పలువురు పాల్గొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సిపిఐ నేతలకు జగన్ సాదర స్వాగతం పలికారు. ఇక ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో పాటు పలు ప్రజా సమస్యల అంశాలపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైసీపీని ఆహ్వానిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జగన్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అదన్న మాట మ్యాటర్.
తొలి కలయికకు శ్రీకారం :
ఇక ఈ నెల 26న విజయవాడ రౌండ్ టేబిల్ సమావేశానికి వైసీపీ నేతలు అయితే హాజరయ్యే చాన్స్ ఉంటుంది. జగన్ వరకూ చూసుకుంటే ఆయన రాకపోవచ్చు. ఇక కరవు సమస్యల పైన రౌండ్ టేబిల్ అంటే దాని మీద ఉద్యమాలు ఉండొచ్చు, ఆ మీదట ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉండొచ్చు. మరి ఇవన్నీ కనుక చూస్తే రానున్న రోజులలో వైసీపీ కామ్రేడ్స్ కలసి కట్టుగా ఉద్యమించే సందర్భం కూడా రావచ్చు అని అంటున్నారు. అంటే ఏపీలో రాజకీయ పరిణామాలు మెల్లగా మారుతున్నాయని అనుకోవాలి అంటే దానికి కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సీపీఐ నేతలు జగన్ ని కలవడం మాత్రం ఏపీ లో హాట్ టాపిక్ గానే ఉంది మరి.
