రాజకీయ బాంబు పేల్చనున్న జగన్ ?
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
By: Satya P | 20 Sept 2025 11:00 PM ISTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. స్తబ్దుగా ఉన్న వైసీపీ రాజకీయానికి గేర్ మార్చి స్పీడ్ పెంచాలని జగన్ చూస్తున్నారు. ఓటమి తరువాత చూస్తే కనుక వైసీపీ అధినేతలో మునుపటి ఫైర్ లేదని ఆయన జనం లోకి రావడం లేదని అసెంబ్లీని సైతం దూరం పెడుతున్నారని అంటున్నారు. అంతే కాదు ఆయన ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారని ఇక యధా రాజా తధా ప్రజా అన్నట్లుగా పార్టీ నాయకులు సైతం సైలెంట్ అయ్యారని మొత్తానికి ఏపీలో కూటమి మంచి ఫైర్ మీద ఉంటే వైసీపీ డీలా పడినట్లుగా విశ్లేషణలు ఉన్నాయి.
డిఫెన్స్ నుంచి బయటకు :
మరో వైపు చూస్తే వైసీపీ పూర్తిగా ఆత్మ రక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. కూటమిలోని మూడు పార్టీలు వైసీపీని ఫుల్ గా టార్గెట్ చేస్తున్నాయి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే గుక్క తిప్పుకోనీయడం లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండడంతో కూటమి పవర్ కి ఎదురు లేకుండా పోతోంది ఇక వైసీపీకి కనీసం విపక్ష కూడా లేకపోవడం 2014 మాదిరిగా మంచి సంఖ్యాబలం దక్కకపోవడంతో వైసీపీ అధినాయకత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లు అయింది. దాంతో క్యాడర్ సైతం నిస్తేజంలో పడిపోయింది.
అనర్హత వేటుకు ధీటుగా :
సరిగ్గా ఇదే సమయం చూసి అధికార పక్షం వైసీపీ మీద వ్యూహాత్మకంగా దాడి మొదలెట్టింది. సభకు హాజరు కావడం లేదని జీతాలు తీసుకుంటున్నారని చేస్తున్న ప్రకటనలు జనంలోకి వెళ్ళేందుకే అని అంటున్నారు. వైసీపీని బదనాం చేసేందుకే అని అంటున్నారు. అసెంబ్లీకి రాకపోవడానికి వైసీపీ చెప్పిన విషయాలు కంటే కూడా కూటమి చేసే విమర్శలే బాగా పోతున్నాయి. దాంతో పాటు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అనర్హత వేటు మీద వైసీపీ ధీటుగానే స్పందిస్తోంది. ఈ హెచ్చరికలతో వైసీపీ ఎమ్మెల్యేలలో కలవరం రేగుతోంది. దాంతో దీనిని బ్రేక్ చేయడమే కాకుండా తమ వైపు నుంచే పెను సవాల్ విసిరి కూటమి ఎత్తుకు పై ఎత్తు వేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
మొత్తం రాజీనామాలతో :
దాంతో ఆయన అనర్హత వేటు అని కూటమి చేసే బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని చెప్పేందుకు తామే సొంతంగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దానికి ఒక బలమైన కారణం అది కూడా ప్రజలలో భావోద్వేగం రగిలించేది ఎంపిక చేసుకుంటే కూటమిని ఇరకాటంలో పెట్టినట్లు అవుతుందని జనం మెప్పు పొందినట్లుగా ఉంటుందని చూస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అన్న ఇష్యూ మీద జనంలోకి వైసీపీ వెళ్తోంది.
జనంలో అతి పెద్ద చర్చ :
దాని మీదనే మరింత ఫోకస్ పెట్టి రాష్ట్ర ధర్నాతో పాటు బంద్ దాకా ఈ సమస్యలు తీసుకెళ్ళి జనంలో అతి పెద్ద చర్చ పెట్టాలని జగన్ చూస్తున్నారు. ఆ మధ్య మీడియా సమావేశంలో ఆయన చెప్పినట్లుగా తాను కూడా ఇదే ఇష్యూతో జనంలోకి వెళ్ళి పేదలకు దక్కాల్సిన అరోగ్యంతో పాటు వైద్య విద్యను ప్రభుత్వం ప్రైవేట్ చేతులలోకి పెడుతోంది అన్నది ఎలుగెత్తి చాటాలని చూస్తున్నారు అని అంటున్నారు సరిగ్గా ఇదే కారణంతో తమ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలతో రాజీనామా బాట పట్టాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు.
దసరా తరువాత :
ఇక దసరా తరువాత జనంలోకి జగన్ వెళ్తారని అంటున్నారు. మెడికల్ వార్ ని పీక్స్ కి చేర్చడమే కాకుండా గత ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తారని అంటున్నారు. అదే ఊపులో మూకుమ్మడి రాజీనామాల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. మరి అనర్హత వేటు వేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వానికి కానీ స్పీకర్ కి కానీ తమ రాజీనామాల ద్వారా వారే నిర్ణయం ఏమి తీసుకుంటారో ఆలోచించేలా చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ అతి పెద్ద రాజకీయ బాంబునే సిద్ధం చేశారు అని అంటున్నారు.
