Begin typing your search above and press return to search.

జగన్ 'లీగల్' అస్త్రం.. స్థానిక సమరంలో వైసీపీకి కొత్త ఊపు!

మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల అండతో ఏకగ్రీవాలు చేసుకోవాలనే కూటమి నేతల ప్రయత్నాలను వైసీపీ శ్రేణులు విజయవంతంగా అడ్డుకున్నాయని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అభినందించారు.

By:  Tupaki Political Desk   |   22 Oct 2026 6:36 PM IST
జగన్ లీగల్ అస్త్రం.. స్థానిక సమరంలో వైసీపీకి కొత్త ఊపు!
X

మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని విపక్షం వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిచిపోయేలా చేయడం ద్వారా ప్రభుత్వంపై పైచేయి సాధించామని జగన్ రెడ్డి అభిప్రాయపడినట్లుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయపోరాటంపై మాజీ సీఎం జగన్ రెడ్డి పార్టీ నేతలతో సమీక్షించారు. గురువారం తాడేపల్లిలోని కొద్దిమంది సీనియర్ నాయకులతో జగన్ రెడ్డి సమావేశమయ్యారని, కూటమి ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలపై చర్చించారని చెబుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల అండతో ఏకగ్రీవాలు చేసుకోవాలనే కూటమి నేతల ప్రయత్నాలను వైసీపీ శ్రేణులు విజయవంతంగా అడ్డుకున్నాయని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అభినందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననంపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలు, హింసాత్మక ఘటనలను పార్టీ తరఫున సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లి సక్సెస్ అయ్యామని, ఈ పోరాటాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

సుప్రీంకోర్టు సూచనలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడాన్ని వైసీపీ ఘనతగా మాజీ సీఎం జగన్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. కూటమి శ్రేణులు సృష్టించిన విధ్వంసాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వంపై నైతిక విజయం సాధించామని జగన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే పోలీసులను వాడుకుని హింసకు పాల్పడటాన్ని ఎక్కడా చూడలేదని ఆరోపించారు. ప్రభుత్వ దౌర్జన్యాన్ని క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తిరుగులేని ధైర్యంతో అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే రకమైన తెగువ చూపాలని జగన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలను ఆధారాలతోసహా నిరూపించాలని జగన్ రెడ్డి సూచించారు. ప్రతి ఘటనకు ఆధారాలు సేకరణ చాలా అవసరమని, ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా పార్టీ శ్రేణులు వీడియోలు, ఫొటోలు తీయాలని దిశానిర్దేశం చేశారని అంటున్నారు. ఆధారాలు పక్కాగా ఉంటే కోర్టుల్లో పోరాడటం తేలిక అవుతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవాలని పార్టీ సీనియర్లకు సూచించారు. కాగా, స్థానిక ఎన్నికల విషయంలో విపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించిందని అంటున్నారు. ప్రధానంగా కోర్టులను నమ్ముకుని ప్రభుత్వంపై పోరాడటం ద్వారా పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నూరిపోయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. అందుకే ఎక్కడ ఏ ఘటన జరిగినా ఫొటోలు, వీడియోలు తీయాలని, వాటినే ఆధారాలుగా వాడుకోవాలని ప్రణాళిక అమలు చేయనుందని చెబుతున్నారు.