కీలక సమయంలో బీజేపీని సవాల్ చేస్తున్న జగన్ ?
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కేంద్రంలో అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ ని 2009 లో ఎదిరించేటపుడు మొండి ధైర్యం తప్ప పటిష్టమైన వ్యూహం అన్నది ఏదీ లేదు.
By: Satya P | 19 Oct 2026 8:00 PM ISTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కేంద్రంలో అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ ని 2009 లో ఎదిరించేటపుడు మొండి ధైర్యం తప్ప పటిష్టమైన వ్యూహం అన్నది ఏదీ లేదు. కానీ ఇపుడు కేంద్రంలో బీజేపీని జగన్ సవాల్ చేసేందుకు మాత్రం సరైన ముహూర్తమే చూసుకుంటున్నారు అని అంటున్నారు. గత పన్నెండేళ్ళుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. 2014, 2019లలో పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ 2024 నాటికి తన బలం కోల్పోయి 240 సీట్లకే పరిమితం అయింది. దాంతో పాటు గడచిన రెండున్నరేళ్లలో మరింతగా యాంటీ ఇంకెంబెన్సీ మూట కట్టుకుంది. ఈ ఏడాది అయితే బీజేపీకి అసలు కలసి రావడం లేదు, జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన ఆందోళనకు ఏకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇపుడు ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఆందోళన చేస్తూంటే సీజేపీ కూడా జత కలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది.
అనూహ్యంగా మద్దతు :
ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఏపీలోని వైసీపీ సీజేపీ ఆందోళనలకు మద్దతు ఇచ్చింది. అంతే కాదు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో 2023లో చేసిన చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి తప్పు చేశామని జగన్ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ సభ్యుడిగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలలో ఉండాలని కోరుతున్నారు. అలా అయితేనే నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయని జగన్ గట్టిగా చెబుతున్నారు. అంతే కాదు ఆయన ఇటీవల కాలంలో తన రాజకీయ రూట్ ఏంటి అన్నది స్పష్టం చేస్తున్నారు. ఆయన తీరు చూస్తూంటే ఇండియా కూటమి వైపుగా అడుగులు వేస్తున్నారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీ అలెర్ట్ :
ఇదిలా ఉంటే జగన్ నుంచి గత కొన్నేళ్ళుగా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పొందుతున్న బీజేపీ ఏపీలో జగన్ తాజా వ్యాఖ్యలు ఆయన చేస్తున్న ట్వీట్లు వీటిని నిశితంగా బీజేపీ గమనిస్తోంది అని అంటున్నారు. జగన్ వ్యాఖ్యల వెనక ఏముంది అన్నది కూడా ఆరా తీసే పనిలో పడింది అని అంటున్నారు. జగన్ కనుక ఇండియా కూటమి వైపు నిజంగా అడుగులు వేస్తారా అన్నది కూడా కమలం పార్టీలో తర్జన భర్జన మొదలైంది. ఏపీలో బలమైన నాయకుడిగా ఉన్న జగన్ కనుక ఈ విధంగా కీలకంగా అడుగులు వేస్తే జాతీయంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయంగానూ రాజకీయ సమీకరణలలో భారీ మార్పులు వస్తాయని అంటున్నారు.
ఏపీలో భారీ మార్పులు :
ఏపీలో ఇపుడు వైసీపీ ఒంటరిగా ఉంది. ఇండియా కూటమిలో జగన్ చేరితే కాంగ్రెస్ బలం కూడా జతకూడితే మూడు పార్టీలతో కూడిన కూటమికి గట్టి పోటీ ఎదురవుతుంది అని అంటున్నారు. బలమైన ముస్లిం, దళితులు, క్రిస్టియన్ ఓటు షేర్ అంతా ఇండియా కూటమికే వెళ్తుంది అని లెక్క వేస్తున్నారు. దాంతో పాటు జాతీయ రాజకీయం ఏపీలో కూడా చర్చకు వస్తుందని, అపుడు న్యూట్రల్ సెక్షన్లు ఇతర వర్గాలు కూడా ఇండీ కూటమి వైపు మొగ్గు చూపే చాన్స్ ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే వామపక్షాలు కూడా ఇండియా కూటమిలో ఉంటాయి కాబట్టి విపక్షం బిగ్ సౌండ్ చేస్తుంది. అయిదేళ్ల తరువాత జరిగే ఎన్నికలు కాబట్టి యాంటీ ఇంకెంబెన్సీ ప్రభావంతో ఏపీలో అధికార ఎన్డీయేకు ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఇక తెలంగాణాలో కూడా ఈ ప్రభావం పడుతుందని జగన్ ఇమేజ్ తో అక్కడ రెడ్డి ఓటింగ్ పోలరైజ్ అవుతుందని అలాగే ఇతర సంప్రదాయ కాంగ్రెస్ వర్గాలు మరింత ఏకీకృతంగా హస్తం వైపు మొగ్గు చూపిస్తాయని అంటున్నారు. దాంతో రెండు రాష్ట్రాలలో 2024 లో అత్యధిక ఎంపీ సీట్లు సాధించుకుని కేంద్రంలో అధికారం అందుకున్న బీజేపీకి ఇది 2029 లో షాకింగ్ పరిణామంగా మారుతుందని అంటున్నారు.
ఆ రెండు బిల్లుల కోసం :
ఇక బీజేపీ ఎంతో ప్రతిష్టగా భావిస్తున్న ఆ రెండు బిల్లుల విషయంలో కూడా కలవరం చెందుతోంది అని అంటున్నారు. డీ లిమిటేషన్ బిల్లుని ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తోంది. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించుకోవాని కూడా పట్టుదలగా ఉంది. ఈ రెండు బిల్లులకు ఇప్పటిదాకా వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. ఏప్రిల్ లో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో సైతం ఈ బిల్లులకు వైసీపీ ఓటు వేయబట్టే ఎన్ డీయేకు 298 ఓట్లు దక్కాయి. ఇపుడు వైసీపీ విభేదిస్తే సంగతి ఏమిటి అన్నది కాషాయ శిబిరంలో చర్చ సాగుతోంది. ఇప్పటికీ ఎన్ని చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్ 362 ని చేరుకోవడానికి చాలా దూరంలోనే బీజేపీ ఉంది. ఉన్న ఓట్లలో వైసీపీ ఎంపీలవి తగ్గితే మరింత ఇబ్బంది అవుతుందని కూడా బీజేపీ శిబిరంలో చర్చ సాగుతోంది అని అంటున్నారు.
