ఫోన్ నంబర్ ఇవ్వలేదా? వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై పెద్ద వివాదం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై పెద్ద వివాదం చెలరేగింది.
By: A.N.Kumar | 16 Oct 2025 11:20 AM ISTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై పెద్ద వివాదం చెలరేగింది. కోర్టు ఆదేశాల ప్రకారం సమర్పించిన ఫోన్ నెంబర్ తప్పు అని తేలడంతో, ఆయన యూరప్ టూర్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక పిటిషన్‌ను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. తక్షణమే జగన్‌ను వెనక్కి రప్పించి, ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐ కోరుతోంది.
* జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ తప్పు: సీబీఐ ఆరోపణ
కోర్టు షరతుల ప్రకారం, విదేశీ పర్యటనకు వెళ్లే వ్యక్తి అందుబాటులో ఉండేందుకు తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ , ఈమెయిల్ ఐడీని సమర్పించాల్సి ఉంటుంది. అయితే, జగన్ తరఫున సమర్పించిన ఫోన్ నెంబర్ ఆయనది కాదని, అది వేరొకరికి సంబంధించిందిగా సీబీఐ గుర్తించింది.
ఈ అంశాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్తూ, "విదేశీ పర్యటనకు అనుమతి పొందిన వ్యక్తి అందుబాటులో ఉండకపోవడం కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం. తప్పుడు సమాచారంతో కోర్టు అనుమతి పొందడం బెయిల్ షరతులను ఉల్లంఘించడమే" అని పేర్కొంది. ఈ నేపథ్యంలో తక్షణమే జగన్ విదేశీ పర్యటన అనుమతులను రద్దు చేయాలని సీబీఐ కోర్టును కోరింది.
* 'సొంత ఫోన్ లేదు' అంశంపై సోషల్ మీడియాలో చర్చ
జగన్‌మోహన్ రెడ్డికి సొంత ఫోన్ నెంబర్ లేదని, ఆయన వ్యక్తిగతంగా సెల్ ఫోన్ ఉపయోగించరని గతంలో పలుమార్లు ప్రకటించారు. ఈ అంశం ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. కోర్టుకు తప్పుడు నంబర్ ఇవ్వడానికి ఈ 'సొంత ఫోన్ లేకపోవడం' కారణమా అనే కోణంలో సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.
బెయిల్‌పై ఉన్న వ్యక్తి, అందునా విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు, కోర్టుకు అందుబాటులో ఉండేందుకు సరైన మార్గాన్ని చూపించడంలో విఫలమయ్యారనేది ప్రధాన ఆరోపణ.
* ఈరోజు విచారణ: భారత్‌కు రావాల్సిన పరిస్థితి?
సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టు విచారణ చేపట్టనుంది. జగన్ తరఫు న్యాయవాదికి ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ చేసింది.
కోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి నట్లయితే, ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న జగన్ వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. 2012లో కేసుల్లో అరెస్టై, 16 నెలల జైలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలైన జగన్, ప్రతి విదేశీ పర్యటనకు ముందు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో, జగన్ యూరప్ టూర్ రద్దవుతుందా లేదా అన్నది కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది.
