స్నేహితుడిని తలచుకుని జగన్ భావోద్వేగం
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగానికి లోను అయ్యారు. ఎక్స్ ఖాతా ద్వారా తన మనసులోని భావాలకు ఆయన అక్షర రూపం ఇచ్చారు.
By: Satya P | 2 Nov 2025 9:44 PM ISTవైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగానికి లోను అయ్యారు. ఎక్స్ ఖాతా ద్వారా తన మనసులోని భావాలకు ఆయన అక్షర రూపం ఇచ్చారు. ఒక నా ప్రియ స్నేహితుడా నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను అని గాఢంగా తలచుకున్నారు. ఇంతకీ ఆ డియరెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మేకపాటి గౌతం రెడ్డి. ఆయన 2022 మార్చి నెలలో హఠాన్మరణం చెందారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన చిన్న వయసులోనే మృత్యువు ఒడిని చేరారు. గుండె పోటుతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో ఆయన ఎంతో కీలకమైన ఐటీ భారీ పరిశ్రమలు వంటి శాఖలను నిర్వహించారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మంచి పట్టుని సాధించారు. ఆయన మరణంతోనే జిల్లా కూడా వైసీపీకి రాజకీయంగా దూరం అయింది అని విశ్లేషణలు ఉన్నాయి.
పుట్టిన రోజున వేళ :
ఇక చూస్తే గౌతం రెడ్డి పుట్టిన రోజు నవంబర్ 2. ఆయన 1971లో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో దిగ్గజ నేతగా ఉన్నారు. జగన్ కాంగ్రెస్ ని వీడడంతోనే ఆయన వెంట నడచి కాంగ్రెస్ కి ఎంపీ పదవికి రాజీనామా చేసిన రెండవ నేతగా ఉన్నారు. ఉప ఎన్నికలో మళ్ళీ గెలిచి జిల్లాలో వైసీపీ సత్తా చాటిన వారుగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డి వారసునిగా 2 014లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జగన్ కేబినెట్ లో అతి ముఖ్యుడిగా ఉన్న గౌతం రెడ్డి మరణం జగన్ కి వ్యక్తిగతంగా తీరని లోటు అని అప్పట్లోనే చెప్పుకున్నారు.
జగన్ కి దోస్తుగా :
గౌతం రెడ్డి ఉన్నత విద్యా వంతుడు. మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్ పూర్తి చేసిన తరువాత కేఎంసీ సంస్థకు ఎండీగా పనిచేశారు. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చింది వైసీపీ నుంచే ఆయన తన రాజకీయ అడుగులు వేశారు. జగన్ కి ఆయన స్నేహితుడు కూడా. రాజకీయాల్లోకి రాక ముందే ఈ ఇద్దరూ మంచి మిత్రులు. నిజానికి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి వైసీపీ బాట పట్టడానికి గౌతం రెడ్డి ఒత్తిడి ప్రధాన కారణం అంటారు. ఆనాడు రాజమోహన్ రెడ్డి వైసీపీలోకి వచ్చారు కాబట్టే నెల్లూరు జిల్లా ఆ పార్టీకి 2014లో కానీ అంతకు ముందు ఉప ఎన్నికల్లో కానీ తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని అందించింది.
మొత్తం మీద చూస్తే జగన్ ఈ విధంగా ఎమోషన్ అవుతూ తన స్నేహితుడి గురించి చేసిన పోస్టు ఇపుడు రాజకీయంగా చర్చగా ఉంది. జగన్ తన మనోభావాలను పెద్దగా బయట పెట్టరు అని అంటారు. ఆయన మదిలోనే అన్నీ దాచుకుంటారు. కానీ ఎందుకో ఆయన తన డియరెస్ట్ ఫ్రెండ్ గురించి పుట్టిన రోజున గట్టిగా తలచుకోవాలనిపించింది. అందుకే సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇపుడు అది వైరల్ అయింది. వైసీపీ అభిమానులతో పాటు గౌతం రెడ్డి అభిమానులు కూడా దానిని చూసి నిజమే మిస్ అయ్యాం మంచి యువ నేతను అని అనుకుంటున్నారు.
